Vizag Steel Plant: ప్రైడ్ ఆఫ్ స్టీల్ అని గర్వంగా చెప్పుకునే విశాఖ ఉక్కు మనుగడ మీద ముసురుకున్న గాఢ మేఘాలు తొలిగిపోయాయి. ఎన్నికల హామీకి అనుగుణంగానే NDA ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ మనుగడను కాపాడే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. RINLకు 11500కోట్ల రూపాయల ఆర్ధిక సహాయం అందించేందుకు కేబినెట్ ఆమోదం లభించింది. దీంతో గత నాలుగేళ్ళుగా కార్మిక సంఘాలు సాగిస్తున్న పోరాటం.. రాజకీయ ఒత్తిళ్ళకు ఫలితం లభించినట్టైంది. విశాఖ ఉక్కు అంపశయ్య మీదకు వెళ్ళిన ప్రతీసారి NDA ప్రభుత్వమే రక్షించడం యాద్రుచ్చికం. 1996లో స్టీల్ ప్లాంట్ సిక్ ఇండస్ట్రీగా మారినప్పుడు అప్పటి వాజ్ పేయ్ ప్రభుత్వం ఆదుకుంది. సుమారు పదకొండు వందల కోట్ల ఆర్ధిక సహాయం లభించడంతో గట్టెక్కిన పరిశ్రమ.. తర్వాత కాలంలో స్టీల్ మార్కెట్లో ఓ వెలుగు వెలిగింది. ఐతే, శాశ్వత గనులు లేకపోవడం, నిర్వహణ భారం కారణంగా అప్పులు పెరిగిపోవడం వంటివి విశాఖ ఉక్కుకు శాపంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రయివేటీకరణ కత్తిని ఝుళిపించింది కేంద్రం.
Read Also: Bobby Deol: ‘హరిహర వీరమల్లు’ సినిమాపై బాబీ డియోల్ వైరల్ కామెంట్స్
డిజిన్వెస్ట్మెంట్ ప్రకటించడంతో ఉక్కు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. కార్మిక, ప్రజాపోరాటాలు, రాజకీయ ఒత్తిళ్ళను పరగణనలోకి తీసుకోవడం లేదనే అసంతృప్తివుంది. గత ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి హామీ ఇచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉక్కుకు ఊపిరిపోసే బాధ్యత తీసుకుంటామని ఉమ్మడి ప్రకటన చేశాయి. ఈ నేపథ్యంలో స్టీల్ మినిస్టర్ కుమార స్వామి నేరుగా రంగంలోకి దిగారు. హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసి ఆర్ఐఎన్ఎల్ వాస్తవ పరిస్ధితి మీద అధ్యయనం చేయించారు. ఈ స్ధాయిలో కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు స్ధితిగతులపై దృష్టి సారించడం ఇదే తొలిసారి. కుమార స్వామి పర్యటన తర్వాత టాటా స్టీల్, జెఎస్ డబ్ల్యూ, ఎన్ఎండీసీ వంటి ప్రభుత్వ, ప్రయివేట్ సంస్ధలు ఆర్ధిక సహాయం అందించాయి. ఫలితంగా శాశ్వత మూసివేత ప్రమాదం నుంచి విశాఖ ఉక్కు బయటపడింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భారీ రివైవల్ ప్యాకేజ్ ప్రకటించి అమలు చేస్తే తుక్కుగా మారిపోవాల్సిన స్టీల్ ఇండస్ట్రీ మనుగడకు తాత్కాలిక ముప్పు తొలగినట్టే లెక్క.
Read Also: Nandigama Crime: నందిగామలో మహిళ దారుణ హత్య..! వెలుగులోకి సంచలన విషయాలు..
ఇప్పటికే స్టీల్ ప్లాంట్ కు 1150కోట్ల రూపాయలు ఎమర్జెన్సీ అడ్వాన్స్డ్ ఫండ్ కింద ఉక్కుశాఖ విడుదల చేసింది. జీఎస్టీ చెల్లింపులకు 500 కోట్లు, ముడిసరకుకు సంబంధించి బ్యాంకు అప్పుల చెల్లింపులకు 1,150 కోట్ల రూపాయలు చొప్పున రెండు విడతల్లో సాయం చేసింది. ఇంకా టాటా ఇంటర్నేషనల్ కు, జెఎస్పీఎల్ చెరో మూడు వేల కోట్లు.. ఎన్ఎండీసీకి 1500 కోట్లు బాకీలు వున్నాయి. వర్కింగ్ క్యాపిటల్ కోసం చేసిన అప్పుల భారంతో పాటు, తగినంత ముడిసరకు లేకపోవడం, కోర్టు ఎటాచ్‌మెంట్లు, ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ తో విశాఖ ఉక్కు కర్మాగారం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. వరుసగా రెండో ఏడాది భారీ నష్టాలను మూట గట్టుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన ప్రకటించడంతో స్టీల్ ప్లాంట్ మనుగడ మీద ఆశలు చిగురిస్తున్నాయి. 7.3 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం కలిగి వున్న విశాఖ ఉక్కులో మూడు బ్లాస్ట్ ఫర్నేసులు వున్నాయి. గోదావరి, కృష్ణా, కావేరీ బీఎఫ్ ల ద్వారా రోజుకు 21 వేల టన్నుల హాట్ మెటల్ ఉత్పత్ చేయగలుగుతాయి. ఐతే, ముడి పదార్థాల కొరత కారణంగా రెండు బ్లాస్ట్ ఫర్నేసులు నడుస్తుండగా 6వేల టన్నుల లిక్విడ్ స్టీల్ మాత్రమే అందుబాటులోకి వస్తోంది. దీనికి ప్రధాన కారణం, విశాఖ ఉక్కుకు శాశ్వత గనులు లేకపోవడమే. దేశంలోనే గర్వించ దగ్గ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ గా త్యాగాల పు నాదుల మీద నిర్మించిన ఈ భారీ పరిశ్రమకు ఇప్పటికీ బాలారిష్టాలు తప్పడం లేదు. ఫలితంగా ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ప్రతీసారీ సహాయం కోసం కేంద్రం వైపు ఎదురు చూపులు చూడాల్సిన దుస్ధితి. ఈ నేపథ్యంలోనే ప్రయివేటీకరణ ప్రకటన తర్వాత సెయిల్ లో విలీనం చేయాలనే డిమాండ్ బలంగా పుట్టింది. అనివార్యంగా రాజకీయ పక్షాలు మద్దతు లభించింది. మారిన పరిస్ధితుల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుపుతున్న NDA తెలుగు ప్రజల ఆకాంక్షలను గౌరవించింది.
Read Also: Venky : సంక్రాంతికి వచ్చాడు.. వంద కోట్లు రాబట్టాడు
అయితే ఉద్దీపన ప్యాకేజ్ రావడంతో ఊపిరి పీల్చుకుంటున్న కార్మిక వర్గాలకు ‘పోస్కో’ టెన్షన్ మొదలైంది. ఈ సంస్థ నాలుగేళ్ల క్రితమే విశాఖ ఉక్కుతో జాయింట్ వెంచర్ కోసం ప్రయత్నించింది. ప్లాంటులో 1,500 ఎకరాలు కేటాయిస్తే స్టీల్ ఉత్పత్తి చేసి, లాభాల్లో వాటా ఇస్తామని అప్పట్లో ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనను కార్మిక వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. విశాఖ స్టీల్‌ను ప్రైవేటుపరం చేయడానికి కుట్ర చేస్తున్నారంటూ ఆందోళనలు చేపట్టాయి. దాంతో ఆ ఆలోచన పక్కనపెట్టారు. ఇప్పుడు కేంద్రం విశాఖ ఉక్కులో ప్రైవేటు భాగస్వామ్యం పెంచి, పనితీరు మెరుగుపరచాలని.. నష్టాలు తగ్గించి, లాభాల బాటలో నడపాలని యోచిస్తోంది. దీనికి కొత్త టెక్నాలజీ ఉపయోగించాలని భావిస్తోంది. ఉక్కు పరిశ్రమకు సాంకేతిక సహకారం అందించడం ద్వారా పునర్జీవం కల్పించేందుకు భారీ ఉద్దీపన ప్రకటించింది కేంద్రం. ఆ దిశగా ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేసులు ఏర్పాటుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ చర్యల వల్ల తాత్కాలిక ఉపసమనమే తప్ప అసలు సమస్య పరిష్కారం కాదంటున్నాయి కార్మిక సంఘాలు. పైగా కేంద్రం నుంచి మళ్లీ మళ్లీ సహాయం లభించదుకనుక “ఆర్ఐఎన్ఎల్”ను సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.