లాలూ ఫ్యామిలీకి ఝలక్.. ప్రభుత్వ బంగ్లా నుంచి వస్తువులు తరలింపు!
ఎట్టకేలకు లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసింది. పాట్నాలోని 10 సర్క్యులర్ రోడ్‌లోని బంగ్లాలో 19 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయం పాలైంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని లాలూ కుటుంబానికి నోటీసులు ఇచ్చింది. దీనిపై గత కొద్దిరోజులుగా రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఖాళీ చేసేందుకు నిరాకరించింది. ముఖ్యమంత్రులుగా పని చేసిన తమకు బంగ్లాను కేటాయించారా? అని ఆర్జేడీ నిలదీసింది. పైగా లాలూ ప్రసాద్‌కు అనారోగ్యం కారణంగా ఇదే బంగ్లా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కానీ ప్రభుత్వం నిరాకరించింది. మొత్తానికి గురువారం సాయంత్రం నుంచి బంగ్లాను ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. వస్తువులు తరలిస్తున్న వాహనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నేను మా నాన్న పేరు చెప్పుకుంటే తప్పేమిటి?.. తెలంగాణ తెచ్చిన మొనగాని పేరు చెప్పుకుంటే తప్పా?
మాజీమంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్లో జరిగిన జాయినింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మార్పు అని చెప్పి ఊదరగొట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయిందన్నారు. ఈ రెండేళ్లలో కూల్చివేతలు, ఎగవేతలు, పేల్చివేతలు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని విమర్శించారు. అప్పుడు కాలేశ్వరం బ్యారేజ్ ని పేల్చారు.. ఇప్పుడు చెక్ డ్యాం లను పేలుస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెసోళ్లు దొంగతనంగా ఇసుక తరలించేందుకు కష్టమవుతుంది అని చెక్ డ్యాం లు పేలుస్తున్నారు. నిన్న మొన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. టీవీ పెడితే ఆయన మాట్లాడే తిట్ల పురాణం వినిపిస్తుందన్నారు.
కార్పొరేట్ బ్యాంకుల పని తీరు సరిగ్గా లేదు..
గుంటూరు కలెక్టరేట్ లో బ్యాంకర్లతో సమీక్షా సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ.. గుంటూరు పార్లమెంటులో ఎన్నో ప్రభుత్వ పథకాలు ఉన్నాయి.. అవి ప్రజలకు ఎంత వరకు చేరువ అవుతున్నాయి అనే అంశంపై బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాం.. బ్యాంకుల్లో అన్ క్లైమ్డ్ నగదు నిల్వలు ఉన్నాయి.. వాటిని ఎలా లబ్దిదారులకు అందించాలనే అంశంపై దృష్టి పెట్టామని చంద్రశేఖర్ తెలిపారు. అయితే, కార్పొరేట్ బ్యాంకుల పని తీరు సరిగ్గా లేదని కేంద్రమంత్రి పెమ్మసాని అన్నారు. మరో మూడు నెలలు సమయం ఇచ్చి చర్యలు తీసుకుంటాం.. కౌలు రైతులకు గత ప్రభుత్వం రూ. 180 కోట్లకు గాను కేవలం 30 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చింది.. కూటమి ప్రభుత్వం ద్వారా రూ. 110 కోట్ల రుణాలు అందించాం.. కౌలు రైతుల రుణాలు సక్రమంగా వసూలు కావటం లేదని బ్యాంకర్లు చెప్పారు.. ప్రతి స్కీం అర్హులైన వారికి చేరువయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
ఒక రైతుగా జిల్లా కలెక్టర్ను కలిశా.. దీన్ని రాజకీయం చేయొద్దండి
అనంతపురం జిల్లా పుట్లూరు మండల రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ కు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పుట్లూరు మండలంలోని సుబ్బరాయ సాగర్ కి నీటిని విడుదల చేయాలని కోరారు. ఇక, మాజీ ఎమ్మెల్యే జేసీ మాట్లాడుతూ.. గత రెండు నెలల కిందట సుబ్బరాయ సాగర్ లో 11.4 మీటర్ల నీరు ఉంది.. గేట్లు తెరుచుకోకపోవడం తమ దురదృష్ట్రం అన్నారు. అందువల్ల నీరు మొత్తం 29వ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి బొప్పేపల్లి చెరువుకు మళ్ళించడం జరిగిందని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అయితే, పుట్లూరు, కోమటికుంట్ల, గరుగు చింతలపల్లి చెరువులను నీటితో నింపలేక పోయారని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు ఈ గేట్లకు మరమ్మత్తులు చేయించడం జరిగింది.. ఇప్పుడు పెనకచర్ల డ్యామ్ నుంచి సుబ్బరాయ సాగర్ కు నీటిని రిలీజ్ చేయాలని జిల్లా కలెక్టర్ ని కోరాం.. నీరు ఇవ్వకపోతే పుట్లూరు మండలంలోని రైతులు నష్టపోతారని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆనంద్ సానుకూలంగా స్పందించారు.. ఒక రైతుగా జిల్లా కలెక్టర్ ని కలిశాను.. దయచేసి దీన్ని రాజకీయం చేయొద్దండి అన్నారు. పుట్లూరు మండలంలో నాకు భూమి ఉందని జేసీ ప్రభాకర్ తెలియజేశారు.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పరిపాలన విభాగంలో ప్రభుత్వం భారీ మార్పులు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పురపాలక సంఘాల్లో పనిచేస్తున్న 11 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ, వారికి కొత్త పోస్టింగ్‌లు కల్పిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనను మరింత వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఉత్తర్వుల ప్రకారం, పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ బాధ్యతలను డి. పావనికి అప్పగించగా, అనంతపురం డిప్యూటీ కమిషనర్ పోస్టులో ఎం. అంజయ్య నియమితులయ్యారు. అలాగే, నరసాపూర్ మున్సిపల్ కమిషనర్‌గా ఆర్. వెంకట్రామిరెడ్డి, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్‌గా యు. శారదాదేవిని ప్రభుత్వం నియమించింది. కృష్ణా జిల్లా పెడన మున్సిపల్ కమిషనర్‌గా డి. కొండయ్య బాధ్యతలు చేపట్టనున్నారు.
జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ తుది నోటిఫికేషన్ విడుదల
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో పాలనా యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకమైన పునర్విభజన ప్రక్రియను పూర్తి చేసింది. పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా పౌర సేవలను వేగవంతం చేసే ఉద్దేశంతో జిహెచ్ఎంసి డీలిమిటేషన్‌కు సంబంధించి ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నూతన సంస్కరణల ప్రకారం భాగ్యనగరంలో ప్రస్తుతం ఉన్న 150 డివిజన్ల సంఖ్యను ఏకంగా 300కు పెంచుతూ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కేవలం డివిజన్ల సంఖ్యనే కాకుండా, పాలనా సౌలభ్యం కోసం ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 12కు , 30 సర్కిళ్లను 60కి పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మార్పుల వల్ల ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజగిరి, శంషాబాద్, గోల్కొండ , రాజేంద్రనగర్ ప్రాంతాలు కొత్త జోన్లుగా ఏర్పడ్డాయి. ఈ ప్రక్రియలో భాగంగా వార్డు స్థాయి కార్యాలయాల్లో కొత్త సర్కిల్ కార్యాలయాలు, ప్రస్తుత సర్కిల్ కార్యాలయాల్లో జోనల్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.
మంటలతో పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన ఓమ్నీ వ్యాన్
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పరిధిలోని అన్నోజిగూడ సమీపంలో శుక్రవారం పెను ప్రమాదం తృటిలో తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక ఓమ్నీ వ్యాన్‌లో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. మంటలు వ్యాపించిన సమయంలో వాహనంలో ఉన్న ప్రయాణికులు ప్రాణభయంతో కిందకు దిగి పరుగులు తీయడంతో పెను ప్రాణనష్టం తప్పింది. పెట్రోల్ బంకులోకి మంటల వాహనం ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్ ఘట్కేసర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్తోంది. ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు అంటుకోవడంతో డ్రైవర్ వాహనాన్ని ఆపే ప్రయత్నం చేశాడు. అయితే, కంగారులో హ్యాండ్ బ్రేక్ వేయకుండానే డ్రైవర్ కిందకు దిగిపోవడంతో, మండుతున్న ఆ ఓమ్నీ వ్యాన్ అదుపు తప్పి నేరుగా రహదారి పక్కనే ఉన్న పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లింది.
వంగవీటి రంగా వర్ధంతి.. ఆసక్తికరంగా మారిన వైఎస్ జగన్ వ్యాఖ్యలు..
వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ చర్చలకు దారి తీస్తోంది. రంగా కుమారుడు వంగవీటి రాధా వైసీపీలో ఉన్నంతకాలం రంగా జయంతులు, వర్ధంతులను అధికారికంగా నిర్వహించిన వైసీపీ.. ఆ తర్వాత అలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంది.. కనీసం, గత ఐదేళ్ల వైసీపీ పాలనలోనూ వంగవీటి మోహన రంగా పేరుతో ఎలాంటి అధికారిక కార్యక్రమాలు వైసీపీ చేయలేదు.. అయితే, నేడు రంగా వర్ధంతి సందర్భంగా.. “పేదల సమస్యలను తన సమస్యలుగా భావించి, వారి గొంతుకగా నిలిచిన గొప్ప నాయకుడు వంగవీటి మోహన రంగా..# అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేసి నివాళులు అర్పించారు.
చివరి దశకు మేడారం గుడి పునర్నిర్మాణ పనులు
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ప్రాంగణం సరికొత్త రూపు సంతరించుకుంటోంది. తెలంగాణ కుంభమేళాగా పిలవబడే ఈ వనదేవతల జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. సుమారు 25.5 కోట్ల రూపాయల భారీ నిధులతో రూపొందించిన మాస్టర్ ప్లాన్ పనులను అధికారులు అత్యంత వేగంగా పూర్తి చేస్తున్నారు. 2026లో జరగబోయే మహాజాతర నాటికి భక్తులకు సరికొత్త అనుభూతిని అందించేలా ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు.
నిమ్మకూరులో నారా భువనేశ్వరి పర్యటన.. గత స్మృతులను స్మరించుకొని..!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పామర్రు నియోజకవర్గంలోని ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో పర్యటించారు.. స్థానికంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తిలకించారు.. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి.. చిన్ననాడు నిమ్మకూరులో గత స్మృతులను స్మరించుకున్నారు. వేసవి సెలవుల్లో నిమ్మకూరు వచ్చే వారని, సోదరితో కలిసి బస్సులో సినిమాకి పామర్రు వరకు వెళ్లే వాళ్లమని విషయాలను పంచుకున్నారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని ఎదగాలని కోరారు.. పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌లో విద్యార్థులు నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను పరిశీలించిన భువనేశ్వరి, చిన్నారుల ప్రతిభను ప్రశంసించారు. విద్యార్థుల శ్రమ, ప్రతిభను గౌరవిస్తూ.. “మీ విజ్ఞానం మీకు దారి చూపుతుంది. మీరు చేస్తున్న ప్రతి పని రేపటి విజయానికి పునాది.” అని చెప్పారు.
