తిరుమల కొండపై టీటీడీ విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. నగదు చెల్లింపుల స్థానంలో యూపీఐ చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకునే దిశగా అడుగులు వేసే టీటీడీ దేశవ్యాప్తంగా నగదు రహిత చెల్లింపులు జరుగుతున్న వేళ తిరుమలలోనూ యూపీఐ చెల్లింపులను అందుబాటులోకి తీసుకువచ్చింది. పైలట్ ప్రాజెక్టు కింద భక్తుల వసతి గదుల కేటాయింపును టీటీడీ ఎంచుకుంది.
Read Also: Polavaram Flood Effect: పోలవరంపై గోదారి వరద ప్రభావమెంత?
వసతి గదుల కేటాయింపు సమయంలో భక్తులు యూపీఐ విధానం ద్వారా చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ వెల్లడించింది. త్వరలోనే టీటీడీకి సంబంధించిన అన్ని చెల్లింపులు యూపీఐ విధానంలోనే చేసేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. భక్తులకు వసతి గదుల కేటాయింపు కౌంటర్లలోయూపీఐ చెల్లింపులకు లభించే ఆదరణను బట్టి… కొండపై అన్ని రకాల సేవల చెల్లింపు విధానాలకు యూపీఐని అనుమతించే దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది. కాగా తిరుమల కొండపై అన్ని విషయాలలో యూపీఐ విధానం పూర్తిగా అందుబాటులోకి వస్తే అవకతవకలకు అవకాశం ఉండదని టీటీడీ భావిస్తోంది.
మరోవైపు టీటీడీ విద్యాసంస్థల ఆధునీకరణపై దృష్టి సారించినట్లు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ధర్మారెడ్డి చొరవతో మూడు టీటీడీ పాఠశాలల నిర్వహణ బాధ్యతలను స్వీకరించేందుకు రేమండ్స్ అధినేత సింఘానియా అంగీకరించారు. ఆయా పాఠశాలల నిర్వహణపై టీటీడీ సంతృప్తి వ్యక్తం చేస్తే టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 35 విద్యాలయాల నిర్వహణ బాధ్యతలు చేపడతామని సింఘానియా వెల్లడించారు. మరోవైపు పద్మావతి మహిళా జూనియర్ కళాశాల నిర్వహణ బాధ్యతలు స్వీకరించేందుకు దాత కొట్టు మురళీకృష్ణ ముందుకు వచ్చారు. ఇప్పటికే పరకామణి మండప నిర్మాణం కోసం రూ.16 కోట్లను దాత మురళీకృష్ణ విరాళంగా అందించారు.