Site icon NTV Telugu

Uddanam People Stuck in Turkey: టర్కీలో భారీ భూకంపాలు.. ఉలిక్కిపడిన శ్రీకాకుళం జిల్లా ఉద్దానం..

Uddanam

Uddanam

Uddanam People Stuck in Turkey: టర్కీలో భూకంపంతో శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతం తల్లడిల్లుతోంది.కంచిలి,ఇచ్ఛాపురం, సోంపేట మండలాలకు చెందిన వందలాది మంది టర్కీ లో చిక్కుకున్నారు. వీరంతా నిర్మాణ రంగం పనుల కోసం వెళ్లారు. టర్కీ భూకంప ప్రాంతానికి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో నివాసం ఉంటున్నారు. మళ్ళీ భూ ప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉందన్న హెచ్చరికలతో టర్కీలో ఉన్న సిక్కోలు వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏడాది కిందట నుంచి నిర్మాణ రంగానికి సంబంధించిన పనులకు దాదాపు రెండు వేల మంది వరకు యువకులు అక్కడికి వెళ్లారు. భూకంపం సంభవించిన ప్రాంతానికి గంటన్నర ప్రయాణ దూరంలోనే వీళ్లు ఉంటున్నారు. అక్కడ భూకంపం వచ్చిందన్న విషయం తెలియగానే ఇక్కడవారి కుటుంబ సభ్యులు భయాందోళన చెందారు. తమవారి క్షేమ సమాచారం తెలియక కంగారు పడ్డారు.

Read Also: Off The Record: అధినేత దృష్టిలో పడేందుకే ప్రయారిటీ..! మంత్రిపై అధిష్టానికి ఫిర్యాదులు..

ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు మండలాలకు చెందిన యువత ఉపాధి కోసం అక్కడకు వెళ్లి గ్యాస్‌, ఆయిల్‌ కంపెనీల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.జిల్లా యువత ఉపాధి కోసం దుబాయ్‌, సింగ్‌పూర్‌, అబుదాబి తదితర దేశాలకు ఎక్కువగా వెళ్తుంటారు. కరోనా తర్వాత అరబ్‌ దేశాలలో ఉపాధి అవకాశాలు, వేతనాలు తగ్గిపోయాయి. దీంతో టర్కీ వైపు వెళ్లాల్సి వచ్చిందని బాధితుల బంధువులు చెబుతున్నారు. మొత్తానికి తమవారు క్షేమంగా ఉన్నారని తెలియడంతో సిక్కోలు వాసులు ఊపిరిపీల్చుకున్నారు. సంబంధిత కంపెనీలే భోజనం, వసతి సమకూర్చుతూ ఉన్నాయని టర్కీ లో చిక్కుకున్న కార్మికులు చెబుతున్నారు.మళ్లీ ప్రకంపనాలు వచ్చే అవకాశం ఉందనే సమాచారంతో వారం రోజుల వరకు పనులు నిలిపివేస్తున్నట్లు కంపెనీలు ప్రకటించాయని వారంటున్నారు.

Exit mobile version