Vellampalli Srinivas: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. సంక్షేమ పాలన అందిస్తున్న జగన్ ప్రభుత్వంపై అక్కసుతో పవన్ కళ్యాణ్ కావాలనే అక్కసు వెళ్లగక్కుతున్నాడని ఆరోపించారు. ఆనాడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో అసలైన కోవర్టు పవన్ కళ్యాణేనని విమర్శించారు. చిరంజీవి 18 ఎమ్మెల్యే స్థానాలకు పరిమితం కాగానే బయటకు వెళ్ళిపోయిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. యువరాజ్యం అధినేతగా పవన్ కళ్యాణ్ నిలబడ్డాడా.. ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏం పీకాడని వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం విలీనానికి మొదటి కారణం పవన్ కళ్యాణ్ అన్నారు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరూ చివరి వరకు చిరంజీవితోనే ఉన్నారని గుర్తుచేశారు.
చిరంజీవితో పాటు కాంగ్రెస్ పార్టీలో తాము కొనసాగామన్నారు. సినిమా ఫంక్షన్‌లలో చిరంజీవిని అవమానించే విధంగా వ్యవహరించింది పవన్ కళ్యాణ్ కాదా అని వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. తాను జనసేన పార్టీ పెట్టుకున్నాడు కాబట్టి .. ఇప్పుడు చిరంజీవి అవసరం వచ్చిందని.. చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడని నిలదీశారు. జగన్, చిరంజీవికి మధ్య గ్యాప్ తీసుకుని రావాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. 2014లో చంద్రబాబు సీఎం కావటానికి పవన్ కళ్యాణ్ సహకరించింది వాస్తవం కాదా అన్నారు. ఈ రాష్ట్రానికి 20 ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలని బహిరంగ వేదికలో పవన్ కళ్యాణ్ చెప్పింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి కావాలని, కాపు సామాజిక వర్గానికి అండగా నిలబడాలని ఉండదన్నారు.
వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 20 చోట్ల పోటీ చేసినా ఓడిపోవటం ఖాయమని వెల్లంపల్లి శ్రీనివాస్ జోస్యం చెప్పారు. కడపకు వెళ్లి సవాళ్లు విసురుతున్నాడని.. కడపలో కార్పొరేటర్‌గా అయినా పవన్ కళ్యాణ్ గెలవగలడా అని ఎద్దేవా చేశారు. నారా లోకేష్, చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు వేర్వేరుగా వచ్చినా, కలిసి వచ్చినా ఓడిపోవటం ఖాయమన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగరటం ఖాయమని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ తమతో కలిసి ఉంటాడని బీజేపీ నేతలకు నమ్మకం లేదని.. అందుకే రాజకీయ పార్టీగా ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రేపు బీజేపీతో కలిసి ఉండడని.. ప్యాకేజీ కోసం చంద్రబాబుకు అమ్ముడుపోతాడని విమర్శించారు.
మరోవైపు ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ కూడా పవన్ కళ్యాణ్‌పై మండిపడ్డారు. పవన్ కళ్యాణ్‌ది జనసేన కాదు ధనసేన అని ఆరోపించారు. పేమెంట్ రాగానే పవన్ కళ్యాణ్ మూవ్‌మెంట్ మారిపోతుందన్నారు. టీడీపీకి పెయిడ్ ఆర్టిస్టుగా పవన్ మారారని.. గత ఎన్నికల్లోనే ప్రజలు టీడీపీ, జనసేన పార్టీలను వదిలించుకున్నారు. పవన్ మూడు నెలలకు ఒకసారి కోమలో నుంచి వచ్చి డ్రామాలు ఆడుతున్నారన్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్వలేక సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
