Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

పీకుడు భాష డైలాగులకే పనికి వస్తాయి తప్ప ప్రజలకు ఉపయోగపడవు..

మెడికల్ కాలేజ్ కోటి సంతకాలపై సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి వ్యాఖ్యలను ప్రజలు గమనించాలి అని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. అసలు రాష్ట్రంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారో ఈ మంత్రికి తెలుసా?.. ఏ గ్రామానికైనా వెళ్ళి క్రాస్ చెక్ చేసుకున్నా IVRS సర్వే చేస్తే ప్రజల అభిప్రాయం ఏంటో మంత్రికి అర్థం అవుతుందన్నారు. చిల్లర మాటలు మాట్లాడి స్థాయి దిగజార్చుకోవద్దని సూచించారు. PPP ద్వారా అవినీతికి పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు ఉంటాయి.. అది మా పార్టీ విధానమని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి బెదిరింపులు అనడం ఏంటి.. స్వార్ధం కోసం పీపీపీల ద్వారా లబ్ధి పొందిన వాళ్లపై కఠినంగా వ్యవహరిస్తామని బొత్స వార్నింగ్ ఇచ్చారు.

ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత.. హిందూ సంఘాల నిరసన

దేశ రాజధాని ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులకు నిరసనగా వీహెచ్‌పీ, హిందూ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. ఆందోళనకారులు కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. ఆందోళనకారులు బారికేడ్లను తోసి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ప్రస్తుతం కమిషన్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌లో ఇటీవల హిందూ వ్యక్తి దీపు దాస్‌ను అత్యంత దారుణంగా హతమార్చారు. అంతేకాకుండా హిందువులపై దాడులు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దీపు దాస్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్ ముహమ్మద్ యూనస్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.

వీసాలు.. అమెరికా వేషాలు..

హెచ్‌1బీ వీసాదారులకు.. అమెరికా వరుసగా షాకులు ఇస్తోంది. ఇప్పటికే హెచ్‌1బీ వీసాలు ఫీజులను పెంచిన అమెరికా…తాజాగా వీసా ఇంటర్వ్యూలను రద్దు చేసింది. క్రిస్మస్‌ హాలిడేస్‌ కారణమని ట్రంప్‌ సర్కార్‌ చెబుతుంటే…సోషల్ వెట్టింగ్‌ వల్లేనని అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ స్పష్టం చేసింది. అమెరికాకు వె‌ళ్లాలి.. అక్కడే విద్యనభ్యసించాలి. అక్కడే సెట్‌ అయిపోవాలి. జీవితాన్ని హాయిగా గడపాలి. ఇది ఎంతో మంది విదేశీ విద్యార్థుల కల. అందుకు అనేక సవాళ్లు సైతం ఎదుర్కొనేందుకు సిద్ధపడతారు. కానీ, అమెరికా ప్రయాణానికి ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇక నుంచి మరో లెక్కలా మారిపోయింది పరిస్థితి. కారణం.. అధ్యక్షుడు ట్రంప్‌ కఠిన నిర్ణయాలు. అంతకు మించి ఆయన టెంపరితనం. వలసదారులంటేనే ఆగ్రహం వ్యక్తం చేసే ట్రంప్‌.. ఇప్పుడు అమెరికాలో అడుగు పెట్టాలంటేనే వణుకుపుట్టేలా వ్యవహరిస్తున్నారు.

కేసీఆర్కు సిట్ నోటీసులు?.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ లకు సిట్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నాను అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. నాతో పాటు అగ్ర నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేయడంతో వల్ల ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టారు.. చివరికి కన్న బిడ్డ, అల్లుడి ఫోన్లను కూడా ట్యాప్ చేసిన నీచులు.. దేశవ్యాప్తంగా మంచి పేరున్న ఎస్ఐబీ వ్యవస్థను రాష్ట్రంలో భ్రష్టు పట్టించారు.. ఎస్ఐబీని అడ్డు పెట్టుకుని బ్లాక్ మొయిల్ చేసి కాంట్రాక్టర్లు, లీడర్ల వద్ద డబ్బులు వసూలు చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.. కేసీఆర్, కేటీఆర్ లకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటారా?… పూర్తిస్థాయిలో విచారణ జరిపి దోషులను తేల్చుతారా? అనేది అనుమానమేనని బండి సంజయ్ అన్నారు.

విదేశాల్లో దేశ ప్రతిష్టతను దెబ్బతీస్తున్నారు.. రాహుల్‌గాంధీపై బీజేపీ ఫైర్

కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై బీజేపీ ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా మండిపడ్డారు. విదేశాల్లో దేశ ప్రతిష్టతను దెబ్బతీసేలా వ్యవహరించడం రాహుల్‌గాంధీకి అలవాటుగా మారిపోయిందని ధ్వజమెత్తారు. భారత్‌ను అవమానించేందుకే రాహుల్‌గాంధీ విదేశాల్లో పర్యటిస్తున్నారన్నారు. విదేశాల్లో భారత వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ప్రస్తుతం జర్మనీ పర్యటనలో ఉన్నారు. ఐదు రోజుల పర్యటన కోసం జర్మనీలోని బెర్లిన్‌లో పర్యటించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. బీజేపీ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. భారత్‌లో అధికార పార్టీకి ఈడీ, సీబీఐ ఆయుధాలు అని.. వారిపై ఒక్క కేసు కూడా లేదని ఆరోపించారు. భారత్‌లో బీజేపీ రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) లను ఉపయోగించుకుంటుందని తెలిపారు. భారత రాజ్యాంగంపై దాడి జరుగుతోందని.. పూర్తి స్థాయిలో దాడి జరుగుతోందని వ్యాఖ్యానించారు. రాజకీయ కేసుల్లో ఎక్కువ భాగంగా వారిని వ్యతిరేకించే వారిపైనే కేసులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఒక వ్యాపారవేత్త కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చాడని బెదిరించారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం దాడికి గురవుతోందని… దానిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో మాత్రం తాము గెలిచామని చెప్పారు. భారతదేశంలో ఎన్నికల నిష్పాక్షపాతం జరిగేంత వరకు సమస్యలను లేవనెత్తుతుంటామని తెలిపారు. ఎన్నికల యంత్రాంగంలో సమస్య ఉందని ప్రాథమికంగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు.

ఏపీ అసెంబ్లీ సెక్రటేరియట్ 2026 క్యాలెండర్, డైరీ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

ఏపీ అసెంబ్లీ సెక్రటేరియట్ రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమక్షంలో ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో 2026 క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు. జీవ వైవిద్యం- ఆంధ్రప్రదేశ్ సజీవ వారసత్వం అనే థీమ్‌తో అసెంబ్లీ సెక్రటేరియట్ క్యాలెండర్ ను రూపొందించింది. ఏపీలోని ప్రకృతి సంపద, కళలు, సంప్రదాయాలు, ఆధునిక సాంకేతికతలకు అద్దం పట్టేలా కొత్త సంవత్సరం క్యాలెండర్ రూపొందించింది.

కొండగట్టులో ‘శాఖల’ యుద్ధం..!

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న సన్నిధిలో ఆధ్యాత్మిక వాతావరణానికి బదులు ఇప్పుడు భూవివాద సెగలు కనిపిస్తున్నాయి. ఆలయ అభివృద్ధి పనుల విషయంలో దేవాదాయ శాఖ , అటవీ శాఖల మధ్య తలెత్తిన విభేదాలు ఇప్పుడు రచ్చకెక్కాయి. ఈ రెండు శాఖలకు ఒకరే మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, అధికారులు మాత్రం ఒకరిపై ఒకరు నోటీసులు ఇచ్చుకోవడం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ వివాదానికి ప్రధాన కారణం ఆలయ పరిధిలో ఉన్న సుమారు ఆరు ఎకరాల భూమి. ఈ స్థలం కొడిమ్యాల రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని 643 సర్వే నెంబర్‌లో ఉందని, ఇది తమ శాఖకు చెందిన భూమి అని అటవీ శాఖ గట్టిగా వాదిస్తోంది. ఈ మేరకు ఆలయ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ, 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రస్తుతం ఆలయ ఈఓ కార్యాలయం, అన్నదాన సత్రం, ఆగమ వేద పాఠశాల వంటి కీలక కట్టడాలు ఈ వివాదాస్పద స్థలంలోనే ఉన్నాయి.

సన్ పరివార్ 158 కోట్ల కుంభకోణం.. మెతుకు రవీందర్‌పై ఈడీ ఛార్జిషీట్..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘సన్ పరివార్’ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన దర్యాప్తును వేగవంతం చేసి, తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసింది. అధిక వడ్డీలు, భారీ లాభాల పేరిట సామాన్య , మధ్యతరగతి ప్రజలను నమ్మించి సుమారు 158 కోట్ల రూపాయల మేర మోసం చేసినట్లు ఈడీ పక్కా ఆధారాలతో నిర్ధారించింది. ఈ కుంభకోణానికి సూత్రధారి అయిన మెతుకు రవీందర్ ప్రస్థానం ఒక సాధారణ ఉపాధ్యాయుడిగా ప్రారంభమైనప్పటికీ, అతి తక్కువ కాలంలోనే కోట్లకు పడగలెత్తాలనే దురాశతో వేలాది మంది జీవితాలను చిన్నాభిన్నం చేశారు. టీచర్‌గా తన వృత్తిని వదిలిపెట్టి పూర్తిస్థాయిలో వడ్డీ వ్యాపారంలోకి దిగిన రవీందర్, ప్రజల బలహీనతలను పెట్టుబడిగా మార్చుకున్నారు.

‘ఉచ్చు’లో సెలబ్రిటీలు: రీతూ చౌదరి, భయ్యా సన్నీ ఖాతాల్లో లక్షలాది రూపాయలు?

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసులో దర్యాప్తు తుది దశకు చేరుకుంది. ఈ వ్యవహారంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీల పాత్రపై దృష్టి సారించిన సీఐడీ (CID) అధికారులు, తాజాగా కీలక విచారణను పూర్తి చేశారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశారనే ఆరోపణలతో టీవీ నటి రీతూ చౌదరి, సోషల్ మీడియా సెలబ్రిటీ భయ్యా సన్నీ యాదవ్‌లను సీఐడీ పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన ఈ విచారణలో వీరిద్దరి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. యాప్స్ నిర్వాహకులతో వీరికి ఉన్న ఒప్పందాలు, ప్రమోషన్ల కోసం తీసుకున్న పారితోషికం వంటి అంశాలపై అధికారులు ఆరా తీశారు.

ఏఓబీలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. 22 మంది మావోయిస్టులు లొంగుబాటు
ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతం (ఏఓబీ)లో మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లాలో 22 మంది మావోయిస్టులు ఒడిశా డీజీపీ ఎదుట లొంగిపోయారు. వరుస ఆపరేషన్లు, భద్రతా బలగాల ఒత్తిడి నేపథ్యంలో ఈ లొంగుబాటుకు ప్రాధాన్యత సంతరించుకుంది. లొంగిపోయిన వారిలో ఆరుగురు డివిజనల్ కమిటీ సభ్యులు, ఆరుగురు ఏరియా కమిటీ సభ్యులు సహా మొత్తం 15 మంది కీలక మావోయిస్టు సభ్యులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరితో పాటు ఆయుధాలు, పేలుడు సామగ్రిని కూడా పోలీసులకు అప్పగించారు. ఇందులో ఒక ఏకే-47 రైఫిల్, రెండు ఇన్సాస్ రైఫిళ్లు, ఒక ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్, మూడు 303 రైఫిళ్లు, రెండు సింగిల్ షాట్ రైఫిళ్లు, అలాగే 14 ల్యాండ్‌మైన్‌లు ఉన్నాయి.ట

Exit mobile version