NTV Telugu Site icon

Vasantha Krishna Prasad: నా తండ్రి అందుకే కేశినేని నానిని కలిశారు..!!

Vasanta Krishna Prasad

Vasanta Krishna Prasad

Vasantha Krishna Prasad: వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. తన తండ్రి టీడీపీ ఎంపీ కేశినేని నానిని కలవడంపైనా క్లారిటీ ఇచ్చారు. కేశినేని నాని కుమార్తె పెళ్లికి తన తండ్రి వసంత నాగేశ్వరరావు వెళ్లలేకపోయారని.. పెళ్లికి వెళ్లలేదు కాబట్టే కర్టసీగా కేశినేని నానిని పలకరించడానికి వెళ్లారని తెలిపారు. కేశినేని నానితో తన తండ్రి భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. మరోవైపు తన కామెంట్ల వల్ల పార్టీ అధిష్టానం ఇబ్బంది పడుతుందని భావించడం లేదన్నారు.

యదార్ధ వాది లోక విరోధి తాను వాస్తవాలు మాట్లాడుతోన్న వాటిని సంచలనాలు అంటున్నారని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. రాజకీయాల్లోకి వచ్చాక చేయాల్సినవి చేయలేకపోయాననే అసంతృప్తి ఉందని.. పార్టీలో కొందరు సొంత ఇమేజ్ కోసం ప్రయత్నిస్తారని.. తనకు అది ఇష్టం లేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ తరహా రాజకీయాలు చేయలేమని.. ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల కాలం నడుస్తోందన్నారు. పొరంబోకులు పక్కన లేకుంటే రాజకీయాలు చేయలేమని.. ఇది వాస్తవమని.. తాను అదే చెప్పానని పేర్కొన్నారు. ఉయ్యూరు శ్రీనివాస్ విషయంలో కూడా తన అభిప్రాయం చెప్పానని.. ఉయ్యూరు శ్రీనివాస్‌తో తనకు పరిచయం ఉందన్నారు. ఎన్ఆర్ఐలు వల్ల లాభమే తప్ప నష్టం లేదని తన అభిప్రాయం అన్నారు.

Read Also: Girl Cheated: ప్రేమలో మోసపోయా.. న్యాయం చేయాలని యువకుడు సూసైడ్ నోట్‌

అటు మంగళవారం నాడు మైలవరం నియోజకవర్గ వైసీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వసంత కృష్ణప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పనితీరుపై ఎలాంటి అసంతృప్తి ఉన్నా.. సమావేశానికి వచ్చిన ఎంపీ అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్, వెలంపల్లికి చెప్పాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి ఎవరైనా వైసీపీని గెలిపించేందుకు పని చేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ నేతలను.. టీడీపీ నేతలను తానేమీ ఉత్త పుణ్యాన కామెంట్లు చేయనని వసంత కృష్ణప్రసాద్ అన్నారు. పక్క పార్టీ నేతలపై అకారణంగా కేసులు పెట్టడానికి తాను వ్యతిరేకం అని.. అయితే తాను చేసే కొన్ని కామెంట్లను ఎడిట్ చేసి సంచలనం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి నియోజకవర్గంలోనూ చిన్న చితకా గొడవలు సహజమన్నారు. అయితే ప్రతి చోటా చిన్న చితకా ఇబ్బందులు ఉంటాయని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ వసంత కృష్ణప్రసాద్ పోటీ చేయాల్సిన అవసరం ఉందన్నారు.