NTV Telugu Site icon

వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన తిరుమల.. క్యూ కట్టిన వీఐపీలు

తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం నాడు వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈరోజు అర్ధరాత్రి 12 గంటల తర్వాత నిత్యసేవలు, కైంకర్యాల అనంతరం వేకువజామున 1:45 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కానుంది. తొలుత ప్రొటోకాల్ పరిధిలోని వీఐపీలను శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. ఈ నేపథ్యంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం పలువురు వీఐపీలు తిరుమలకు వస్తున్నారు.

మొత్తం 11 మంది మంత్రులు వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలకు రానున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా 33 మంది సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు కూడా తరలిరానున్నారు. ఇప్పటివరకు తిరుమలకు 25 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు చేరుకున్నారు. కాగా 10 రోజుల పాటు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం ద్వారా స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని గురువారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు స్వర్ణరథంపై స్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఎల్లుండి ద్వాదశి రోజున ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు.