TTD: భక్తులకు మరో షాక్ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. వసతి గదుల అద్దెను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. సామాన్య, మధ్యతరగతి భక్తులకు అందుబాటులో ఉండే నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత వంటి వసతి గృహాల అద్దెలను రూ. 500, రూ. 600 నుంచి ఏకంగా వెయ్యి రూపాయలకు పెంచింది.. ఇక, నారాయణగిరి రెస్ట్ హౌస్‌లోని 1, 2, 3 గదులను రూ. 150 నుంచి జీఎస్టీతో కలిపి రూ 1,700 పెంచారు. రెస్ట్‌హౌస్ 4లో ఒక్కో గదికి ప్రస్తుతం రూ. 750 వసూలు చేస్తుండగా ఇప్పుడు ఏకంగా 1,700కు వసూలు చేస్తున్నారు.. మరోవైపు, కార్నర్ సూట్‌ను జీఎస్టీతో కలిపి రూ. 2,200 చేశారు. స్పెషల్ టైప్ కాటేజీల్లో గది అద్దెను రూ. 750 నుంచి 2,800కు పెంచేసింది టీటీడీ.
Read Also: Mekapati Family: మేకపాటి కుటుంబంలో కలకలం.. 18 ఏళ్లు రహస్యంగా ఉంచి విడిచిపెట్టారు..!?
అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటి ఉంది.. అద్దె మొత్తం పెరిగిందంటే.. అదేస్థాయిలో డిపాజిట్ మొత్తం కూడా చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒకవేళ రూ. 1,700 గదిని అద్దెకు తీసుకుంటే అంతే మొత్తంలో డిపాజిట్ అంటే మరో రూ.1700 కలిపి మొత్తం రూ. 3,400ను చెల్లించాల్సి ఉంటుంది.. డిపాజిట్ మొత్తం.. రూమ్ ఖాలీ చేసే సమయంలో తిరిగి పొందే అవకాశం ఉన్న విషయం విదితమే.. మొత్తంగా వసతి గృహాల అద్దెల పెంపు భారం భక్తులపై భారీగానే పడనుంది.. మరోవైపు.. సామాన్య భక్తులు ఎక్కువగా బస చేసే రూ. 50, రూ.100తో లభించే గదుల అద్దెలను కూడా త్వరలో పెంచేందుకు టీటీడీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
