కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తుల తాకిడి పెరుగుతోంది. కరోనా నుంచి దేశం కోలుకుంటోంది. దీంతో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చేవారు పెరుగుతున్నారు. కొండపై వీఐపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల తాకిడి కూడా ఎక్కువగానే వుంది. నవంబర్ 13,14,15వ తేదీలలో శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. 14వ తేదీన తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా వస్తున్నారు. వీఐపీల తాకిడి కారణంగా బ్రేక్ దర్శనాలు, సిఫార్సు లేఖలు రద్దు చేసినట్టు తెలిపింది టీటీడీ.
తిరుమల శ్రీవారికి ఆలయానికి కళ్లు చెదిరేలా హుండీ ఆదాయం సమకూరుతూనే వుంది. కరోనా వల్ల ఖాళీ అయిన ఖజానా ఇప్పుడిప్పుడే నిండుతోంది. నవంబర్ 5వతేదీన శ్రీవారిని దర్శించుకున్నారు 29,586 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన వారు 13,507 మంది. దీంతో శ్రీవారి హుండీ ఆదాయం 2.15 కోట్లు అని టీటీడీ తెలిపింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటూ సర్వదర్శనం టోకెన్లు జారీ పెంచింది. దీంతో భక్తుల సంఖ్య పెరుగుతోందని టీటీడీ అధికారులు తెలిపారు.
అక్టోబర్ నెలలో వెంకటేశ్వరస్వామిని 8,12,818 మంది భక్తులు దర్శించుకున్నారు. మొత్తం 3,77.970 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక స్వామివారి హుండీ ఆదాయం రూ.79 కోట్ల 10 లక్షల లభించింది. అక్టోబర్ మాసంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య తగ్గినా.. శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా పెరగడంతో టీటీడీ అధికారులు ఖుషీ అవుతున్నారు. శ్రీవారి దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైంస్లాట్ సర్వదర్శన టోకెన్లను ‘గోవింద’ యాప్‌లో కాకుండా టీటీడీ వెబ్‌సైట్‌లోనే బుక్ చేసుకోవాలి. అంతేకాదు నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించిన టోకెన్ల సంఖ్యను కూడా పెంచింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు.. రోజుకు 12వేల చొప్పున.. సర్వదర్శన 10వేల చొప్పున విడుదల చేశారు. నవంబర్‌లోనూ హుండీ ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు.