జగన్ ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపణలు చేశారు. ఈ చర్యకు పాల్పడి, జగన్ ప్రభుత్వం అత్యంత నేరపూరిత చర్యకు పాల్పడిందని ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైపీపీ ప్రభుత్వం టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు.. జగన్‌తో సమానమైన మంత్రి పెద్దిరెడ్డే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. తన మూడేళ్ళ పాలనతో జగన్ ఎంతమంది నేతల ఫోన్లను ట్యాప్ చేశారో, ఎందరి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డారో చెప్పాలని నిలదీశారు.
ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంపై పూర్తి వాస్తవాలతో సీఎం జగన్ తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. నేరపూరితమైన ఫోన్ ట్యాపింగ్‌పై క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి, అందుకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్, ఇంకా ఇతర టీడీపీ ముఖ్య నేతల ఫోన్లను సీఎం జగన్ ఎప్పట్నుంచి ట్యాప్ చేస్తున్నారన్న విషయాల్ని బయటపెట్టాలని అడిగారు. కాగా.. గతంలో కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వర్ల రామయ్య మండిపడ్డ విషయం తెలిసిందే! తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని గతంలో ఆరోపణలు చేసినప్పుడు, సాక్ష్యాలు ఇస్తేనే దర్యాప్తు చేస్తామని డీజీపీ అన్నారు. అప్పుడు కూడా ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదని చెప్పే ధైర్యం వైసీపీ ప్రభుత్వానికి ఉందా? అంటూ ప్రశ్నించారు.
ఇదిలావుండగా.. ఇటీవల పొత్తు రాజకీయాలపై కూడా వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. 151 సీట్లు గెలిచిన జగన్‌ను ఓడించడం అంత సులువు కాదన్న ఆయన, వైసీపీని కొట్టాలంటే అందరూ కలవాల్సిందేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికలు వచ్చే సమయానికి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనతో పాటు అన్ని పార్టీలు కలిసి వస్తాయన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు కూడా, అందరూ కలిసి రావాలన్న దిశగానే ఆలోచిస్తున్నారని వెల్లడించారు.
