Site icon NTV Telugu

Andhra Pradesh: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కీలక బాధ్యతలు

వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి సీఎం జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. వైసీపీ అనుబంధ విభాగాల ఇంఛార్జ్‌గా ఎంపీ విజయసాయిరెడ్డిని నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. కాగా వైసీపీ అనుబంధ విభాగాల ఇంఛార్జిగా తనను నియమించినందుకు సీఎం జగన్‌కు ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను అంకితభావంతో నిర్వర్తిస్తానని.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

కాగా 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి విజయసాయిరెడ్డి తీవ్రంగా కృషి చేశారు. సీఎం జగన్ నేరుగా ప్రజల్లో ఉంటే క్షేత్ర స్థాయి వ్యూహాల్లో విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు. ప్రశాంత్ కిషోర్ టీమ్ చెప్పిన ప్లాన్ పక్కాఆ అమలు అయ్యేలా చూసే బాధ్యత కూడా విజయసాయిరెడ్డిదే అని ప్రచారం సాగింది. అటు చంద్రబాబు, లోకేష్‌ను నిత్యం ట్విట్టర్ ద్వారా విమర్శించడం కూడా ఆయన వ్యూహాల్లోనే భాగమని తెలుస్తోంది. అయితే ఇటీవల విజయసాయిరెడ్డి, జగన్ మధ్య గ్యాప్ వచ్చిందని తీవ్ర ప్రచారం సాగింది. ఈ సమయంలో ఎంపీ విజయసాయిరెడ్డికి పార్టీ అన్ని అనుబంధ విభాగాలను సీఎం జగన్ అప్పగించడంతో ఈ ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడిందని చెప్పొచ్చు.

Exit mobile version