విశాఖపట్నం ఎన్‌సీసీ భూముల వివాదంలో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ నాయకులు, కొన్ని మీడియా సంస్థలపై ఎంపీ విజయసాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలోనే ఎన్‌సీసీ భూముల లావాదేవీలు జరిగాయని, తిరుపతి వేంకటేశ్వర స్వామిపై ఒట్టు పెట్టి నిజాలు చెప్పగలరా..? అని ఆయన ప్రశ్నించారు. కోట్లాది రూపాయలు తీసుకుని ఎన్‌సీసీ కంపెనీకి లబ్ది చేకూర్చింది చంద్రబాబు నాయుడే అని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఆల్జీ మర్స్ తో బాధ పడుతున్నారని, దేవుడు ఆయుష్హు ఇస్తే వచ్చే ఎన్నికల వరకు మాత్రమే చంద్రబాబు రాజకీయాలు చేయగలిగేది అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రలో బీసీల కడుపు కొట్టి భూములను చంద్రబాబు సామాజిక వర్గం ఆక్రమించిందని, ఆ భూముల విలువ కనీసం 10వేల కోట్లు ఉంటుందన్నారు. గత ఆరు నెలలుగా ఆక్రమణ దారులకు ధైర్యం వచ్చిందని, ఎంత దుష్ప్రచారం చేసిన భూముల అక్రమాలను సహించేది లేదన్నారు.
భూములు అన్నీ స్వాధీనం చేసుకుంటామని, సుజనా చౌదరి ఆర్ధిక నేరగాడు అంటూ ఆయన మండిపడ్డారు. అయ్యన్నపాత్రుడు మోస్ట్ వాగుడుకాయి అని, ఆయన ఇంటి పేరు చింత కాయ కాదు మిరపకాయలు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. అయ్యన్న తాగితే మనిషి కాదు…రాత్రీ,పగలు తాగే ఉంటాడని ఆయన విమర్శించారు. అయ్యన్న, ఆయన కొడుకు విజయ్ కి బినామీ కంపెనీలు ఉన్నాయని, బెంగుళూరులో మోసాలకు పాల్పడ్డారని ఆయన అన్నారు. అయ్యన్న కొడుకుల మోసాలపై ఈడీకి ఫిర్యాదు చేస్తానని, జీఆర్పీఎల్ కంపెనీ మురళీ, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావుకు మంచి స్నేహితుడని, జీఆర్పీఎల్ కంపెనీలో నా అల్లుడికి వాటాలు ఉన్నాయనేది అసత్య ప్రచారమన్నారు. ఎమ్మెల్యే వెలగపూడి, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని, క్రిమినల్ , సివిల్ డిఫార్మేషన్ కేసులను న్యాయస్థానంను ఆశ్రయిస్తామని ఆయన వెల్లడించారు.