తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ అందించింది. రేపు ఆన్ లైన్ లో సెప్టెంబర్ మాసానికి సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల చెయ్యనుంది టీటీడీ. మొత్తం 46470 సేవా టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చెస్తామని టీటీడీ తెలిపింది. లక్కీ డిప్ విధానంలో 8070 టిక్కెట్లు, ముందు వచ్చినవారికి ముందు ప్రాతిపాదికన 38,400 టికెట్లను విడుదల చెయ్యనుంది. సుప్రభాతం,తోమాల,అర్చన,అష్టదళ పాద పద్మారాధన సేవా టిక్కెట్లను లక్కీ డిప్ విధానంలో కేటాయించనుంది టీటీడీ.
మరో వైపు తిరుమల కొండకు భక్తుల తాకిడి ఏమాత్రం తగ్గడం లేదు. ఇవాళ 28 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు. సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 76,597 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తులు 37,759 మంది. హుండీ ఆదాయం రూ.4.47 కోట్లుగా టీటీడీ తెలిపింది. ఇదిలా వుంటే.. దేశవిదేశాల్లోనూ శ్రీవారి కల్యాణాలు కనుల పండువగా సాగుతున్నాయి. అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీనివాస కళ్యాణాల్లో భాగంగా భారతీయ కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున డల్లాస్ నగరంలో కన్నుల పండువగా స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది. భక్తులు స్వామివారి కల్యాణాన్ని కనులారా వీక్షించి తరించారు.
కళ్యాణోత్స క్రతువులో భాగంగా పుణ్యహవచనం, విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణ,మహా సంకల్పం, కన్యాదానం, మాంగల్యధారణ, వారణ మాయిరం, హారతితో అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. డల్లాస్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు హాజరయ్యారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, విశాఖపట్నం ఎంపి ఎంవీవీ సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ ఎన్ ఆర్ ఐ సలహాదారు జ్ఞానేంద్ర రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు వై ఎస్ ఆర్ జిల్లా జెడ్ పి చైర్మన్ అమర్నాథ రెడ్డి, తెలుగుభాషా సంఘం చైర్మన్ యార్గగడ్డ లక్ష్మీ ప్రసాద్, ఉత్తర అమెరికా లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రత్నాకర్, ప్రతాప్ భీమ్ రెడ్డి, ఏపీ ఎన్నార్టీ చైర్మన్ మేడపాటి వెంకట్, నాటా అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, రఘువీర్ బండారు, రమేష్ వల్లూరు, ఎస్వీబీసీ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.
