GVMC Council Chaos: విశాఖపట్నంలోని జీవీఎంసీ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గీతం యూనివర్సిటీ వివాదాస్పద భూముల అంశంపై జరిగిన కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. సమావేశం సందర్భంగా కూటమి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు పేలడంతో పరిస్థితి కాస్తా బాహాబాహీకి దారి తీసింది. కౌన్సిల్ హాల్ లోపల మాత్రమే కాకుండా బయట కూడా వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో వామపక్ష పార్టీలు జీవీఎంసీ మెయిన్ గేట్‌ను ముట్టడించాయి. గేట్లు తొలగించేందుకు వారు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తోపులాట నెలకొంది. వైసీపీ సభ్యుల ఆందోళనతో జీవీఎంసీ ప్రాంగణమంతా ఉద్రిక్తతగా మారింది.
Read Also: Botsa Satyanarayana: చంద్రబాబు, ఆయన కుటుంబం విశాఖలో భూదోపడీ చేస్తోంది..
ఇక, జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో జరిగిన టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల మధ్య తోపులాటలో 62వ వార్డు వైసీపీ కార్పొరేటర్ లక్ష్మణరావు కాలికి గాయమైంది. అతడికి వెంటనే చికిత్స అందించారు. ఈ పరిణామాలతో కూటమి తరఫున ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, పల్లా శ్రీనివాస్, వంశీ కృష్ణ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు. అయితే, సభ్యుల నిరసనలు తీవ్రరూపం దాల్చడంతో మేయర్ సభను వీడి తన ఛాంబర్‌కు వెళ్లిపోయారు. గీతం యూనివర్సిటీ భూముల వ్యవహారం కారణంగా జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం పూర్తిగా గందరగోళంగా మారగా, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భారీగా పోలీసులు మోహరించారు.