NTV Telugu Site icon

CM Jagan: నేడు విశాఖకు సీఎం.. శ్రీశారదా పీఠాన్ని సందర్శించనున్న జగన్

Jagan

Jagan

ఏపీ సీఎం జగన్ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ విశాఖ శ్రీశారదా పీఠాన్ని సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. నిన్న (మంగళవారం) కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున, జాయింట్‌ సీపీ ఫకీరప్ప ఏర్పాట్లపై పీఠం ప్రతినిధులతో సమీక్షించారు. నిన్న మధ్యాహ్నం ఎయిర్‌పోర్టు నుంచి శారద పీఠం వరకు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. సీఎంను చూసేందుకు భారీ ఎత్తున ప్రజలు వస్తుండటంతో ఎక్కడికక్కడ బారీకేడ్లు ఏర్పాటు చేశారు. చినముషిడివాడ ప్రధాన కూడలి నుంచి పీఠం వరకు రెయిలింగ్‌ ఏర్పాటు చేశారు. మరోవైపు, సీఎం హోదాలో నాలుగోసారి శారదా పీఠానికి వస్తుండటంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అపూర్వ స్వాగతం పలికేందుకు పీఠం ప్రతినిధులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు, సీఎంను ఆహ్వానించేందుకు ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

Read Also: Vasanthi Krishnan Marriage: పవన్ కల్యాణ్‌ను పెళ్లి చేసుకున్న బిగ్‍‌బాస్ వాసంతి!

కాగా, ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరనున్న సీఎం జగన్‌ గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో 11.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చినముషిడివాడలోని శ్రీశారదా పీఠానికి 11.40 గంటల వరకు చేరుకుంటారు. సంప్రదాయ వస్త్రాలు ధరించి పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీతో కలిసి పీఠంలోని దేవతామూర్తులకు సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాజశ్యామల యాగంలో పాల్గొంటారు. దాదాపు గంట పాటు శారదా పీఠంలో జరగనున్న పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వైఎస్ జగన్ పాలుపంచుకోనున్నారు. ఆ తర్వాత 12.55 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి గన్నవరం చేరుకుని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి జగన్ రానున్నారు.