Site icon NTV Telugu

Vallabhaneni Vamsi: అజ్ఞాతంలోకి వల్లభనేని వంశీ.. అసలు కారణం అదేనా..?

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన అనుచరులు తనపై దాడికి పాల్పడ్డారంటూ నూతక్కి సునీల్ అనే వ్యక్తి విజయవాడ మాచవరం పోలీసులకు ఈనెల 17న ఫిర్యాదు చేశారు. దీంతో.. పోలీసులు కేసు ఫైల్ చేశారు. వంశీతో పాటు ఎనిమిది మందిపై హత్యాయత్నం సహా పలు కేసులు నమోదయ్యాయి. కేసు నమోదైన సంగతి తెలిసిన దగ్గర్నుంచి వంశీ ఎవరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. వంశీ తో పాటు కేసులో నిందితులుగా ఉన్న మిగతా వారు కూడా కనిపించడం లేదు. దీంతో.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరినీ అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కొన్ని టీమ్‌లు హైదరాబాద్‌లో గాలిస్తున్నాయి.

Read Also: Fake Ornaments: వేంకటేశ్వర స్వామికి నకిలీ ఆభరణాలు.. అసలు నగలు మాయం..!

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వంశీ పై 13 కేసులు నమోదయ్యాయి. వివిధ కేసుల్లో ఆయన 140 రోజులపాటు విజయవాడ సబ్ జైల్‌లో గడిపారు. ఒక కేసులో బెయిల్ వచ్చిన తర్వాత మరొక కేసులో అరెస్టు చేయడంతో వంశీ 140 రోజులపాటు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్ని కేసుల్లో బెయిల్ వచ్చిన తర్వాత వంశీ నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. స్థానికంగా పార్టీ కార్యక్రమాలతో పాటు.. సన్నిహితుల కార్యక్రమాలకు కూడా హాజరవుతూ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఇదే సమయంలో 2024లో తనపై దాడికి పాల్పడ్డారని సునీల్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో తాజా కేసు నమోదు అయింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని వంశి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అది విచారణ దశలో ఉంది. ఆ విచారణ పూర్తయ్యే లోపే వంశీని ఇతర నిందితులను అరెస్టు చేయటానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Exit mobile version