Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

కుంభ, మందాకిని అదుర్స్.. ఇక నెక్స్ట్ రుద్ర, సోషల్ మీడియా షేకే!

‘సూపర్ స్టార్’ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ‘ఎస్ఎస్ఎంబీ 29’ నుంచి వరుస అప్డేడ్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. ఆయన ‘కుంభ’ అనే పాత్రలో విలన్‌గా నటిస్తున్నట్టుగా తెలిపారు. అయితే వీల్ చైర్‌లో ఉన్న కుంభ లుక్‌పై కాస్త ట్రోలింగ్ జరిగింది కానీ.. సైంటిఫిక్‌గా రాజమౌళి ఏదో చేస్తున్నారనే విషయం మాత్రం క్లియర్ కట్‌గా తెలుస్తోంది. కుంభ లుక్ చూశాక సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

వెలుగులోకి సంచలన ఫొటోలు.. దొరికిన ఉమర్ మూడో కారు.. ఎక్కడుందంటే..!

ఢిల్లీ పేలుడు వెనుక ఉన్న కుట్ర వీడుతోంది. దర్యాప్తు సంస్థలు చాలా సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నాయి. తాజాగా ఉగ్రవాది డాక్టర్ ఉమర్ కొనుగోలు చేసిన మూడు కార్ల దృశ్యాలు అల్-ఫలాహ్ యూనివర్సిటీ సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. దేశ వ్యాప్త దాడుల్లో భాగంగా ఉమర్ మూడు కార్లు కొనుగోలు చేశాడు. హ్యుందాయ్ ఐ20, ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మారుతి బ్రెజ్జాలను కొనుగోలు చేశాడు. ఈ మూడు కారుల్లో ఒకటి సోమవారం సాయంత్రం ఎర్రకోట దగ్గర హ్యుందాయ్ i20 కారు పేలిపోయింది. ఇక రెండో ఎరుపు రంగు కారును బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ రిజిస్ట్రేషన్ నంబర్‌ 0458 కలిగిన ఎకోస్పోర్ట్‌ను హర్యానాలోని ఖండవాలి గ్రామంలో ట్రాక్ చేశారు. తాజాగా మూడో కారును అల్-ఫలాహ్ యూనివర్సిటీ లోపల పార్కింగ్ చేసి ఉన్నట్లుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. దీంతో ఉమర్ కొనుగోలు చేసిన మూడు కార్లు గుర్తింపబడ్డాయి.

ఒక దుకాణంపై పడ్డ శరీర భాగాలు.. స్వాధీనం చేసుకున్న అధికారులు

ఢిల్లీ బ్లాస్ట్‌పై దర్యాప్తు సంస్థలు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి. తాజాగా పేలుడు జరిగిన 300 మీటర్ల దూరంలోని ఒక షాపుపై ఒక వ్యక్తి శరీర భాగాలు స్వాధీనం చేసుకున్నారు. లజ్‌పత్‌రాయ్ మార్కెట్‌లోని ఒక దుకాణంపై తెగిపోయిన చేయిను రికవరీ చేసుకున్నారు. ప్రస్తుతం శరీర భాగాన్ని ఫోరెన్సిక్ పరీక్ష కోసం అధికారుల పంపించారు. ఇక ఢిల్లీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరింది. గురువారం తెల్లవారుజామున ఎల్‌ఎన్‌ జేపీ ఆస్పత్రిలో గాయపడిన వ్యక్తి చనిపోయాడు. దీంతో మృతుల సంఖ్య 13కు చేరింది. ఇంకా పలువురు ఆస్పత్రిలోనే కోలుకుంటున్నారు. ఇక బాధితులను బుధవారం ప్రధాని మోడీ పరామర్శించారు.

జగన్ నన్ను ఎప్పుడూ కష్టపెట్టలేదు.. చంద్రబాబు ఇంకా నా బ్లెస్సింగ్స్ తీసుకోలేదు..

పీపీపీ మోడల్‌ను వ్యతిరేకిస్తూ ఒక పిల్ వేశానని.. హైకోర్టు ఒపీనియన్ తీసుకుని రావాలని సుప్రీంకోర్టు చెప్పిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. నిన్న హైకోర్టులో ఛీఫ్ జస్టిస్ విచారణ జరిపారని తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. PPP బదులుగా PPB (బిలియనీర్ల ప్రోగ్రామ్) అనాలన్నారు. మెడికల్ కాలేజీలను కొనేది నారాయణ కావచ్చు, ఎవరైనా కావచ్చు వదిలిపెట్టనని హెచ్చరించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటైజ్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నా.. కర్ణాటక రాష్ట్రంలో ఇదే పీపీపీ విధానంతో నష్టపోయారు.. వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని పాల్ తెలిపారు. గ్లోబల్ హాస్పిటల్ లో ఒక 29 ఏళ్ళ మహిళ మరణించిందని.. బస్సు యాక్సిడెంట్ జరిగితే యజమానులను అరెస్టు చేయరని ప్రశ్నించారు. పాలించడం రాకపోతే రాజీనామా చేయండి.. నాకు తెలుసు ఎలా పాలించాలో అన్నారు.

భారత్, ఆఫ్ఘాన్‌లతో యుద్ధానికి సిద్ధం.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు..

పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్‌లో చావు తప్పించుకున్నప్పటికీ, ఆ దేశానికి సిగ్గు రావడం లేదు. తాజాగా, ఆయన మాట్లాడుతూ.. తూర్పు సరిహద్దులో భారత్‌తో, పశ్చిమ సరిహద్దులో ఆఫ్ఘానిస్తాన్‌తో టూ-ఫ్రంట్ వార్‌కు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని చెప్పారు. పాకిస్తాన్ రెండు దేశాలతో యుద్ధానికి ‘‘పూర్తిగా సిద్ధంగా ఉంది’’ అని అన్నారు. ఢిల్లీ ఉగ్రవాద దాడి సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

32 కార్లతో “బాబ్రీ మసీదు” కూల్చివేతకు ప్రతీకార కుట్ర..

ఢిల్లీ ఎర్రకోట వద్ద కారు బాంబ్ బ్లాస్ట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తు్న్నాయి. ఇప్పటికే ఈ ఘటన ఉగ్రవాద దాడిగా కేంద్రం ప్రకటించింది. నిందితులందరికి జైషే మహ్మద్‌తో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. డాక్టర్లుగా ఉంటూ ఉగ్రవాదులుగా మారిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కారు బాంబుతో ఆత్మాహుతి చేసుకున్న వ్యక్తిని కాశ్మీర్‌కు చెందిన ఉమర్ నబీగా గుర్తించారు. నిందితుందరికి ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీతో సంబంధాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఈ కేసులో పెద్ద కుట్ర ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. డిసెంబర్ 6, బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన రోజున ప్రతీకారం తీర్చుకునేందుకు దాడులకు పాల్పడాలని ఉగ్రవాదులు భావించారు. దీని కోసం 32 కార్లను కూడా సిద్ధం చేసుకున్నారు. ఆరు దశల్లో ఒకేసారి బాంబు బ్లాస్ట్ చేయాలని ప్లాన్ చేశారు. ఢిల్లీలోని ఆరు వేర్వేరు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు నాలుగు కార్లను గుర్తించారు. ఇవన్నీ పాత కార్లుగా తేలాయి. దాడులకు పాత కార్లను ఉగ్రవాదులు కొనుగోలు చేశారు. బ్రెజ్జా, స్విఫ్ట్, ఎకోస్పోర్ట్ కార్లను పోలీసులు గుర్తించారు. సోమవారం దాడి సమయంలో హ్యుందాయ్ ఐ20కారును ఉపయోగించారు. పోలీసులకు ట్రేస్ చేసినా దొరకుండా ఎక్కువ సార్లు చేతులు మారిన కార్లను ఉగ్ర డాక్టర్లు కొనుగోలు చేసినట్లు తెలిసింది.

చేసిన ఆరోపణలు నిరూపించండి.. డిప్యూటీ సీఎంపై ఎంపీ ఫైర్..!

శేషాచల అటవీ ప్రాంతంలో భూకబ్జాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన బహిరంగ ఆరోపణలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. జనసేన పార్టీ ‘బిగ్ ఎక్స్‌పోజ్‌’గా ప్రచారం చేసిన ఈ విషయం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. పవన్ కళ్యాణ్ ఇటీవల తిరుపతి పర్యటన సందర్భంగా.. మంగళంపేట అటవీ ప్రాంతంలోని అక్రమ ఆక్రమణలపై స్వయంగా పరిశీలన చేశారు. ఆయన ఏరియల్ వ్యూ వీడియోలు, మ్యాపింగ్‌లు, ఉపగ్రహ చిత్రాలతో కూడిన ఆధారాలను విడుదల చేశారు. ఈస్ట్‌ ఘాట్స్‌ పరిధిలోని రక్షిత అటవీ భూముల్లో సుమారు 76.74 ఎకరాల భూకబ్జా జరిగినట్లు అందులో పేర్కొన్నారు. ఈ భూములు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి సంబంధించినవని పవన్ కళ్యాణ్ తన ‘ఎక్స్’ ఖాతా పోస్టులో తెలిపారు. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సమర్పించారు. రక్షిత అటవీ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరగడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ దానిపై దర్యాప్తు అవసరమని సూచించారు.

భార్యను కిరాతకంగా నరికి చంపిన భర్త.. రోడ్డుపై కత్తితో వీరంగం సృష్టించిన భర్త..!

విజయవాడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యను కత్తితో నరికి హత్య చేసిన భర్త స్థానికులను భయాందోళనలకు గురి చేశాడు. ఈ సంఘటన గురువారం ఉదయం సూర్యారావు పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. హత్యకు గురైన మహిళ సరస్వతీగా గుర్తించారు. ఆమె భర్త విజయ్ తో గత కొంతకాలంగా దాంపత్య జీవితం సజావుగా సాగడం లేదు. తరచూ చిన్నచిన్న విషయాలపై ఇద్దరి మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయని, ఇటీవల వీరిద్దరూ విడివిడిగా నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం విజయ్ కోపంతో భార్య ఉన్న చోటుకు వెళ్లి, కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటనలో సరస్వతీ అక్కడికక్కడే మృతిచెందింది. హత్య అనంతరం కూడా విజయ్ కత్తితో వీరంగం సృష్టించాడని, స్థానికులు భయంతో దగ్గరికి రాలేకపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. “ఎవరైనా దగ్గరికి వస్తే చంపేస్తా” అంటూ విజయ్ కేకలు వేయడంతో ప్రాంతం మొత్తం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తరువాత సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న సూర్యారావు పేట పోలీసులు నిందితుడు విజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య కొనసాగుతున్న వ్యక్తిగత విభేదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ప్ర‌పంచ పెట్టుబ‌డిదారుల‌కు ఉత్త‌మ గమ్య‌స్థానం హైద‌రాబాద్‌

అంత‌ర్జాతీయ స్థాయి మౌలిక వ‌స‌తులు, ప‌రిశ్ర‌మ‌ల‌కు అనువైన వాతావ‌ర‌ణం, భ‌ద్ర‌తకు ఎటువంటి ఢోకా లేకుండా భౌగోళికంగా కేంద్ర స్థానంలో ఉన్న హైద‌రాబాద్ ప్ర‌పంచవ్యాప్త పెట్టుబ‌డిదారుల‌కు ఉత్త‌మ గమ్యస్థాన‌మ‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలోనే పెద్ద సంఖ్య‌లో యువ‌త‌, వేగవంత‌మైన వృద్ధి రేటుతో ఉన్న రాష్ట్రం తెలంగాణ అని ముఖ్య‌మంత్రి అన్నారు. ఢిల్లిలో గురువారం జ‌రిగిన అమెరికా సంయుక్త రాష్ట్రాలు-భార‌త‌దేశం వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్య స‌ద‌స్సులో (USISPF) ముఖ్య‌మంత్రి ప్ర‌సంగించారు. తెలంగాణ‌లో గ‌త 35 ఏళ్లుగా కాంగ్రెస్‌తో పాటు అనేక పార్టీలు ప్ర‌భుత్వాలకు సార‌థ్యం వ‌హించినా పెట్టుబ‌డుల‌కు, పెట్టుబ‌డిదారుల‌కు అంద‌రూ మ‌ద్ద‌తుగా నిలిచార‌ని ముఖ్య‌మంత్రి వివ‌రించారు. భార‌త‌దేశంలో పెట్టుబ‌డుల‌కు హైద‌రాబాద్ ముఖ ద్వార‌మ‌ని సీఎం తెలిపారు. జీసీసీల‌కు గ్య‌మ‌స్థానంగా ఉన్న హైద‌రాబాద్‌లో పెట్టుబ‌డుల‌కు ముందుకు రావాల‌ని సీఎం పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.

హైదరాబాద్ లో నకిలీ నోట్ల కలకలం..

మెహదీపట్నం పోలీసులు, కమిషనర్ టాస్క్ ఫోర్స్ సౌత్‌ వెస్ట్‌ జోన్‌ బృందం సంయుక్తంగా భారీ ఆపరేషన్‌ నిర్వహించి నకిలీ కరెన్సీ తయారీ గ్యాంగ్‌ను పట్టుకున్నారు. ఈద్గా గ్రౌండ్స్‌, ఫస్ట్‌ లాన్సర్‌ వద్ద దాడి చేసి మొత్తం 8 మంది నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ₹4.75 లక్షల నకిలీ ₹500 నోట్లను, నాలుగు ద్విచక్ర వాహనాలు, ఒక కారు, తొమ్మిది మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు కస్తూరి రమేష్ బాబు తాండూర్‌లో తన సోదరితో కలిసి స్కానర్‌, ల్యాప్‌టాప్‌, ఫోటోషాప్‌ సాఫ్ట్‌వేర్‌ సహాయంతో నకిలీ నోట్లను తయారు చేస్తున్నట్లు విచారణలో తేలింది.

 

Exit mobile version