తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. త్వరలో తిరుమల దర్శన టికెట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. దేశంలో స్వల్పంగా గడిచిన 24 గంటల్లో 67,084 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, 1,241 మరణాలు నమోదు కాగా ప్రస్తుతం దేశంలో 7,90,789 యాక్టివ్ కరోనా కేసులు వున్నాయి. కరోనా ఎఫెక్ట్ తగ్గడంతో ఈ నెల 16వ తేదీ నుంచి తిరుపతిలో సర్వదర్శనం టికెట్లను జారీ చేయనున్నట్టు చెప్పారు.
కరెంట్ బుకింగ్ ద్వారా రోజుకు 10 వేల టికెట్లను జారీ చేస్తామని ఈవో తెలిపారు. ఈ నెల 16న ఉదయాస్తమ సేవా టికెట్లను విడుదల చేస్తామని చెప్పారు. టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు కోటి రూపాయల విరాళం ఇచ్చిన వారికి ఈ టికెట్లను జారీ చేస్తామని తెలిపారు. ఆన్ లైన్ ద్వారా విరాళమిచ్చిన భక్తులకు ఉదయాస్తమయ సేవా టికెట్లను జారీ చేస్తామని… ఈ టికెట్ల బుకింగ్ కు ప్రత్యేక పోర్టల్ ద్వారా జారీ చేస్తామని చెప్పారు.
తిరుమలకు కరోనా అనంతరం భక్తుల సంఖ్య పెరుగుతోంది. సర్వదర్శనం టికెట్ల కోసం భక్తులు వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ప్రారంభం అయ్యాయి. శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారికి వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు.