ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని అన్నారు. ఆయన తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల ఏటా 16 వేల కోట్ల రూపాయల నిధులను వైద్య ఆరోగ్యశాఖకు కేటాయిస్తున్నారని తెలిపారు. మున్సిపాలిటీ, పట్టణాలలో హెల్త్ సెంటర్లు నిర్మాణానికి మరియు కొత్త హాస్పటల్స్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె అన్నారు. శనివారం వినుకొండ పట్టణంలోని స్థానిక ఎన్ఎస్పి కాలనీ ప్రాంతంలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ప్రారంభించడానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆమె ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో నాటి ప్రభుత్వ హయాంలో కన్న నేడు ప్రజలకు సంక్షేమము, వైద్యము మరియు విద్య అందించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 1145 ఆసుపత్రులలో 977 ఆసుపత్రులను పునర్ నిర్మిస్తున్నట్టు, 175 కొత్త ఆసుపత్రులను నిర్మాణం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. 477 కోట్లతో ఆసుపత్రులను నిర్మాణం చేస్తున్నామని 253 కోట్లతో కొత్తగా హాస్పిటల్ ను నిర్మిస్తున్నామని తెలిపారు. అదే విధంగా రాష్ట్రంలో 560 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని వాటికోసం 400 కేంద్రాలను పునర్మిస్తున్నామని 144 కేంద్రాలను కొత్తగా నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను నిర్మాణం చేయడానికి 348 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. జిల్లాలో 16 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు మంజూరు కాగా, వినుకొండ పట్టణంలో నేడు ప్రారంభించిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ మొదటిగా నిర్మాణం పూర్తి చేసుకుందని అందుకే ఎంతో సంతోషిస్తున్నానని ఆమె తెలిపారు.
అదే విధంగా వినుకొండలో వున్న ముప్పై పడకల ఆసుపత్రిని అతి త్వరలోనే వంద పడకల ఆసుపత్రిగా మార్చనున్నట్లు వినుకొండకు ట్రామా అండ్ ఎమర్జెన్సీ సెంటర్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్లో కిడ్నీ డయాలసిస్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా తొమ్మిదేళ్ళ బాలుడికి బోన్ మ్యారో ట్రాన్స్పటేషన్ (కాన్సర్) సర్జరీ అత్యవసరంగా చేయవలసి ఉందని దానికి 35 లక్షల ఖర్చు అవుతుందని బాలుడి తల్లి చేసిన విజ్ఞప్తి మేరకు ఆ బాలుడికి కావాల్సిన చికిత్సను అందించడానికి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని దానిలో భాగంగా నేడు ప్రైమరీ అర్బన్ హెల్త్ సెంటర్ను అనుకున్న సమయంలో పూర్తిచేసి జిల్లాలోనే మొదటిగా ప్రారంభించడం సంతోషపడుతున్నామని తెలిపారు.
Read Also: Botsa Satyanarayana: ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం
జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్ నకు అదనపు తరగతుల నిర్మాణం కోసం నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా నిర్మాణం చేస్తున్నట్లు 2.80 లక్షల నిధులతో నిర్మాణం చేయడానికి ఎకరంన్నర స్థలంలో శంకుస్థాపన చేశారు. రైతు బజారుకు ఎకరం స్థలంలో శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గం అభివృద్ధి కోసం తాను చేస్తున్న కృషిలో మంత్రి విడదల రజిని, జిల్లా కలెక్టర్ శివశంకర్, జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ తదితరుల తోడ్పాటు ఎంతో ముఖ్యమైనదని అందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. అతి త్వరలోనే నియోజకవర్గంలో పేద రైతులకు ప్రభుత్వ భూములను అందించనున్నట్లు తెలిపారు.
