NTV Telugu Site icon

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ రోజే ఆ టికెట్లు విడుదల

Ttd

Ttd

TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పరితపిస్తుంటారు.. దీంతో.. తిరుమల గిరులు నిత్యం భక్తుల రద్దీతో దర్శనమిస్తాయి.. దీనిని దృష్టిలో ఉంచుకుని.. భక్తులకు ఇబ్బందులు లేకుండా.. ఆన్‌లైన్‌లోనే టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఎప్పటికప్పుడు దర్శన టికెట్లతో పాటు వివిధ రకాల సేవా టికెట్లను కూడా ఆన్‌లైన్‌లో పెట్టి విక్రయిస్తుంది.. ఇక, శ్రీవారి భక్తులు అలర్ట్‌ కావాల్సిన సమయం వచ్చేసింది.. తిరుమల శ్రీవారికి రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్ల కోటాకు సంబంధించిన కీలక ప్రకటన విడుదల చేసింది టీటీడీ.. ఏప్రిల్‌ నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను ఇవాళ విడుదల చేయనున్నారు..

Read Also: MLC Kavitha : కవిత పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్ల కోటాకు సంబంధించిన టికెట్లను ఈనెల 27వ తేదీన అంటే ఈ రోజు విడుదల చేయనుంది టీటీడీ.. ఈ రోజు ఉదయం 11 గంటలకు టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఈ విషయాన్ని భక్తులు గుర్తించి టికెట్లను బుక్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు. శ్రీవారి దర్శన టికెట్లకు ఎప్పుడైనా ఫుల్‌ డిమాండ్‌ ఉంటుంది.. కొన్ని నిమిషాల వ్యవధిలోనే కోటా పూర్తి అవుతుంది.. ఇక, వేసవి సెలవుల నేపథ్యంలో ఏప్రిల్‌ నెల కోటా టికెట్లకు భారీ ఎత్తున డిమాండ్‌ ఉండే అవకాశాలు ఉంది.. దీంతో భక్తులు అప్రమత్తంగా ఉండాలి.. ఇక, ఆన్‌లైన్‌లో టికెట్ రిజర్వేషన్‌ చేసుకోవాలనుకునే భక్తులు మొదట టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి స్పెషల్‌ ఎంట్రీ దర్శన్‌ టికెట్ అనే ట్యాబ్‌పై క్లిక్‌ చేయాలి. అనంతరం సంబంధిత వివరాలను ఎంటర్‌ చేయడం ద్వారా టికెట్‌ను బుక్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.. మరోవైపు.. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.. ఈ రోజు శ్రీవారి సర్వదర్శానికి 5 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుంది.. ఇక, నిన్న శ్రీవారిని 79,415 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,454 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. హుండీ ఆదాయం రూ. 3.86 కోట్లు సమర్పించారు భక్తులు.