చేతికొచ్చే పంట వరద నీటి పాలైంది… వరదల్లో తేలుతున్న పంటను చూసి రైతులు గగ్గోలు పెడుతున్నారు. భారీవర్షాలు, వరదలు లంక రైతులకు కష్ట కాలం తెచ్చిపెట్టాయి. వేలాది ఎకరాల్లో పంట గోదావరి పాలయింది. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. వరద ముంపులోనే ఉన్న పంటలు ఒక్కొక్కటి తేలుతున్నాయి. కుళ్ళిపోయి ఎందుకు పనికిరాకుండా పోయాయి. అన్ని రకాల పంటలకు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉండే రైతులు అంతా ఇలాంటి దయనీయ పరిస్థితిని వరదల వల్ల ఎదుర్కొన్నారు.
నిత్యం పూల తోటలు, కూరగాయలు,వాణిజ్య పంటలతో కళకళలాడుతుండే గోదావరి నదీ పరీవాహక ప్రాంతం ఇప్పుడు మోడువారింది. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక, బుర్రిలంక, పొట్టిలంక, వేమగిరి లంక ప్రాంతాలు కళావిహీనంగా మారాయి. కనుచూపుమేరలో రంగురంగుల పూల తోటలతో నిండి ఉండే ఈ లంక ఇప్పుడు మసిబారింది. పంటలన్నీ వరద నీటిలో కుళ్లిపోయాయి. రైతుల కళ్ళల్లో కన్నీళ్లు మిగిల్చాయి. ఏటా ఆగస్టులో వచ్చే వరదలు జూలై నెలలో వచ్చి పడడంతో ఈ అపార నష్టానికి కారణంగా పేర్కొనవచ్చు.
వరదలు ఆగష్టులో వస్తాయని రైతులు ముందుగానే తగిన ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. ఈ రకంగా ప్రతి ఏటా జూలై నెలాఖరుకు వేసిన పంటలను దక్కించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ రైతులకు ఆవకాశం ఇవ్వకుండా జూలై 11నే వరదలు ముంచెత్తడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ లంక భూముల్లో బంతి, లిల్లీ, మల్లి, కనకాంబరం, జాజులు,గులాబీ వంటి పూల తోటలు ఉన్నాయి. అలాగే దొండ, బెండ, పొట్ల, కాకర, ఆనప, మిరప వంటి కూరగాయ పంటలు అరటి, బొప్పాయి, జామ, కంద వంటి వాణిజ్య పంటలను ఈ వరద గోదారమ్మ ముంచెత్తింది.
ఈ పంటలేగాక ఇటీవల కాలంలో లంకల్లో కూడా నర్సరీ మొక్కల పెంపకం అధికమైంది. వరదలు వచ్చే సమయం ఇంకా దగ్గర పడకపోవటంతో అందరూ ఈ లంకలోనే పెంచిన మొక్కలను ఉంచేశారు. ఇంతలోనే గోదారమ్మ ముంచేయడంతో వారంతా తీవ్రంగా నష్టపోయారు. లక్షలాది రూపాయలు పెట్టుబడులుతో పెంచిన మొక్కలు ఎందుకూ పనికిరాకుండా పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.ఇప్పుడు రైతులు పాడైపోయిన మొక్కలు తొలగించడానికి కూడా ఎంతో వ్యయ ప్రయాణపు పడాల్సిన పరిస్థితి. ప్రభుత్వం తగిన నష్ట పరిహారం ఇవ్వాలని రైతులు, కౌలు రైతులు కోరుకుంటున్నారు.
Sravana Bhargavi: ఎట్టకేలకు వివాదాస్పద వీడియో డిలీట్ చేసిన టాలీవుడ్ సింగర్