పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా పరిశ్రమ పట్ల ఏపీ ప్రభుత్వం కనపరుస్తున్న తీరు సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ‘రాష్ట్రంలో పేదవాడికి ఉన్న ఏకైక వినోదం సినిమా.. ఆ సినిమా పరిశ్రమను కూడా వివాదాస్పదం చేసి వినోదం చూస్తున్నారా ముఖ్యమంత్రి గారూ’ అంటూ సోషల్ మీడియా వేదికగా నిలదీశారు. సినిమాకు కూడా కులగజ్జి అంటించి తమాషా చూస్తున్నారని మండిపడ్డారు. భీమ్లానాయక్ సినిమాపై ప్రభుత్వం ఎందుకు వివక్ష చూపుతుందో తెలియడం లేదని.. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ప్రభుత్వమే సృష్టిస్తే ఎలా అంటూ వర్ల రామయ్య నిలదీశారు.
అటు వైఎస్ వివేకా హత్య కేసుపైనా వర్ల రామయ్య స్పందించారు. తన బాబాయ్‌ను ఎవరు చంపారో జగన్‌కు ముందే తెలిసి నాటకాలాడుతున్నారని వర్ల రామయ్య ఆరోపణలు చేశారు. వివేకా హత్య కేసులోని సాక్ష్యాలన్నీ వైఎస్ అవినాష్ రెడ్డి నేతృత్వంలోనే హత్య జరిగినట్లుగా చూపిస్తున్నా ఆయనను అరెస్ట్ చేయకుండా ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని వర్ల రామయ్య ప్రశ్నించారు.
