Union Minister Sadhvi Niranjan Jyothi On 3 Rurban Mission Clusters Development: ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోయ, ఏలూరు, రంపచోడవరం క్లస్టర్లను రూర్బన్ మిషన్ కింద ఎంపిక చేసినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి తెలిపారు. రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నించగా.. రాతపూర్వకంగా సాధ్వి జవాబిస్తూ, ఈ మిషన్ కింద 21 విభాగాల్లో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల గురించి వివరించారు. గ్రామాల్లో రహదారులు, డ్రెయిన్ల నిర్మాణం, అగ్రి సర్వీసెస్ ప్రాసెసింగ్, విద్య, స్వయం సహాయక బృందాల ఏర్పాటు, ఉపాధి కల్పన, ఆరోగ్య, వివిధ గ్రామాలను రోడ్లతో అనుసంధానం చేయడం, గ్రామాలకు పైపులతో త్రాగు నీటి వసతి కల్పించడం, గ్రామీణ గృహ నిర్మాణం, ప్రజా రవాణా సౌకర్యాల కల్పన, సామాజిక మౌలిక వసతుల కల్పన, పర్యాటక ప్రోత్సాహం, గ్రామాలకు విద్యుత్ సౌకర్యం.. వంటి ప్రాజెక్టుల్ని అరకులోయ, ఏలూరు, రంపచోడవరం క్లస్టర్లలో చేపట్టినట్లు మంత్రి తెలిపారు.
మరోవైపు.. ‘నేషనల్ రూర్బన్ మిషన్’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభావవంతంగా నిర్వహిస్తోందని కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ప్రశంసించింది. 70 శాతం డిపార్ట్‌మెంట్ నిధులతో పాటు 30 శాతం క్రిటికల్ గ్యాప్ నిధులను ఏకీకృతం చేసి.. వాటర్ ట్యాంక్‌లు, అంగన్‌వాడీ భవనాలు, హెల్త్ సబ్ సెంటర్లు, బ్లడ్ బ్యాంకులు, కాలేజీ భవనాల నిర్మాణం తదితరాలను నిర్దేశిత ప్రణాళికతో అమలు చేస్తోందని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది ప్రాధాన్యత రంగాలను గుర్తించి.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని అభినందించింది. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీని వినియోగిస్తోందని ఆ కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఫిబ్రవరి 17 నుంచి 27 తేదీ వరకు నలుగురు ప్రతినిధులతో కూడిన బృందం.. శ్రీకాకుళం, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాలోని 23 గ్రామ పంచాయతీలను క్షేత్ర స్థాయిలో సందర్శించి.. స్వయంగా పరిశీలించిన అంశాలను విశ్లేషిస్తూ రూపొందించిన నివేదికలో ఏపీ ప్రభుత్వాన్ని మెచ్చుకుంది. రాష్ట్రంలో గ్రామీణ ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పన బాగుందని కూడా ఆ నివేదికలో వెల్లడించింది.