Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

ముస్లిం దేశాలకు “పెద్దన్న” కావాలని పాకిస్తాన్ ఆరాటం..

పాకిస్తాన్ సైన్యానికి చీఫ్‌గా మారిన తర్వాత అసిమ్ మునీర్ ప్రవేశపెట్టిన ‘‘డిఫెన్స్ డాక్ట్రిన్’’(రక్షణ సిద్ధాంతం) కీలక లక్ష్యాలను వెల్లడిస్తోంది. ముస్లిం దేశాలకు ‘‘పెద్దన్న’’గా వ్యవహరించాలని పాక్ తహతహలాడుతోంది. ఆయుధాల ఎగుమతి, వ్యూహాత్మక సంబంధాలు, ఒప్పందాలు, సైనిక శిక్షణా కార్యక్రమాల ద్వారా ముస్లిం దేశాలకు తానే సంరక్షకుడిని అనే భావన కలిగించాలని పాక్ ప్రయత్నిస్తోందని భారత నిఘా వర్గాలు చెబుతున్నాయి. ప్రాంతీయ బెదిరింపులు, అస్థిరత ఎదుర్కొంటున్న ముస్లిం దేశాలకు అణ్వాయుధ రక్షణను అందించాలని పాకిస్తాన్ భావిస్తోంది. ముస్లిం ప్రపంచంలో పాకిస్తాన్ వద్ద మాత్రమే అణ్వాయుధాలు ఉన్నాయి. ఇజ్రాయిల్, ఇతర దేశాల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో మిత్రదేశాలకు వ్యూహాత్మక హామీలను అందించాలని పాక్ భావిస్తోంది. తద్వారా ఆయా దేశాల్లో తన పరపతి పెంచుకోవాలని చూస్తోంది.

నిర్భయ తరహా ఘటన.. ఆర్కెస్ట్రాలో పనిచేసే యువతి కిడ్నాప్‌.. మద్యం తాగించి, ఆరుగురు లైంగిక దాడి..!

నిర్భయ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. 2012లో నిర్భయ సామూహిక అత్యాచారం ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. నిర్భయ దారుణానికి పాల్పడిన వారికి మరణశిక్ష విధించింది కోర్టు.. కానీ, ఇలాంటి మనస్తత్వాలు కలిగిన నేరస్థులు.. ఇప్పటికీ సమాజంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు.. అవకాశం దొరికినప్పుడల్లా రెచ్చిపోతున్నారు.. బరితెగించి అత్యాచార ఘటనకు పాల్పడుతున్నారు.. నిర్భయ ఘటన జరిగిన దాదాపు 14 సంవత్సరాల తరువాత, రాజధాని ఢిల్లీ నుండి దాదాపు 1,300 కిలోమీటర్ల దూరంలో, క్రూరమైన నేరస్థుల ముఠా మరొక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసింది.. బీహార్‌లోని పూర్నియాలో , ఆరుగురు వ్యక్తులు ఒక అమ్మాయిని బలవంతంగా కారులోకి ఎక్కించి, ఆపై 25 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి, అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు..

చైనాకు చెక్ పెట్టిన ఇండియా ఫ్రెండ్.. డ్రాగన్ ఆట ముగిసినట్లే!

ప్రపంచ సాంకేతికత, ఆధునిక యుద్ధానికి పునాది అయిన అరుదైన భూమి లోహాలపై చైనా గుత్తాధిపత్యం కలిగి ఉంది. 2025లో చైనా విధించిన ఆంక్షల తరువాత ఇండియా స్నేహితుడు అయిన జపాన్ బీజింగ్‌కు చెక్ పెట్టింది. వాస్తవానికి ప్రపంచం ఇప్పటివరకు చైనాపై ఆధారపడిన విలువైన ఖనిజాలను వెలికితీసేందుకు జపాన్‌కు చెందిన ఒక భారీ నౌక బయలుదేరింది. దీంతో ఈ ఆటలో ఇకపై చైనా ఆట ముగిసినట్లే అని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాయిటర్స్ నివేదికల ప్రకారం.. జపాన్ యొక్క పరీక్షా నౌక చిక్యూ, టోక్యో నుంచి దాదాపు 1,900 కిలోమీటర్ల దూరంలో ఉన్న మినామిటోరి ద్వీపం వైపు వెళుతోంది. ఈ ఓడ యొక్క లక్ష్యం చాలా సంక్లిష్టమైనది. ఎందుకంటే ఇది మినామిటోరి ద్వీపం ప్రాంతంలోని సముద్ర ఉపరితలం నుంచి 6 కిలోమీటర్లు (4 మైళ్ళు) దిగువన డైవ్ చేయబోతుంది. ఈ సముద్రపు అడుగున ఉన్న బురదలో అరుదైన రేర్‌ఎర్త్ ఖనిజాల అపార నిల్వలు ఉన్నాయని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. ఇంత లోతు నుంచి నిరంతరం బురదను వెలికితీసి విశ్లేషించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి అవుతుందని చెబుతున్నారు. 130 మంది సిబ్బంది, పరిశోధకుల బృందంతో కూడిన ఈ నౌక ఈ మిషన్‌ను పూర్తి చేసి ఫిబ్రవరి 14 నాటికి తిరిగి వస్తుందని సమాచారం.

ప్రీమియర్స్’తో 1.2 మిలియన్..నిర్మాతకు కారు కొనివ్వనున్న అనిల్ రావిపూడి

అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా భగవంత్ కేసరి సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా హిట్ అయిన తర్వాత, నిర్మాత సాహు గారపాటి అనిల్ రావిపూడికి అత్యంత విలువైన టయోటా వెల్‌ఫైర్ కార్ గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లోనే మరోసారి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా రూపొందింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్‌గా నటించిన సినిమాలో వెంకీ మామ మరో కీలక పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమా మొదటి ఆట నుంచే యునానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుని బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు పెడుతోంది.

జగన్ హయాంలో 3.32 లక్షల కోట్లు అప్పు.. ఈ 18 నెలల్లో 3.02 లక్షల కోట్ల అప్పులు..!

కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత అంబటి రాంబాబు.. వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఐదేళ్లలో చేసిన అప్పులతో పోలిస్తే, కూటమి ప్రభుత్వం కేవలం 18 నెలల్లోనే దాదాపు అదే స్థాయి అప్పులు చేసిందని ఆరోపించారు. జగన్ హయాంలో మొత్తం ఐదేళ్లలో రూ.3.32 లక్షల కోట్ల అప్పులు చేస్తే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో 18 నెలల్లోనే రూ.3.02 లక్షల కోట్ల అప్పులు చేశారని అంబటి రాంబాబు పేర్కొన్నారు. అంటే జగన్ హయాంలో చేసిన అప్పుల్లో దాదాపు 90 శాతం అప్పులను కేవలం ఏడాదిన్నరలోనే చేశారని అన్నారు. జగన్ అప్పులు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందని చెప్పిన వారు, చంద్రబాబు అప్పులు చేస్తే రాష్ట్రం సింగపూర్ అవుతుందా అంటూ ప్రశ్నించారు.

పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో భారీ బాంబు పేలుడు.. ఆరుగురు పోలీసులు మృతి

పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు పోలీసు అధికారులు మరణించారు. పాకిస్తాన్ అంతర్గత మంత్రి మొహ్సిన్ నఖ్వీ బాంబు దాడిని ఖండించారు. ఆఫ్ఘన్ సరిహద్దుకు సమీపంలోని ట్యాంక్ జిల్లాలో బాంబు పేలుడు చోటుచేసుకుంది. మరణించిన వారిలో స్థానిక పోలీసు చీఫ్ ఇషాక్ అహ్మద్ ఉన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, ఈ సంఘటన గురించి మరిన్ని వివరాలు అందించడానికి పోలీసు అధికారులు నిరాకరించారు. ఈ దాడికి ఏ సంస్థ ఇంకా బాధ్యత వహించలేదు. పాకిస్తాన్ తాలిబన్ లేదా తెహ్రిక్-ఎ-తాలిబన్ పాకిస్తాన్ దాడికి పాల్పడి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

వియత్నాం టూర్‌లో రాహుల్ గాంధీ.. ‘‘పార్టీ-టూరిజం’’ లీడర్ అని బీజేపీ ఫైర్..

కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వియత్నాంలో పర్యటిస్తున్నారు. అయితే, ఈ పర్యటనపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఆయన ప్రతిపక్ష నేతకాదని, పార్టీలు చేసుకునే నేత, టూరిస్ట్ లీడర్ అంటూ విమర్శించింది. ఇటీవల, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో కూడా రాహుల్ గాంధీ జర్మనీలో పర్యటించారు. ‘‘రాహుల్ గాంధీ శాశ్వతంగా సెలవుల మూడ్‌లో ఉంటారు’’ అని బీజేపీ నేత షెహజాద్ పూనావాలా అన్నారు. ‘‘రెండు విదేశీ పర్యటన మద్య అతను కొన్ని రోజుల పాటు భారత్ వచ్చి జంగిల్ సఫారీకి వెళ్లి, మళ్లీ విదేశాలకు వెళ్లిపోతారు. ఎన్నికల్లో ఓడిపోతే ఎన్నికల సంఘాన్ని నిందిస్తారు. ఇది రాహుల్ గాంధీ సీరియస్ రాజకీయ నాయకుడు కాదని, పరిణతి లేని వ్యక్తి అని చూపిస్తోదని, అందుకే కాంగ్రెస్ మిత్రపక్షాలు కూడా సంతోషంగా లేవు’’ అని అన్నారు. విపక్షాలు రాహుల్‌ను తొలగించి ప్రియాంకాను తీసుకోవాలని కోరుతున్నాయని పూనావాలా అన్నారు. దేశానికి సంబంధించి కీలక సమస్యలు తలెత్తినప్పుడల్లా రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లడం ఒక అనవాయితీగా మారిందని బీజేపీ ఎమ్మెల్యే జితేంద్ర గోత్వాల్ అన్నారు.

కుళాయి వద్ద ఘర్షణ.. పచ్చని పల్లెలో రక్తపాతం.. నలుగురి హత్య..!

కర్నూలు జిల్లా అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఫ్యాక్షన్.. ఇపుడు ఆ పదం వినిపించడమే అరుదు. అలాంటి సమయంలో ఎమ్మిగనూరు మండలం కాందనాతిలో పాత కక్షలు చెలరేగి ఇద్దరు వేటకొడవళ్లకు బలయ్యారు. ఇంట్లో, పొలం వెళ్లే దారిలో, పొలంలో… ఇలా వెంటాడి వేటాడి హత్య చేశారు. ఏడాది క్రితం జరిగిన హత్యలకు ప్రతీకారమే ఈ హత్యలుగా తేల్చారు.. కందనాతిలో ముగ్గురు అన్నదమ్ముల కుటుంబలపై ప్రత్యర్థులు చెలరేగిపోయారు. పరమేష్ అనే వ్యక్తిని ఇంట్లోనే దారుణంగా నరికి హత్య చేశారు. ఇతర కుటుంబ సభ్యులు పొలంలో ఉన్నారని తెలిసి మూకుమ్మడిగా కొడవళ్లతో వెళ్లారు. పొలం పనులు పూర్తి చేసుకొని ట్రాక్టర్ లో గోవింద్ (45), భార్య వీరేషమ్మ వస్తుడగా వారిపైనా దాడి చేశారు. వేటకొడవళ్ల దాడిలో గోవింద్ పొట్ట చీలిపోయి పేగులు బయటికి వచ్చాయి. వీరేషమ్మ పై దాడి చేయబోగా వేటకొడవలి వేటు ఆమె ఐదేళ్ల కుమారుడు లోకేంద్ర కు పది తీవ్రంగా గాయపడ్డారు. వీరేషమ్మ కేకలు వేయడంతో ప్రత్యర్థులు పొలం వైపు వెళ్లారు. పొలంలో ఉన్న వెంకటేష్ ను కూడా నరికి చంపేశారు. గాయపడిన గోవిందు, ఐదేళ్ల బాలుడు లోకేంద్ర ను కర్నూలు ఆసుపత్రికి తరలించారు.

రైతన్నకు శుభవార్త.. సన్న ధాన్యానికి బోనస్ విడుదల

సంక్రాంతి సంబరాల్లో ఉన్న తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన శుభవార్త చెప్పింది. ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన ‘సన్న వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 500 బోనస్’ పథకానికి సంబంధించి పౌరసరఫరాల శాఖ తాజాగా నిధులను విడుదల చేసింది. పండుగ పూట రైతుల ఖాతాల్లోకి ఈ బోనస్ సొమ్ము చేరుతుండటంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. సన్న రకం ధాన్యం పండించిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తాజాగా రూ. 500 కోట్ల బోనస్ నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సీజన్‌లో సన్నాలు పండించి, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ప్రతి రైతుకు క్వింటాల్‌కు రూ. 500 అదనంగా చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకే అధికారులను ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ ఈ ప్రక్రియను వేగవంతం చేసింది.

మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్.. పండుగ వేళ పెరిగిన లిక్కర్‌ రేట్లు

సంక్రాంతి పండుగ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ప్రియులకు షాక్ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలను పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ ధరలు పెరిగాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, రూ.99 ఎంఆర్‌పీ ఉన్న మద్యం బాటిళ్లను మినహాయించి మిగిలిన అన్ని రకాల మద్యం ఉత్పత్తులపై ఒక్కో బాటిల్‌కు రూ.10 చొప్పున ధర పెంచారు. ఇందులో IMFL, FL, బీర్, వైన్ వంటి అన్ని విభాగాల మద్యం ఉత్పత్తులు ఉన్నాయి. రూ.99 ధర ఉన్న బీర్, వైన్ బాటిళ్లకు మాత్రం ఈ పెంపు వర్తించదని స్పష్టం చేసింది సర్కార్..

 

Exit mobile version