గోదావరి జిల్లాల్లో ఎక్కడ చూసినా జలధారే. ఎటు చూసినా వరద ప్రవాహమే (Flood Water). తక్కువ లోతుకే ఇక్కడ బోర్లు పడుతుంటాయి. నీటి అవసరాల కోసం గోదావరి జిల్లాల్లో చేతిపంపులు ఎక్కువగా ఏర్పాటుచేసుకుంటారు. తాజాగా గోదావరి ఉప్పొంగడంతో గ్రామాల్లోని హ్యాండ్ పంపుల నుంచి ఉబికి ఉబికి వస్తోంది నీరు. చేతితో కొడితేనే సాధారణంగా నీరు వస్తుంది కానీ. ఇప్పుడు వర్షాలు, వరదల కారణంగా హ్యాండ్ పంపుల నుంచి ఏకధాటిగా నీరు వస్తోంది. గోదావరికి సమీపాన వున్న పశ్చిమగోదావరి జిల్లాలోని పలు గ్రామాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది.
గోదావరి తీరాన వున్న యలమంచిలి మండలం లక్ష్మీపాలెంల గ్రామంలోని హ్యాండ్ పంపుల నుంచి నీరు రావడంతో గ్రామస్తులు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితి తామెప్పుడూ చూడలేదంటున్నారు గ్రామస్తులు. అయితే ఈ బోర్ వాటర్ కాస్త బురదగా వుందని గ్రామస్తులు చెబుతున్నారు. రెండుమూడు రోజులుగా ఇలాంటి పరిస్థితి వుందని లక్ష్మీపురం, సమీప గ్రామాల ప్రజలు ఎన్టీవీకి తెలిపారు. భూగర్భ జలాలు పెరగడం వల్ల ఇలా జరుగుతుందని స్థానికులు అంటున్నారు. ఎండాకాలంలో కూడా ఈ పంపుల నుంచి నీరు బాగా వస్తుందని, స్వచ్ఛంగా కూడా వుంటుందని వారు చెబుతున్నారు. హ్యాండ్ పంపుల నుంచి వస్తున్న నీరు వీడియో వైరల్ అవుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్టీవీ పర్యటించినప్పుడు ఇలాంటి దృశ్యాలు ఎక్కువగా కనిపించాయి. ఇది అసాధారణం ఏమీ కాకపోయినా, ఎలాంటి పంపులు లేకుండానే వాటంతట అవే నీరు రావడం విచిత్రంగా వుందని అక్కడి యువత అంటున్నారు.
ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో అప్పుడప్పుడు బయటపడుతుంటాయి. తెలంగాణలోని ఏటూరు నాగారంలో బోరు నుంచి అదేపనిగా నీరు రావడం రైతుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా మనం బోరు వేయాలంటే లక్షలు ఖర్చుపెట్టాలి. అయినా నీళ్ళుపడితే అదృష్టం. లేకుంటే.. అంతే సంగతులు. నీళ్ళు పడకుంటే మళ్ళీ షరామామూలే. అయితే ఈమధ్యకాలంలో ఏటూరునాగారంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. కరెంట్ మోటారు లేకుండానే బోరు ఎత్తిపోసింది. ఈ నీటి ద్వారా 20 ఎకరాలకు పైగా సాగుచేసుకున్నారు రైతులు. ఎలాంటి ఖర్చులేకుండా నీరు రావడంతో రైతులు ఖుషీ అయ్యారు.
Viral: మత్స్యకారులకి చిక్కిన అరుదైన చేప.. అది అపశకునమట..!