Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

అయోధ్యలో 26 లక్షల దీపాలు.. రెండు గిన్నీస్‌ రికార్డులు

రామనగరిలో వెలుగుల వేడుక సంబరాలు అంబరాన్ని అంటాయి. అయోధ్య దీపోత్సవానికి ఏకంగా రెండు గిన్నీస్ రికార్డులు సొంతం అయ్యాయి. అయోధ్య నగరంలో 9వ దీపోత్సవంలో భాగంగా ఈ ఏడాది 26 లక్షలకుపైగా దీపాలను వెలిగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సరయూ నదీ తీరం వెంబడి లక్షలాది దీపాలను వెలిగించారు. నదీ తీరంలోని ఘాట్‌లు పెద్దఎత్తున భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రామ్‌లీలా వంటి సాంస్కృతిక ప్రదర్శనలు, లేజర్‌ షో ఆకట్టుకున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అయోధ్య రామమందిరంలో పూజలు నిర్వహించి, రామ్‌ కీ పైడీ ఘాట్‌లో హారతి ఇచ్చారు. అనంతరం ఆయన రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు వేషధారణలోని కళాకారులు ఆశీనులైన రథాన్ని లాగారు. ఈ సందర్భంగా ఆయన దీపాన్ని వెలిగించి.. వేడుకలను ప్రారంభించారు. దీపోత్సవం నేపథ్యంలో అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

విద్యపై రాజీ లేదు…అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్య

మధిర నియోజకవర్గం బోనకల్లు మండలం లక్ష్మీపురం గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, గుత్తేదారులతో సమీక్ష నిర్వహించి, నిర్మాణంలో ఎటువంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అని, అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్య అందించే విధంగా అన్ని వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. పాఠశాల చుట్టుపక్కల రహదారుల నిర్మాణంపై కూడా అధికారులతో చర్చించి, సులభ రవాణా సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.

హార్డ్‌ వర్క్‌ కాదు, స్మార్ట్ వర్క్‌ చేయండి.. వైకుంఠ పాళి గేమ్స్‌ వద్దు..

విజయవాడలోని పున్నమి ఘాట్ కు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులకి మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని చిన్నితో పాటు పలువురు ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. నారా భువనేశ్వరితో పాటు దీపోత్సవం కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీఎస్టీ సంస్కరణ ఉత్సవాలు దసరా నుంచి ప్రారంభించి దీపావళి వరకూ నిర్వహిస్తున్నాం.. జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రజలకు అందుతున్న ప్రయోజనాల గురించి విజయవాడలో కొందరు వీధి వ్యాపారులు, దుకాణాలను సందర్శించి వారితో మాట్లాడి తెలుసుకున్నాను.. ఓటు అనే ఆయుధంతో చీకటి పాలనను ప్రజలు తరిమేశారు.. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న రాక్షసుడిని ప్రజలు ఓడించారు.. టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమిని 94 శాతం స్ట్రైక్ రేట్ తో ప్రజలు గెలిపించారు.. రాష్ట్రంలో మళ్ళీ వైకుంఠ పాళి వద్దు అని సూచించారు. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కేంద్రం ప్రాణం పోసింది.. 16 నెలల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టామని చంద్రబాబు నాయుడు తెలిపారు.

ఇద్దరి వ్యక్తిగత గొడవలతో ఆ రెండు కులాలకు ఏమిటి సంబంధం?

నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటనకు కులం రంగు పులిమి వైసీపీ విష ప్రచారం చేయడం ఆ పార్టీ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. శవ రాజకీయాలు సృష్టించి ఆ మంటల్లో చలి కాచుకోవాలని చూస్తుందని అన్నారు. ఇద్దరు వ్యక్తిగత గొడవలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆ రెండు కులాలకు ఏమిటి సంబంధం అని ప్రశ్నించారు. నిందితుడ్ని ప్రభుత్వం ఏమైనా వెనకేసుకొచ్చిందా? అరెస్టు చేయకుండా ఆపిందా? అని క్వశ్చన్ చేశారు. కోడి గుడ్డుకి.. బోడి గుండుకి ముడి పెట్టినట్టు వైసీపీ వికృత చేష్టలకు, దిగజారుడు రాజకీయాలకు రాష్ట్ర ప్రజలు ఛీ కొడుతున్నారు.. కాపులపై వైసీపీ ఒలకబోస్తున్న మొసలి కన్నీరు చూసి ఆ సామాజిక వర్గం నేతలే నివ్వెర పోతున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.

గాంధీ పేరు దేశానికి పర్యాయపదం

మన దేశం అన్ని మతాలు, సంస్కృతులు కలసి సహజీవనం చేస్తూ ప్రపంచానికి స్ఫూర్తినిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ చార్మినార్‌ వద్ద శనివారం నిర్వహించిన రాజీవ్‌ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్‌ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ.. “గత 35 ఏళ్లుగా రాజీవ్‌ గాంధీ సద్భావన యాత్ర నిరంతరంగా జరుగుతోంది. గాంధీ అనే పేరు ఈ దేశానికి పర్యాయపదం. తమపై పోరాడిన మహాత్మా గాంధీని బ్రిటిషర్లు ఏమీ చేయలేకపోయారు, కానీ స్వాతంత్ర్యం వచ్చిన కొద్ది నెలల్లోనే మతతత్వవాదులు ఆయనను హతమార్చారు. గాంధీని హత్య చేసినవారు బ్రిటిషర్ల కంటే ప్రమాదకరులు” అని పేర్కొన్నారు.

మల్లోజుల, ఆశన్నలు విప్లవద్రోహులుగా మారారు

దేశంలో మావోయిస్టుల లొంగుబాట్లకు సంబంధించి తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. మావోయిస్టు కేంద్ర కమిటీ అభయ్ పేరుతో నాలుగు పేజీల లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో, ఇటీవల పోలీసులు ఎదుట లొంగిపోయిన మాలోజుల వేణుగోపాల్‌ (Mallojula Venugopal), ఆశన్నలు (Ashanna) వంటి నేతల వ్యవహారాన్ని ప్రత్యేకంగా గుర్తించి, వారిని “విప్లవ ద్రోహులు”గా పేర్కొంది. శత్రువుల ఎదుట లొంగిపోయి పార్టీ నష్టానికి కారణమైన నేతలకు తగిన శిక్ష ప్రజలే విధిస్తారని మావోయిస్టు కేంద్ర కమిటీ పేర్కొంది. లేఖలో, మల్లోజుల గత కాలపు తప్పులు, బలహీనతలను కూడా ప్రస్తావించారు. 2018లో పార్టీ తాత్కాలిక వెనుకంజ వేసింది.. 2020లో కేంద్ర కమిటీ సమావేశంలో మల్లోజుల తప్పుడు భావజాలం, ఆయుధాలను వదిలిపెట్టడంపై వితండవాదం బయటపడింది. ప్రస్తుతం లొంగిపోవడం పార్టీకి తాత్కాలిక నష్టం మాత్రమే అని కమిటీ పేర్కొంది. కమిటీ తన చర్చ లేకుండా మల్లోజుల లొంగిపోయిన విషయాన్ని నిర్దేశిస్తూ, “ప్రాణ భీతితో ఎవరైనా లొంగిపోవచ్చు, కానీ పార్టీకి నష్టం కలిగితే ప్రజలే బుద్ధి చెబుతారు” అని హెచ్చరించింది. ఈ లేఖా ప్రకటన దేశంలో మావోయిస్టు సంఘటనలపై మరోసారి దుమారం రేపుతోంది.

నక్సలిజం నిర్మూలనలో కేంద్రం ఘన విజయాన్ని సాధించింది

నక్సలిజం నిర్మూలనలో కొత్త మైలురాయిని చేరుకున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రకటించారు. 31 మార్చి 2026 నాటికి దేశంలో నక్సలిజం హింసను పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ లో భాగంగా వందలాదిమంది నక్సలైట్లు హింస మార్గాన్ని వదిలి సాధారణ జనజీవనంలో కలవడాన్ని కిషన్ రెడ్డి స్వాగతించారు. గత మూడు రోజుల్లోనే 300 మందికి పైగా నక్సలైట్లు అధికారాల వద్దకు వచ్చారని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ లొంగుబాటులో ఎక్కువ మంది తెలుగువారూ ఉండడం ప్రత్యేకత అని చెప్పారు. “ఇంతకాలం నక్సలిజం ప్రభావిత ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా ఉండగా, నేడు ఈ ప్రాంతాలు చీకటినుంచి వెలుగుకు అడుగులు వేస్తున్నాయి. దీన్ని సంతోషంగా చూస్తున్నాం” అని ఆయన చెప్పారు. దశాబ్దాల క్రితం దేశంలో 125 నక్సల్ ప్రభావిత జిల్లాలు ఉన్నప్పటికీ, నేటికి వాటిని 11 వరకు తగ్గించడంలో కేంద్రం విజయం సాధించిందని పేర్కొన్నారు. మిగిలిన 11 జిల్లాలు కూడా త్వరలో నక్సల్ రహితంగా మారుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

వైజాగ్కు అంత గొప్ప పేరు జగన్ వల్లే వచ్చింది..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 10 రోజులుగా అతలాకుతలం అయిపోతుందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. ఓ పక్కా రాష్ట్రంలో నకిలీ మద్యం అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి.. మరో వైపు వైసీపీ హయాంలోని వచ్చిన మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారు.. గూగుల్ డేటా సెంటర్ తో నకిలీ మద్యం, మెడికల్ కాలేజీల అంశాన్ని డైవర్ట్ చేస్తున్నారు.. ఈ అన్ని వ్యవహారాల మద్య ఓ కొత్త వాదనను కూటమి నేతలు తెరపైకి తీసుకొస్తున్నారు.. వైసీపీ హయాంలో 5 మెడికల్ కాలేజీల్లో క్లాసులు మొదలైయ్యాయి, మరో 2 క్లాసులకు సిద్దం చేశాం.. కానీ, కూటమి నేతలు అసలు వైసీపీ టైంలో మెడికల్ కాలేజీలు కట్టలేదని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పునాదుల దశలో ఉన్న ఫోటోలు చూపించి మంత్రులు సత్యకుమార్ యాదవ్, హోం మినిష్టర్ అనిత వైసీపీ హయాంలో మెడికల్ కాలేజీలు కట్టలేదని అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కూటమి నేతలకు NMC ( నేషనల్ మెడికల్ కౌన్సిల్) షాక్ ఇచ్చింది.. వైఎస్ జగన్ హయాంలో ప్రారంభమైన 5 మెడికల్ కాలేజీలకు ఇప్పుడు NMC పీజీ సీట్లు కూడా కేటాయించింది అని సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు.

రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకు ఇది తొలి అడుగు

తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుకగా లైసెన్స్‌డ్ సర్వేయర్ల నియామకాన్ని అందించిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన అతిథిగా పాల్గొని శిక్షణ పొందిన సర్వేయర్లకు లైసెన్సులు పంపిణీ చేసిన కార్యక్రమానికి మంత్రి పొంగులేటి అధ్యక్షత వహించి మాట్లాడారు. మంత్రి మాట్లాడుతూ.. “దశాబ్దాలుగా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ఈ లైసెన్సుల పంపిణీ తొలి అడుగు. గత ప్రభుత్వంలో ధరణి పేరిట జరిగిన తప్పిదాలను సరిదిద్దే క్రమంలో మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇప్పటివరకు 3,456 మందికి లైసెన్సులు మంజూరు చేశాం” అని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రెవెన్యూ శాఖలో సర్వే వ్యవస్థను బలోపేతం చేయడానికి నిర్ణయించామని చెప్పారు. “దీనికి 10,000 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 7,000 మందికి శిక్షణ ఇచ్చాం. ఫీల్డ్ ట్రైనింగ్ పూర్తి చేసిన 3,456 మందిని ఎంపిక చేసి, వారికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా లైసెన్సులు అందజేస్తున్నాం” అని మంత్రి వివరించారు.

విజయవాడ వీధుల్లో సీఎం చంద్రబాబు కాలి నడక.. చిరు వ్యాపారులతో మాట ముచ్చట!

విజయవాడ నగరంలోని ప్రధాన వ్యాపార కూడలి బీసెంట్ రోడ్డులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా చిరు, వీధి వ్యాపారులతో ఆయన మాటామంతీ నిర్వహించారు. బీసెంట్ రోడ్డులో కాలినడకన చిరు వ్యాపారుల వద్దకు వెళ్ళిన సీఎం.. జీఎస్టీ సంస్కరణల అనంతరం వారికి కలుగుతున్న ప్రయోజనాల గురించి ఆరా తీశారు. జీఎస్టీ తగ్గింపుతో తగ్గిన ధరల మేరకే వస్తువులను ప్రజలకు విక్రయిస్తున్నారా అని ముఖ్యమంత్రి అడిగారు. పన్ను తగ్గింపుతో దసరా- దీపావళి పండుగలకు విక్రయాలు ఏ మేరకు పెరిగాయా లేదా అని వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. బీసెంట్ రోడ్డులో దీపావళి ప్రమిదలు విక్రయిస్తున్న మహిళతో మాట్లాడారు. వారి సాధకబాధకాలను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.

Exit mobile version