Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

అశ్లీల కంటెంట్ చూసి టెస్టోస్టెరాన్ పెరిగి, అత్యాచారాలకు పాల్పడుతున్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫూల్ సింగ్ బరయ్యా అత్యాచార కేసులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలతో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఎస్టీ హసన్ విభేదించారు. ఇలాంటి సంఘటనలకు మద్యం సేవించడమే కారణమని ఆయన అన్నారు. అత్యాచారాలను అడ్డుకునేందుకు కఠిన చట్టాలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిని చౌరస్తాలో కాల్చి చంపాలని డిమాండ్ చేశారు. మద్యం తాగిన తర్వాత ఒక వ్యక్తికి భార్య, కుమార్తె మధ్య తేడాను మరిచిపోతాడని, ఇలాంటి ఉదాహరణలు మనం చాలానే చూశామని అన్నారు.

పాకిస్తాన్ ఏజెంట్ ముందు అస్సాం తలవంచదు.. కాంగ్రెస్ నేత గురించేనా..

కాంగ్రెస్ నేత, లోక్‌సభ ఎంపీ, అస్సాం కాంగ్రెస్ చీఫ్ అయిన గౌరవ్ గొగోయ్‌పై మరోసారి అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తానీ ఏజెంట్ ముందు రాష్ట్రంలోని ప్రజలు తలవంచరని ఆదివారం ఆయన అన్నారు. కాజీరంగా ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమంలో హిమంత మాట్లాడుతూ.. అస్సామీలు పాకిస్తానీ ఏజెంట్ ముందు తలవంచరని, ఏ అపరిచితుడి ముందు కూడా తలవంచరని, తాము బటద్రవ థాన్‌ను ఆక్రమణదారుల నుంచి విముక్తి చేశామని అన్నారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో సీఎం హిమంత మాట్లాడుతూ.. ‘‘ గౌరవ్ గొగోయ్ మీరు వ్యతిరేకించాలనుకుంటే వ్యతిరేకించండి. కానీ అస్సాంకు ఆకాశాన్ని తాకాలనే కల ఉందని, మేము దాన్ని సాధిస్తాము’’ అని అన్నారు.

రక్తసిక్తమైన ఇరాన్! నిరసనల సెగకు 5 వేల మంది బలి..

ఇటీవల జరిగిన ఇరాన్‌ నిరసనల్లో సుమారుగా 5 వేల మంది మరణించారు. ఈ నిరసనల్లో ఇప్పటి వరకు కనీసం 5 వేల మంది మరణించారని ప్రభుత్వం నిర్ధారించింది. వీరిలో దాదాపు 500 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారని ఇరాన్ అధికారి ఆదివారం తెలిపారు. ఈ మరణాలకు ఉగ్రవాదులు, సాయుధ అల్లర్లే కారణమని, వారు చాలా మంది అమాయక ఇరాన్ పౌరులను చంపారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఇరాన్ అధికారి మాట్లాడుతూ.. వాయువ్య ఇరాన్‌లోని కుర్దిష్ ప్రాంతాలలో అత్యధిక హింస, మరణాలు సంభవించాయని తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం కుర్దిష్ వేర్పాటువాద గ్రూపులు చురుకుగా ఉన్నాయి. నిరసనల్లో మృతి చెందిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం లేదని తెలిపారు. వీధుల్లోకి వచ్చిన వారికి ఇజ్రాయెల్, విదేశాలలోని సాయుధ గ్రూపుల నుంచి మద్దతు, ఆయుధాలు లభించాయని ఆరోపించారు. నిజానికి ఇరాన్‌లో అశాంతికి విదేశీ శక్తులే కారణమని ఇరాన్ ప్రభుత్వం తరచుగా చెబుతూ వస్తుంది.

NTV జర్నలిస్టుల అక్రమ అరెస్టులపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ( EGI ) ఆందోళన

తెలంగాణలో ఎన్టీవీ జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేసిన తీరుపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని అత్యున్నత మీడియా సంస్థ అయిన ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (EGI) ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసింది. ఫేక్ న్యూస్ ప్రచారం చేశారనే అభియోగాలతో ఎన్టీవీకి చెందిన ఇద్దరు జర్నలిస్టులను అర్ధరాత్రి వేళ హడావుడిగా అరెస్టు చేసిన విధానాన్ని గిల్డ్ తీవ్రంగా ఖండించింది. ఈ అరెస్టుల విషయంలో పోలీసులు తీవ్రమైన అత్యుత్సాహం ప్రదర్శించారని, కోర్టు బెయిల్ మంజూరు చేసే వరకు వారిని లాకప్‌లో ఉంచడం ఏమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేసింది.

టార్గెట్ ట్రాఫిక్..! యంగ్ IPSలతో ట్రాఫిక్ కు చెక్..!

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఐపిఎస్ అధికారుల బదిలీలు చేపట్టారు. శనివారం వెలువడిన ఉత్తర్వుల్లో ముఖ్యమంత్రి ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు. నగరవాసులను ఏళ్ల తరబడి వేధిస్తున్న ట్రాఫిక్ చిక్కులకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేసే యువ ఐపిఎస్ అధికారులను ప్రభుత్వం రంగంలోకి దించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి సైబర్ నేరాలను, మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మాదకద్రవ్యాల సరఫరాను ఉక్కుపాదంతో అణచివేయాలని ముఖ్యమంత్రి పోలీసు అధికారులకు సూచించారు.

పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు బోల్తా.. ఐదుగురు మృతి, 25 మందికి గాయాలు

జార్ఖండ్‌లోని లతేహార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివాహ బృందం ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 25 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్ జిల్లా నుండి మహువాదర్‌కు వెళ్తున్న బస్సు మహువాదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓర్సా లోయ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారని, సహాయక చర్యలు ప్రారంభించామని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని జార్ఖండ్ పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమేమిటో స్పష్టంగా తెలియదని, దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.

MLA Gudem Mahipal Reddy : కాంగ్రెస్‌లో చేరి తప్పు చేశా.!

సంగారెడ్డి జిల్లా పటాంచెరు రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పటాంచెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన నిర్ణయంపై బహిరంగంగానే పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం తాను చేసిన ఒక “తప్పటడుగు” అని ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలోకి మారడం వల్ల తన నియోజకవర్గానికి లేదా నియోజకవర్గ ప్రజలకు కనీసం “వెంట్రుక వాసి” కూడా ప్రయోజనం కలగలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల విషయంలో ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం అందడం లేదనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. అప్పటి రాజకీయ పరిస్థితుల వల్ల ఒత్తిడికి లోనై కాంగ్రెస్‌లో చేరానే తప్ప, దాని వల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు.

మొబైల్ ఫోన్ కొనివ్వలేదని భార్య ఆత్మహత్య..

గుజరాత్‌లోని అరవల్లి జిల్లాలో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ ఆవేశపూరిత నిర్ణయం కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. మొబైల్ ఫోన్ గురించి భర్తతో గొడవ పడిన భార్య ఆత్మహత్యకు పాల్పడింది. నేపాల్ ‌కు చెందిన ఉర్మిళ ఖానన్ రిజన్ అనే మహిళ తన భర్త, బిడ్డతో కలిసి మోడసాలో నివసిస్తోంది. ఈ దంపతులకు ఆ ప్రాంతంలో ఒక చైనీస్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ ఉంది. ఉర్మిల తరుచుగా భర్తను మొబైల్ ఫోన్ కొనివ్వమని అడుగుతోంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా భర్త పదే పదే నిరాకరిస్తూ వస్తున్నాడు. ఫోన్‌ కొనుగోలు చేయకపోవడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గొడవ తర్వాత ఉర్మిళ కోపంతో భవన్‌పూర్ సమీపంలోని తన నివాసంలో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. ఈ ఘటనపై మోడసా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్ష కోసం పంపారు.

ఆర్థిక ఇబ్బందులు ఉన్నా హామీలు నెరవేరుస్తున్నాం

ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ సంక్షేమ పథకాల అమలులో తమ ప్రభుత్వం రాజీ పడబోదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో జరిగిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, గత ఎనిమిది నెలలుగా ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించారు. ఎన్నికల సమయంలో తాము ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ హామీలు ఇప్పుడు ‘సూపర్ హిట్’ అయ్యాయని, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ (దీపం-2), అన్నదాత సుఖీభవ వంటి కార్యక్రమాలను ఎంతో సమర్థవంతంగా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ఖజానాపై ఆర్థిక భారం ఉన్నప్పటికీ, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, ఈ క్రమంలోనే సామాజిక భద్రతా పెన్షన్లను గణనీయంగా పెంచి పేదలకు అండగా నిలిచామని పునరుద్ఘాటించారు.

కాశ్మీర్‌లో ‘ఉగ్ర’వేట.. ఏడుగురు సైనికులకు గాయాలు..

జమ్మూ కాశ్మీర్‌లో కిష్త్వార్ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఆదివారం మధ్యాహ్నం నుంచి కాల్పులు ప్రారంభయ్యాయి. సైన్యానికి చెందిన ఏడుగురు సైనికులు ఈ ఆపరేషన్‌లో గాయపడినట్లు తెలుస్తోంది. కఠిమైన పర్వత ప్రాంతాల్లో దాగి ఉన్న ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. దీనికి ‘‘ఆపరేషన్ త్రాహి-1’’ అని పేరు పెట్టారు. భారత సైన్యానికి చెందిన వైట్ నైట్ కార్ప్స్ ఈ ఆపరేషన్ చేపట్టింది. చత్రూ ప్రాంతంలోని సొన్నార్‌లో తనిఖీలు చేపడుతున్న సమయంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి.

 

Exit mobile version