మెట్ట ప్రాంత ఆరోగ్య దైవంగా విరాజిల్లుతున్న శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని దుత్తలూరు మండలం నర్రవాడ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. రెండేళ్లుగా కరోనా కారణంగా ఉత్సవాలు నిర్వహించలేదు. ఈ ఏడాది భారీగా భక్తులు వస్తారని ఉద్దేశంతో ముందస్తుగా వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో విస్తృత సమావేశం ఏర్పాటు చేశారు .ముఖ్యంగా ఐదు రోజుల పాటు జరిగే వెంగమాంబ బ్రహ్మోత్సవాలు ఈనెల 19వ తేదీ రాత్రి వెంగమాంబ పేరంటాలు పుట్టినిల్లయిన వడ్డీ పాలెం లో జరిగే కార్యక్రమంలో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 20 , 21న రథోత్సవం , 22న అమ్మ వారి కల్యాణోత్సవం, పసుపు కుంకుమ ఉత్సవం, రాత్రి ప్రధానోత్సవం జరుగుతుంది. అలాగే ఉత్సవాల్లో చివరి రోజు 23న ఎడ్ల బండలాగుడు పోటీలు జరుగుతాయి.
అలాగే ఉత్సవాలు జరిగే ఐదు రోజులు ఆలయం వద్ద ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉత్సవాలకు వచ్చే భక్తులకు అత్యవసర సేవలు అందించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 24 గంటల పాటు వైద్య సేవలు అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వైద్య అధికారులు ఆరోగ్య వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. ప్రజలకు ప్రభావితం కాకుండా అన్ని శాఖల అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు 108 104 వాహనాలు ఉత్సవాలు ప్రత్యేకంగా కేటాయించారు అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉంచారు. బ్రహ్మోత్సవాల్లో వచ్చే రాకపోకలకోసం భక్తుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను వాహనాలను ఏర్పాటు చేశారు.
వెంగమాంబ చరిత్ర…
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని దుత్తలూరు మండలం నర్రవాడలో వెలసిన శ్రీ వెంగమాంబ పేరంటాలు ఆలయం శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచే ఇక్కడ అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. స్థానికులకు అమ్మవారి పై ఎంతో నమ్మకం విశ్వాసం. అమ్మ వారి చరిత్రను గొప్పగా చెప్పుకుంటారు. నర్రవాడ సమీపంలోని వడ్డిపాలెం గ్రామానికి చెందిన పచ్చవ వెంగమ్మ నాయుడు సాయమ్మ లకు వెంగమాంబ జన్మించింది . బాల్యం నుంచే దైవ చింతన కలిగిన ఆమెను నర్రవాడకు చెందిన వేమూరు గురవయ్యతో వివాహం అయింది. మెట్టినింటిలో అత్త ఆడబిడ్డల నుంచి అనేక బాధలు ఎదురయ్యాయి అయినా వాటిని భరించింది.
భర్త సోదరుడు అంధుడు ఆయనకు ఎన్నో సేవలు చేసింది. దీంతో భర్త ప్రేమానురాగాలను పొందింది. భర్త రోజు పశువులను మేపేందుకు సమీపంలోని దొడ్డగడ్డ అటవీ ప్రాంతానికి వెళ్ళేవారు. ఒకరోజు వెంగమాంబ తన స్నేహితురాళ్లతో కలిసి అదే ప్రాంతానికి గడ్డి కోసం వెళ్ళింది. ఆ సమయంలో కొందరు గజదొంగలు వారిపై దాడి చేశారు.
వారు గట్టిగా కేకలు వేశారు. సమీపంలోనే ఉన్న వెంగమాంబ భర్త దొంగలపై తలపడి వారిని అంతం చేశాడు. తప్పించుకున్న ఒక దొంగ ఈటెను విసరడంతో అది గురవయ్య గుండెలోకి దూసుకు వెళ్ళింది. గాయపడిన గురవయ్య అదే ఈటెను బయటకు లాగి దొంగను హతమార్చి స్ప్రహ కోల్పోయాడు. వైద్యం చేయించినా మూడు రోజుల వరకు గురవయ్యలో ఎలాంటి చలనం లేదు భర్త మరణించక ముందే తాను కూడా అగ్ని ప్రవేశం చేయాలని వెంగమాంబ భావించింది. మరణించిన భర్త అగ్ని గుండం దగ్గరకు తీసుకువచ్చి దహనం చేశారు. వెంగమాంబ కూడా అగ్నిప్రవేశం చేసి తనువు చాలించింది. ఆమె పేరు మీద ఏటా ఉత్సవాలు జరుగుతాయి.
