NTV Telugu Site icon

పీవీ గొప్ప రాజనీతిజ్ఞుడు.. ఆయనకు తగిన గౌరవం లభించలేదు

Venkaiah Naidu

Venkaiah Naidu

పీవీ గొప్ప రాజనీతిజ్ఞుడు.. ఆర్థిక సంస్కరణలకు మార్గదర్శకుడు.. కానీ, ఆయన సేవలకు తగిన గౌరవం లభించలేదన్నారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు… మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి సందర్భంగా నివాళులర్పించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పీవీని బహుముఖ ప్రజ్ఞాశాలిగా అభివర్ణించారు.. మాతృభాష పట్ల ఆయనకున్న ప్రేమను గుర్తు చేసుకున్నారు.. ఏ దేశం అయినా సంస్కృతి, వారసత్వం, గొప్ప నాయకుల సేవలను మరచిపోయి ముందుకు సాగలేదన్నారు.. విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలకు మార్గదర్శకత్వం వహించిన క్రాంతదర్శిగా పీవీని అభివర్ణించిన ఉపరాష్ట్రపతి, వారి నాయకత్వం మరియు దూరదృష్టి ద్వారా ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని అభివృద్ధి పథంలోకి మరలించారని తెలిపారు. పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాష కోవిదుడు అని తెలిపిన ఉపరాష్ట్రపతి.. వారి మాటల్లో చమత్కారం, చేతల్లో నిర్వహణా సామర్థ్యం మరువలేనివని తెలిపారు. విశాఖ పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి, సర్క్యూట్ హౌస్ జంక్షన్ వద్ద పీవీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.

పీవీ ప్రారంభించిన విప్లవాత్మక సంస్కరణలు గత మూడు దశాబ్ధాలుగా దేశాభివృద్ధిని వేగవంతం చేసేందుకు దోహదపడ్డాయన్న ఉపరాష్ట్రపతి, వారి సంస్కరణలను మాజీ ప్రధాని వాజ్ పేయి అదే స్ఫూర్తితో అమలు చేయగా, ప్రధాని నరేంద్ర మోదీ మరింత వేగవంతం చేశారని తెలిపారు. సంస్కరణల అమలు తక్షణ అవసరమన్న ఉపరాష్ట్రపతి, ఉత్తమమైన పద్ధతులు అవలంభిస్తూ ముందుకు సాగాలని సూచించారు. దేశంలో లైసెన్స్ రాజ్ ను రద్దు చేసిన ఘనత పీవీ నరసింహారావుదన్న ఆయన.. భారత ఆర్థిక సరళీకరణల నిర్మాతగా వారిని అభివర్ణించారు. ముఖ్యంగా, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యు.టి.వో)లోకి భారతదేశ ప్రవేశానికి వీలు కల్పించినది వారేనని తెలిపారు. ప్రపంచ యవనికపై దేశ ప్రయోజనాలను సమర్థవంతంగా పరిరక్షించిన పీవీ, ఎంతో క్లిష్టమైన సమయంలో దేశ పాలనా పగ్గాలను చేపట్టి, వ్యూహాత్మకంగా దేశాభివృద్ధిని గాడిలో పెట్టారని తెలిపారు. పీవీ భాషాభిమానాన్ని గుర్తు చేసుకున్న ఉపరాష్ట్రపతి, శ్రీ విశ్వనాథ వారి ‘వేయిపడగలు’ నవలను ‘సహస్రఫాణ్’ గా హిందీలోకి అనువదించిన విషయాన్ని ప్రస్తావించారు. అంతేగాక ప్రసిద్ధ మరాఠీ నవల ‘పాన్ లక్షత్ కోన్ ఘేతో’ని ‘అబల జీవితం’ పేరిట తెలుగులోకి అనువదించారని తెలిపారు. బహుభాషా కోవిదుడైన పీవీ మాతృభాషలో ప్రాథమిక విద్య సాగాలని ఆకాంక్షించారన్న ఉపరాష్ట్రపతి, హైస్కూల్ స్థాయి వరకూ బోధనా మాధ్యమం మాతృభాషగా ఉండాలన్న తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. పీవీ లాంటి గొప్ప నాయకుడి సేవలకు తగిన గుర్తింపు, గౌరవం లభించలేదన్న ఉపరాష్ట్రపతి, ఆయన శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని, దేశనిర్మాణంలో పీవీ కృషిని ముందు తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.