Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

భారతదేశంపై సంచలన వ్యాఖ్యలు.. అందుకే దుబాయ్‌కు వెళ్ళిపోయానన్న రిమీ సేన్!

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ ‘ధూమ్’ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిన నటి రిమీ సేన్. ‘హంగామా’, ‘గోల్ మాల్’ వంటి సూపర్ హిట్ కామెడీ చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ బెంగాలీ భామ, తెలుగులో చిరంజీవి సరసన ‘అందరివాడు’ మూవీలో కూడా నటించింది. కానీ గత కొంతకాలంగా వెండితెరకు పూర్తిగా దూరమైంది. 2011లో వచ్చిన ‘షాగీర్ద్’ ఆమె చివరి సినిమా. అయితే, ఆమె ఇప్పుడు కేవలం సినిమాలకు దూరమవ్వడమే కాదు, ఏకంగా దేశాన్ని కూడా వదిలి దుబాయ్‌లో స్థిరపడ్డారు. అంతే కాదు రిమీ గురించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది.

రాష్ట్రంలో రూ.6 వేల కోట్లతో రియాక్టర్ విద్యుత్ ప్లాంట్

క్లీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణ మరో ముందడుగు వేసింది. రూ.6 వేల కోట్ల పెట్టుబడితో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ (ఎస్‌ఎంఆర్) ఆధారిత విద్యుత్ ప్రాజెక్ట్ అభివృద్ధికి స్లోవాకియాకు చెందిన న్యూక్లర్ ప్రొడక్ట్స్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సంస్థ ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ) సమర్పించింది. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక–2026 సమావేశాల సందర్భంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐక్యూ క్యాపిటల్ గ్రూప్ ఛైర్మన్ డా. జాన్ బాబిక్, గ్రూప్ సీఈఓ , డైరెక్టర్ అనిల్ కుమార్ బావిసెట్టి, గ్రీన్ హౌస్ ఎన్విరో సీఈఓ , డైరెక్టర్ మొలుగు శ్రీపాల్ రెడ్డి, స్లోవాక్ రిపబ్లిక్ కాన్సుల్ మాటుస్ జెమెస్ పాల్గొన్నారు.

కుక్కలు ఓకే.. భర్తలను భార్యలు చంపుతున్నారుగా.. వారికి వీహెచ్ కీలక సూచనలు..

రేణు దేశాయ్.. అమల లాంటి వాళ్ళు కుక్కలను చంపొద్దు అని అంటున్నారని.. మూగ జీవుల గురించి బాగానే మాట్లాడుతున్నారు.. భర్తలను చంపుతున్న భార్యల సంఖ్య పెరుగుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు అన్నారు. ఒకప్పుడు భర్త కోసం సతిసావిత్రి యముడితో పోరాడింది.. నేడు భర్తలను భార్య.. భార్యలను భర్తలు చంపుకునేది పెరిగిందన్నారు. ఇలా చేస్తుకుంటూపోతే పిల్లల సంగతి ఏంటి..? అని ప్రశ్నించారు. తాజాగా బుధవారం మీడియాతో మాట్లాడిన వీహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అంశాలపై విద్యావంతులు.. మేధావులు ఆలోచించాలని సూచించారు. ఈ తరహా హత్యలను ఆపేందుకు ప్రయత్నం చేయాలన్నారు. మహిళా సంఘాలు కూడా సమావేశాలు పెట్టి ఆలోచించాలని సూచించారు.

ఆ రోజే బీఆర్ఎస్, కాంగ్రెస్ మంత్రుల అవినీతిపై ర్యాంకులు ప్రకటిస్తాం..

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి ఉన్న వారికి జాగృతి మద్దతు ఇస్తుందని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. తాజాగా మీడియాతో చీట్‌చాట్‌లో ఆమె మాట్లాడుతూ.. వారికి కామన్ సింబల్ కోసం కొన్ని జాతీయ పార్టీలతో మాట్లాడుతున్నామని తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఉద్యోగులు, యువతకు నష్టం జరిగిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఐదు శాతం ఓపెన్ కోటాను నాన్ లోకల్ గా మార్చడంతో రాష్ట్ర యువతకు నష్టం జరుగుతోందన్నారు. జాగృతి తరఫున అధ్యయనం చేస్తున్నాం, జిల్లాల పునర్విభజన కమిషన్ ఏర్పాటు చేస్తే నివేదిక ఇస్తామన్నారు. కొత్త పార్టీ ఏర్పాటు కసరత్తు వేగంగా జరుగుతోందని.. జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి ప్రక్రియ పూర్తవుతుందో లేదో చూడాలన్నారు. ఎన్నికల కమిషన్ వద్ద కూడా అడ్డంకులు సృష్టించే అవకాశం లేకపోలేదని అభిప్రాయపడ్డారు. పార్టీకి ఇంకా ఏ పేరు అనుకోలేదు, తెలంగాణ రాష్ట్ర జాగృతి సమితి అని కొందరు సూచించారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ అంశానికి కూడా న్యాయం చేస్తారన్న నమ్మకం తనకు లేదని.. నైనీ బొగ్గు గని అంశం కంటే సింగరేణికి కొత్త బొగ్గు గనులు వచ్చేలా చూడాలన్నారు.

‘బోర్డ్ ఆఫ్ పీస్‌‌’పై మనసు మార్చుకున్న నెతన్యాహు.. ట్రంప్ ప్రతిపాదనకు…!

గాజాలో పాలన కోసం ట్రంప్ శాంతి మండలిని ఏర్పాటు చేస్తున్నాన్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఈ శాంతి మండలిలో భారత్‌తో పాటు అనేక దేశాలను ట్రంప్ ఆహ్వానించారు. అయితే ఈ శాంతి మండలిని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తొలుత వ్యతిరేకించారు. తాజాగా మనసు మార్చుకున్నారు. గాజా పునర్నిర్మాణం కోసం.. అలాగే విస్తృత సంఘర్షణ పరిష్కారం లక్ష్యంగా జనవరి 15, 2026న అమెరికా నేతృత్వంలోని బృందం ఏర్పాటు చేసే ‘బోర్డ్ ఆఫ్ పీస్’లో చేయాలని అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఆహ్వానాన్ని నెతన్యాహు అంగీకరించినట్లుగా బుధవారం ఇజ్రాయెల్ పీఎంవో తెలిపింది. ప్రపంచ నాయకులతో కూడిన శాంతి మండలిలో సభ్యుడిగా చేరడానికి ఇజ్రాయెల్‌కు అభ్యంతరం లేదని పేర్కొంది. ట్రంప్ ఆహ్వానాన్ని ఇజ్రాయెల్ అంగీకరిస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.

ప్రయాగ్‌రాజ్‌లో కూలిన ఎయిర్‌ఫోర్స్ విమానం.. పైలట్లు క్షేమం

ఉత్తరప్రదేశ్‌లో విమాన ప్రమాదం జరిగింది. భారత వైమానిక దళానికి చెందిన శిక్షణ విమానం ప్రయాగ్‌రాజ్‌లో కూలిపోయింది. బమ్రౌలికి చెందిన విమానం బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రయాగ్‌రాజ్‌లోని రాంబాగ్ ప్రాంతంలోని చెరువులో కూలిపోయింది. ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. విమాన ప్రయాణ సమయంలో ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతోనే విమానం కూలిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే అత్యవసర పారాచూట్ ఉపయోగించడంతో పైలట్లు క్షేమంగా బయటపడ్డారు. విమానం కూలిపోవడాన్ని ప్రత్యక్ష సాక్షులు చూశారు. విమానాన్ని బమ్రౌలి ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గ్రూప్ కెప్టెన్ ప్రవీణ్ అగర్వాల్, సునీల్ కుమార్ పాండే నడిపారు. ఇద్దరు అధికారుల పరిస్థితి నిలకడగా ఉందని డిఫెన్స్ ప్రో వింగ్ కమాండర్ దేబర్తో ధార్ అధికారికంగా ప్రకటించారు.

వచ్చే ఏడాది పాదయాత్ర ప్రారంభం.. వైఎస్‌ జగన్‌ ప్రకటన..

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ అంటే.. వెంటనే పాదయాత్ర గుర్తుకు వస్తుంది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తన తండ్రి, దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్ర చేసి అధికారంలోకి రాగా.. ఆ తర్వాత వైఎస్‌ జగన్‌ కూడా సుదీర్ఘ పాదయాత్ర చేసి.. అన్ని వర్గాలను కలుస్తూ.. సమావేశాలు, సభలు నిర్వహిస్తూ.. వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత ఏపీలో అధికారాన్ని చేపట్టారు.. అయితే, కూటమి అధికారంలోకి రావడంతో.. ప్రతిపక్షానికే పరిమితమైన వైఎస్‌ జగన్‌.. మరోసారి.. పాదయాత్రకు సిద్ధమవుతున్నారు.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు.. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమైన వైసీపీ అధినేత.. వచ్చే ఏడాది పాదయాత్ర ప్రారంభిస్తాను అని వెల్లడించారు.. ఇక, ప్రతీ వారం ఒక నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశం ఉంటుందని తెలిపారు వైఎస్‌ జగన్‌..


బీజేపీకి బిగ్ షాక్.. మేయర్‌ పదవి కోసం ఒక్కటైన షిండే శివసేన, రాజ్‌ఠాక్రే..

మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమి సత్తా చాటింది. దేశంలో అత్యంత ధనిక మున్సిపల్ కార్పొరేషన్ అయిన ముంబై మేయర్ పీఠాన్ని బీజేపీ, శివసేనలు కలిసి దక్కించుకునే అవకాశం ఏర్పడింది. అయితే, ముంబైతో పాటు పలు కార్పొరేషన్‌లలో బీజేపీ, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మధ్య మేయర్ పదవి కోసం ప్రతిష్టంభన ఏర్పడింది. ఇప్పటికే, ముంబై మేయర్ పదవి కోసం షిండే సేన బీజేపీపై ఒత్తిడి తీసుకువస్తోంది.

ఎల్లో మిర్చికి రికార్డు స్థాయిలో ధర

వరంగల్ జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పసుపు రంగు మిర్చి (Yellow Chilli) సరికొత్త రికార్డును సృష్టించింది. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ మార్కెట్ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా, పసుపు మిర్చి ధర క్వింటాల్‌కు ఏకంగా ₹44,000 పలికిందని అధికారులు వెల్లడించారు. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే ఈ ధర భారీగా పెరగడం గమనార్హం. నిన్నటి వరకు క్వింటాల్ ధర ₹42,500 ఉండగా, నేడు అది మరో ₹1,500 పెరిగి ₹44,000 కు చేరుకుంది. ఈ అసాధారణ ధర పెరుగుదల వెనుక ప్రధానంగా వాతావరణ మార్పులు , దిగుబడి తగ్గుదల వంటి కారణాలు ఉన్నాయి. ఈ ఏడాది కురిసిన అకాల వర్షాల కారణంగా మిర్చి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి, దీనివల్ల పంట దిగుబడి ఆశించిన స్థాయిలో రాకపోవడంతో మార్కెట్‌లో డిమాండ్ విపరీతంగా పెరిగింది. గతేడాది పసుపు మిర్చి ధర క్వింటాల్‌కు కేవలం ₹16,000 నుండి ₹17,000 మధ్య మాత్రమే పలకగా, ఈసారి అది రెండు రెట్లకు పైగా పెరగడం విశేషం. వరంగల్ జిల్లా నుంచే కాకుండా కరీంనగర్, ఖమ్మం, కృష్ణా , నల్గొండ వంటి ఇతర జిల్లాల నుండి కూడా రైతులు తమ పంటను ఈ మార్కెట్‌కు తీసుకువచ్చి విక్రయిస్తుంటారు.

అయోధ్య రాముడి కోసం బంగారు ధనుస్సు సిద్ధం

అయోధ్యలో కొలువై ఉన్న బాలరాముడికి ఒడిస్సా భక్తులు అత్యంత అరుదైన, అద్భుతమైన కానుకను సిద్ధం చేశారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, 286 కిలోల బరువున్న భారీ ‘స్వర్ణ ధనుస్సు’ను అయోధ్యకు పంపించనున్నారు. ఒడిస్సాలోని రూర్కెలాలో ఈ అద్భుత కళాఖండం రూపుదిద్దుకుంది. దాదాపు 286 కిలోల బరువు ఉన్న ఈ ధనుస్సును తయారు చేయడానికి అత్యంత ఖరీదైన లోహాలను ఉపయోగించారు. ఇందులో ఒక కిలో బంగారం, రెండున్నర కిలోల వెండితో పాటు రాగి, జింక్, , ఇనుము వంటి లోహాల మిశ్రమాన్ని వాడారు. ఈ ధనుస్సు తయారీకి సుమారు కోటి 10 లక్షల రూపాయలు ఖర్చు అయినట్లు సమాచారం.

 

 

Exit mobile version