పాత పన్ను విధానం తొలగింపు..? వేతన జీవులకు గుడ్‌న్యూస్..!
బడ్జెట్ 2026-27 ఎలా ఉండబోతోంది? అనేదానిపై రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి.. కేంద్ర ఆర్తిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై పూర్తిస్థాయిలో దృష్టిసారించారు.. అయితే, బడ్జెట్ 2026పై దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా జీతం పొందే వర్గం దృష్టి మొత్తం ఆదాయపు పన్ను విధానంలో వచ్చే మార్పులపైనే ఉంది. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండగా, ఇందులో పాత పన్ను విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కొత్త పన్ను విధానం ప్రకారం ప్రామాణిక మినహాయింపుతో కలిపి ₹12.75 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు అందుబాటులో ఉంది. ఇప్పటికే దాదాపు 95 శాతం మంది పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్న నేపథ్యంలో, పాత పన్ను విధానానికి భవిష్యత్తు ఏమిటనే చర్చ మొదలైంది.
టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకుంటే.. ఆ స్థానాన్ని ఏ జట్టు భర్తీ చేస్తుంది?
ఇండియా, శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ICC పురుషుల T20 వరల్డ్ కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో 20 జట్లు పాల్గొంటున్నాయి. బంగ్లాదేశ్ గత టోర్నమెంట్ (2024)లో టాప్-7లో ఉండటం వల్ల డైరెక్ట్‌గా క్వాలిఫై అయింది. అయితే, ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) భద్రతా ఆందోళనల కారణంగా భారత్‌లో జరిగే తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ICCని అభ్యర్థించింది. ఈ నేపథ్యంలో ICC బంగ్లాదేశ్‌కు జనవరి 21 వరకు గడువు ఇచ్చింది. ఈ గడువులోపు బంగ్లాదేశ్ భారత్‌లో ఆడటానికి అంగీకరించకపోతే, వారిని టోర్నమెంట్ నుంచి తొలగిస్తారు. అలా జరిగితే ICC ప్రస్తుత T20I ర్యాంకింగ్స్ ఆధారంగా రీప్లేస్‌మెంట్ జట్టును ఎంపిక చేస్తుంది.
రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా చిరంజీవి -ఓదెల సినిమా!
శ్రీకాంత్ ఓదెల తన మొదటి సినిమా ‘దసరా’ తోనే తనదైన ముద్ర వేసుకున్న సంగతి తెలిసిందే. నాని హీరోగా రూపొందిన ఈ సినిమాతో సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీకాంత్ ఓదెల, ఒక్కసారిగా రా అండ్ రస్టిక్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల నానితోనే ‘ది పారడైజ్’ అనే సినిమా అనౌన్స్ చేశాడు. ఒక్కసారిగా ఆ గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. అయితే, ఆ సినిమా అనౌన్స్మెంట్ తర్వాత ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. అసలు ఆ సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.
అనిరుధ్ ఆలస్యం వెనుక అసలు రహస్యం ఇదే.. నిర్మాత క్రేజీ కామెంట్స్!
సంగీత దర్శకుడు అనిరుధ్ గురించి నిర్మాత సుధాకర్ చెరుకూరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి సుధాకర్ చెరుకూరి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి డీసెంట్ బజ్ ఉంది. దాదాపుగా అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ దిశగా కలెక్షన్స్ వచ్చాయి. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆయన, పారడైజ్ సినిమాకి సంగీతం అందిస్తున్న అనిరుధ్ గురించి మాట్లాడారు. అనిరుధ్ ఆలస్యంగా ట్యూన్స్ ఇవ్వడం కరెక్టే కానీ, ఆ ఆలస్యానికి తగ్గట్టు అద్భుతమైన ట్యూన్స్ ఇస్తాడని చెప్పుకొచ్చారు. తమకు ఒక సాంగ్ ఇవ్వడానికి చాలా రోజుల సమయం తీసుకున్నాడని, కానీ ఆ సాంగ్ అవుట్ ఫుట్ వచ్చాక మాత్రం అదిరిపోయిందని అన్నారు.
ఐటెం సాంగ్స్ తో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసిన మిల్కీ బ్యూటీ..!
గ్లామర్ డాల్ తమన్నా భాటియా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు కావస్తున్నా, ఆమె క్రేజ్ మాత్రం అంగుళం కూడా తగ్గలేదు. ఒకవైపు స్టార్ హీరోయిన్‌గా రాణిస్తూనే, మరోవైపు స్పెషల్ సాంగ్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. అయితే తాజాగా తమన్నా ఐటెం సాంగ్స్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని ఒక అరుదైన మైలురాయిని చేరుకుంది. ఆమె నటించిన సూపర్ హిట్ సాంగ్ ఏకంగా 1 బిలియన్ (100 కోట్లు) వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తోంది. గతేడాది బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘స్త్రీ 2’లో తమన్నా ఆడిపాడిన ‘ఆజ్ కీ రాత్’ సాంగ్ యూట్యూబ్‌లో 100 కోట్ల వీక్షణలను అందుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక ఐటెం సాంగ్‌కు ఈ స్థాయి వ్యూస్ రావడం భారతీయ సినీ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం. దీనిపై తమన్నా స్పందిస్తూ.. ‘మీరు చూపిస్తున్న ఈ అపారమైన ప్రేమకు ధన్యవాదాలు’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. పాలరాతి శిల్పం లాంటి అందం, అదిరిపోయే డ్యాన్స్ మూమెంట్స్ తో తమన్నా ఈ పాటలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.
కాలభైరవుడిని చంపేస్తారా? శునకాల సంహారంపై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు
గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది, కొన్నిచోట్ల కుక్కలను చంపేస్తున్న ఘటనలు తెర మీదకు వస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వం సహా మున్సిపల్ యంత్రాంగం అనుసరిస్తున్న తీరుపై సినీ నటి, జంతు ప్రేమికురాలు రేణు దేశాయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిస్సహాయ స్థితిలో ఉన్న మూగజీవులను దారుణంగా హతమార్చడం అమానుషమని ఆమె ధ్వజమెత్తారు. “ప్రతి వంద కుక్కలలో కేవలం ఐదు మాత్రమే దూకుడు స్వభావాన్ని కలిగి ఉండవచ్చు, ఆ ఐదు కుక్కల కారణంగా మిగిలిన 95 శాతం సాధు స్వభావం కలిగిన కుక్కలను చంపడం ఎంతవరకు న్యాయం?” అని ఆమె ప్రశ్నించారు. ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవికి జీవించే హక్కు ఉందని, మనుషుల స్వార్థం కోసం వాటిని తుదముట్టించడం క్రూరత్వమే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
టీడీపీ ఎంపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఆసక్తికరంగా బండ్ల పాదయాత్ర
టాలీవుడ్ నిర్మాత, ‘ఫైర్ బ్రాండ్’గా పేరు తెచ్చుకున్న బండ్ల గణేష్.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కోసం అంటూ ‘సంకల్ప యాత్ర’ పేరుతో ఒక పాదయాత్ర చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన సమయంలో ఎంతకూ బెయిల్ రాకపోవడంతో, ఆయనకు బెయిల్ లభిస్తే కనుక.. తాను తన గడప నుంచి మీ గడప వరకు పాదయాత్ర చేస్తానంటూ తిరుమల శ్రీవారికి మొక్కుకున్నారట. ఇప్పుడు ఆ మొక్కు తీర్చేందుకు ఆయన తన సొంత ఊరైన షాద్‌నగర్‌లోని వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి బయలుదేరి పాదయాత్రగా తిరుమలకు వెళుతున్నారు. అయితే, మొదటి నుంచి తనకు తాను ఒక కాంగ్రెస్ వాదిగా చెప్పుకుంటూ వచ్చిన బండ్ల గణేష్, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అధినేత కోసం పాదయాత్ర చేయడం ఒక కొసమెరుపు. ఈ పాదయాత్రకు వచ్చిన అతిథులు మరో ఆసక్తికర అంశం. సినీ పరిశ్రమ నుంచి నటుడు శివాజీ ముఖ్యఅతిథిగా హాజరవగా, తెలుగుదేశం పార్టీ నుంచి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, అలాగే కాంగ్రెస్ లోకల్ ఎమ్మెల్యే శంకర్ కూడా హాజరయ్యారు. ఇది మొత్తానికి ఒక ఆసక్తికరమైన పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే, ఒకప్పుడు నీరు-నిప్పులా ఉన్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధుల సమక్షంలో బండ్ల గణేష్ పాదయాత్ర ప్రారంభమవ్వడం విశేషం. ఇక ఈ పాదయాత్ర సుమారు రోజుకు 20 నుంచి 25 కిలోమీటర్ల మేర సాగబోతున్నట్లు బండ్ల గణేష్ పేర్కొన్నారు.
బీజాపూర్ లో ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలోని ఉత్తర–పశ్చిమ ప్రాంతంలో భద్రతా బలగాలకు మరో భారీ విజయం లభించింది. భోపాలపట్నం–ఫర్సేగఢ్ సరిహద్దుల్లోని అటవీ, కొండ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో నేషనల్ పార్క్ ఏరియా కమిటీ ఇంచార్జ్ డీవీసీఎం దిలీప్ బెండ్జా సహా మొత్తం ఆరు మంది మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో నలుగురు మహిళా మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మావోయిస్టుల కదలికలపై అందిన పక్కా సమాచారంతో డీఆర్‌జీ బీజాపూర్, డీఆర్‌జీ దంతేవాడ, ఎస్‌టీఎఫ్, కోబ్రా బలగాలు (202, 206, 210 బెటాలియన్లు), సీఆర్‌పీఎఫ్ 214 బెటాలియన్‌కు చెందిన సంయుక్త బృందాలు జనవరి 17న ప్రత్యేక సర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ సందర్భంగా భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జనవరి 17 ఉదయం నుంచి 18 సాయంత్రం వరకు మధ్య మధ్యలో తీవ్ర కాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్ అనంతరం ఘటనాస్థలంలో నిర్వహించిన గాలింపుల్లో డీవీసీఎం దిలీప్ బెండ్జా (రూ.8 లక్షల రివార్డు)తో పాటు ఏసీఎం మాడ్వీ కోసా, ఏసీఎం పాలొ పొడియం, ఏసీఎం లక్కీ మడ్కం, పీఎం జుగ్లో బంజామ్, పీఎం రాధా మేట్టా మృతదేహాలను గుర్తించారు. మృత మావోయిస్టులపై మొత్తం రూ.27 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
జడ్జిని కుక్క ఏదో చేసి ఉంటుంది… రేణు దేశాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు
జంతు ప్రేమికురాలిగా, సామాజిక అంశాలపై స్పందించే వ్యక్తిగా గుర్తింపు పొందిన సినీ నటి రేణు దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచారు, ఈసారి ఆమె ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునే సవాల్ చేస్తూ, వీధి కుక్కల హత్యలపై తన ఆగ్రహాన్ని కట్టలు తెంచుకున్న ఆవేదనతో వ్యక్తం చేశారు. కుక్కలను వ్యతిరేకిస్తూ వాటిని చంపాలని చూస్తున్న వారికి ‘పిచ్చి పట్టింది’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి, వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై రేణు దేశాయ్ అత్యంత కటువుగా స్పందించారు. “మొత్తం న్యాయం అనేది ఒక జోక్ అయిపోయింది, దానికి నేనే సాక్ష్యం” అంటూ ఆమె తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ తీర్పు ఇచ్చిన జడ్జికి కుక్కల మీద ఏదైనా వ్యక్తిగత ద్వేషం ఉండి ఉండవచ్చని, ఇది మానవత్వంతో ఇచ్చిన తీర్పు కాదని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.
మేడారంలో ఆదివాసీల జీవన విధానం ఉట్టిపడేలా శిలాఫలకాలు
మేడారంలో సమ్మక్క-సారలమ్మ ఆలయ పునర్నిర్మాణం , అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో కనిపించే ఫ్రేమ్డ్ ప్లేట్లు లేదా ప్లాస్టిక్ బోర్డులలా కాకుండా, ఇక్కడ ఆదివాసీల జీవన విధానం , వారి సంస్కృతి ఉట్టిపడేలా అత్యంత ప్రత్యేకంగా వీటిని రూపొందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ శిలాఫలకాలను ప్రారంభించారు. ప్రకృతితో మమేకమై జీవించే ఆదివాసీల శైలిని ప్రతిబింబించేలా, రాయిని సహజంగా ఉంచి దానిపైనే వివరాలను చెక్కడం ఈ శిలాఫలకాల ప్రధాన ప్రత్యేకత. ఈ శిలాఫలకాల చుట్టూ గిరిజన మహిళల రూపరేఖలు కలిగిన శిల్పాలను, అలాగే వారి సంప్రదాయంలో కీలకమైన డప్పు వాయిద్య కళాకారుల ప్రతిమలను ఏర్పాటు చేశారు. ఆదివాసీల జీవన విధానంలో కొమ్ముబూరలు, డప్పు వాయిద్యాలు , గిరిజన నృత్యాలకు ఉన్న ప్రాముఖ్యతను ఈ శిల్పాలు చాటిచెబుతున్నాయి. కేవలం పనుల వివరాలకే పరిమితం కాకుండా, గుడి చరిత్రను , గిరిజన సంస్కృతిని భవిష్యత్తు తరాలకు అందించేలా వీటిని తీర్చిదిద్దారు. అటవీ శాఖ అధికారులు, ఐఏఎస్ అధికారులు , దేవాదాయ శాఖకు సంబంధించిన ముఖ్య కార్యదర్శుల నుండి కింది స్థాయి అధికారుల వరకు, ఈ అభివృద్ధి పనుల్లో భాగస్వాములైన అందరి పేర్లు చిరకాలం నిలిచిపోయేలా గ్రానైట్ రాళ్లపై చెక్కించారు. మేడారానికి వచ్చే భక్తులకు గిరిజన సంస్కృతిని పరిచయం చేస్తూ, ఈ శిలాఫలకాలు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
