Vijayawada Politics: విజయవాడ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారంపై రాజకీయ దుమారం

Vijayawada

Vijayawada

Vijayawada Politics: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (VMC) కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం రాజకీయ వివాదానికి దారితీసింది. ఎన్నికైన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారాన్ని కౌన్సిల్ హాల్‌లో కాకుండా అంబేద్కర్ కళా వేదికలో నిర్వహించేందుకు VMC అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఎన్నికైన కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులకు అధికారులు అధికారిక సమాచారాన్ని పంపించారు. అయితే, ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అంబేద్కర్ కళా వేదికలో ఏర్పాటు చేయడంపై వైసీపీ కార్పొరేటర్లు, ఆ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బెజవాడ కార్పొరేషన్ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కౌన్సిల్‌లోనే నిర్వహించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్ చేస్తోంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అసెంబ్లీకి ఒక రూల్, కౌన్సిల్‌కు మరో రూల్ ఉంటుందా? అని వైసీపీ కార్పొరేటర్లు అధికారులను ప్రశ్నిస్తున్నారు. అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వైసీపీ నేతలు, కార్పొరేటర్లు నేడు కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిరంగ సభ నిర్వహిస్తున్న తరహాలో ఏర్పాటు చేస్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో VMC కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార వేదిక అంశం విజయవాడలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.