Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

“బంగ్లాదేశీయుడి”గా పొరబడి వలస కార్మికుడి దారుణ హత్య..

బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు సగటు భారతీయుడిలో ఆగ్రహానికి కారణమవుతున్నాయి. బంగ్లాలోని మైమన్‌సింగ్ జిల్లాలో హిందూ వ్యక్తి దీపు చంద్ర దాస్‌ను మతోన్మాద మూక ‘‘దైవ దూషణ’’ చేశాడనే ఆరోపణలపై అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇది భారతీయుల్లో కోపానికి కారణమవుతోంది. ఇదిలా ఉంటే, కేరళలో వలస కార్మికుడిని ‘‘బంగ్లాదేశ్ వ్యక్తి’’గా పొరబడి దారుణంగా కొట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్‌గఢ్ శక్తి జిల్లాకు చెందిన 31 ఏళ్ల రామనారాయణ్ బఘేల్‌ కేరళలో పనిచేస్తున్నాడు. బంగ్లాదేశీగా పొరబడిని కొందరు వ్యక్తులు అతడిని చావ చితకబాదారు. తీవ్రమైన గాయాలతో అతను మరణించాడు. ఈ ఘటన పాలక్కాడ్ జిల్లాలో జరిగింది.

అండర్-19 ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్ ఓటమి..

దుబాయ్‌లోని ఐసిసి అకాడమీ గ్రౌండ్‌లో జరిగిన U19 ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్తాన్ 191 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. పాకిస్తాన్ అండర్-19 ఆసియా కప్ 2025 ను గెలుచుకుంది. 27వ ఓవర్ రెండవ బంతికి దీపేష్‌ను అలీ రజా అవుట్ చేయడంతో పాకిస్తాన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. పాకిస్తాన్ భారత అండర్-19 ఆసియా కప్ జట్టును 191 పరుగుల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 347 పరుగులు చేసి భారత్‌కు 348 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టు 156 పరుగులకే కుప్పకూలిపోయింది.

వచ్చే ఎన్నికల్లో మనదే గెలుపు

చాలా కాలం తర్వాత తెలంగాణ భవన్‌కు విచ్చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. తనను దూషించడమే కాంగ్రెస్ సర్కార్ ఒక విధానంగా పెట్టుకుందని ఆయన మండిపడ్డారు. ఈ ప్రభుత్వం గడిచిన రెండేళ్లలో ఒక్క కొత్త ప్రజా సంక్షేమ పథకాన్ని ప్రకటించకపోగా, గతంలో ఉన్న పథకాలను కూడా నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ కిట్ వంటి పథకాలను ఆపేశారని, బస్తీ దవాఖానాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతుల కోసం నిర్మించిన చెక్ డ్యామ్‌లను పేల్చేస్తున్నారని, యూరియా కోసం రైతులు మళ్ళీ క్యూలో నిలబడాల్సిన దుస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణలో త్వరలో SIR..

కేంద్ర ఎన్నికల సంఘం నకిలీ ఓటర్లను తొలగించి, ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసేందుకు ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’ను ప్రారంభించింది. తదుపరి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) తెలంగాణలో ఉంటుందని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (CEC) జ్ఞానేశ్‌కుమార్‌ తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన బీఎల్‌వోల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే, బీహార్ ఎన్నికల ముందు ఈ ప్రక్రియ రాజకీయంగా వివాదాస్పదమైంది. ఈసీ పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, యూపీ ఇలా పలు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్‌ను చేపట్టింది. ముఖ్యంగా, ఈ ప్రక్రియపై బీజేపేతర ముఖ్యమంత్రులు, విపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

నా దాడి తట్టుకోలేక చంద్రబాబు మోకాళ్ళ మీద పరిగెత్తి మరీ కట్టిండు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో మహబూబ్ నగర్ (పాలమూరు) జిల్లా తీవ్ర వివక్షకు గురైందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. జిల్లా సాగునీటి కష్టాలు, గత ప్రభుత్వాల నిర్లక్ష్యంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 100 శాతం కృష్ణా బేసిన్‌లో ఉన్నప్పటికీ, జిల్లా ప్రజలు తాగునీరు, సాగునీటి కోసం అలమటించారని, పొట్టచేత పట్టుకుని బొంబాయి వంటి ప్రాంతాలకు వలస వెళ్లడం తనను ఎంతగానో కలిచివేసిందని ఆయన గుర్తు చేసుకున్నారు. బచావత్ ట్రిబ్యునల్ గుర్తించినా.. పాలకుల నిర్లక్ష్యం సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి బచావత్ కూడా పాలమూరు జిల్లా దుర్భర పరిస్థితిని చూసి చలించారని కేసీఆర్ పేర్కొన్నారు. ఆ రోజుల్లో పాలమూరు గురించి గంటెడు నీళ్లు అడిగే నాథుడే లేడని, అందుకే ట్రిబ్యునల్ స్వయంగా స్పందించి జూరాల ప్రాజెక్టుకు 17 టీఎంసీల నీటిని కేటాయించిందని చెప్పారు. అయితే, 1974లోనే నీటి కేటాయింపులు జరిగినప్పటికీ, ఉమ్మడి పాలకులు ఆ ప్రాజెక్టును పట్టించుకోలేదని, దశాబ్దాల పాటు కాలువలు లేక జూరాల ఒక అనాథ బ్యారేజీలా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఓటమిని అంగీకరించని వ్యక్తి వాజ్ పేయ్..

అటల్ మోడీ సుపరిపాలన యాత్ర రాజమహేంద్రవరానికి చేరుకుంది. ఈ యాత్ర సభలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ.. అటల్ జి ఒక స్ఫూర్తి దాత అభివృద్ధి ప్రధాత అని, అసమాన్య నాయకుడు అని కొనియాడారు. 6 సంవత్సరాలు ప్రతి పక్షంలో ఉన్నారని తెలిపారు. సమాజంలో ఉన్న ప్రజల కష్టాలని కవితా రుపంలో అద్భుతంగా పార్లమెంట్ లో కనబరిచారన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేలా తనదైన శైలిలో మాట్లాడేవారు. ఆరోజు వేసిన పునాదుల కారణంగా 21 రాష్ట్రాల్లో యన్డీఎ నేడు అధికారంలో ఉందని తెలిపారు.

సినిమా ప్రమోషన్స్‌లో ఏఐ మ్యాజిక్.. అనిల్ రావిపూడి వీడియో చూశారా !

టాలీవుడ్‌లో డైరెక్టర్ అనిల్‌ రావిపూడికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి ఆయన మిగితా వారికన్నా సినిమా ప్రమోషన్స్‌‌ను విభిన్నంగా చేస్తారనే పేరు ఉంది. ఆయన తన సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లే టెక్నిక్‌ సినిమా సినిమాకు చాలా కొత్తగా ఉంటుంది. నిజానికి అప్పటి ట్రెండ్‌కు అనుగుణంగా ఆయన సినిమా ప్రమోషన్స్‌ను ప్లాన్ చేసుకుంటూ.. తన చిత్రాన్ని ప్రేక్షకులకు చేరువ చేయడంలో సిద్ధహస్తుడిగా ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

ఇంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వమా..?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమం “సడి లేదు సప్పుడు లేదు” అన్న చందంగా తయారయ్యాయని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ కీలక సమావేశంలో పాల్గొన్న ఆయన, ప్రస్తుత ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఒక్క పథకాన్ని కూడా ప్రజల కోసం తీసుకురాలేదని, పైగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన అనేక ప్రజా సంక్షేమ పథకాలను నిలిపివేసిందని కేసీఆర్ ఆరోపించారు. కేసీఆర్ కిట్, బస్తీ దవాఖానాలు వంటి పథకాలను నిర్వీర్యం చేస్తూ, ప్రజలకు అందుతున్న ఫలాలను దూరం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

హైదరాబాద్ వేదికగా టాలీవుడ్ ప్రో లీగ్ ప్రారంభం

హైదరాబాద్ వేదికగా సినీ గ్లామర్ , క్రికెట్ జోష్ కలగలిసిన ఒక సరికొత్త క్రీడా పండుగకు తెరలేచింది. EBG గ్రూప్ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన టాలీవుడ్ ప్రో లీగ్ (TPL) ప్రారంభోత్సవ వేడుక భాగ్యనగరంలోని HICC లో అత్యంత వైభవంగా జరిగింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ లీగ్‌ను అధికారికంగా ప్రారంభించడమే కాకుండా, దీనికి హానరరీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి ముందుండి నడిపిస్తున్నారు. ఈ వేడుకకు భారత క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్, , సురేశ్ రైనా ముఖ్య అతిథులుగా విచ్చేసి సందడి చేశారు. ఒకవైపు వెండితెర తారలు, మరోవైపు క్రికెట్ లెజెండ్స్ ఒకే వేదికపైకి రావడంతో ఈ కార్యక్రమం కంటికి ఇంపుగా, వినోదభరితంగా సాగింది.

 

Exit mobile version