NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

రీసర్వేలో గ్రామకంఠంగా పట్టా భూమి.. మంత్రి లోకేష్‌కి ఫిర్యాదు

కూటమి ప్రభుత్వం ఏర్పడినాటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్‌ కొనసాగిస్తున్నారు.. తాను ప్రతినిథ్యం వహిస్తోన్న మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బాధితుల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు.. ఇక, 38వ రోజు “ప్రజాదర్బార్” కు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచే బారులు తీరారు. ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేష్ ను స్వయంగా కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాలు అందించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి.. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయా సమస్యల పరిష్కారంపై అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

తులసీ నగర్‌లో మూసీ బాధితులతో మాట్లాడిన కేటీఆర్

అంబర్ పేట్ నియోజకవర్గం గోల్నాకలోని తులసీ నగర్‌లో మూసీ బాధితులతో బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్‌లో దసరా, బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రజలకు ఆనందం లేకుండా రేవంత్ రెడ్డి చేస్తున్నాడని ఆయన విమర్శించారు. ఎప్పుడు వచ్చి ఇళ్లు కూల్చివేస్తారోనని పేద ప్రజలు భయంతో ఆందోళనలో ఉన్నారన్నారు. హైదరాబాద్‌లో ప్రజలు ఓట్లు వేయలేదని పగబట్టి పేదోళ్ల ఇళ్లను కూల్చివేస్తున్నాడన్నారని విమర్శించారు. ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండో గుర్తు చేసుకోవాలన్నారు. ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అని చెప్పారని, ఎవరికైనా వాళ్లు చెప్పిన పథకాలు వచ్చాయా అంటూ ప్రశ్నించారు.

సిట్‌ దర్యాప్తునకు బ్రేక్.. డీజీపీ కీలక వ్యాఖ్యలు..

ఏపీలో సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో దూకుడు తగ్గించింది సిట్‌.. ఈ నెల 3వ తేదీ వరకు పోలీస్‌ గెస్ట్‌ హౌస్‌కు సిట్‌ పరిమితంకానుంది.. అయితే, గత మూడు రోజుల్లో కీలకమైన ఆధారాలు సేకరించారు సిట్‌ అధికారులు.. ఇక, తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు.. 3వ తేదీ వరకు సిట్ విచారణ నిలిపివేశామని ప్రకటించారు.. తదుపరి సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు విచారణ ఉంటుందన్నారు.. కల్తీ నెయ్యి పై అంశంపై ఏర్పాటైన సిట్ బృందం పరిశీలన జరుపుతున్న సమయంలో.. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో సిట్ దర్యాప్తు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు వెల్లడించారు డీజీపీ..

ఇక నుంచి హైదరాబాద్‌లో డీజే నిషేధం

నేటి నుండి హైదరాబాద్‌లో డీజే పై నిషేధం విధించారు. శబ్ద కాలుష్యం వల్ల డీజేను నిషేధిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాదులో డయల్ 100కు ఫిర్యాదులు రావటంతో నగరంలోని రాజకీయ పార్టీ ప్రతినిధులు , అన్ని మత పెద్దలతో చర్చ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. డీజే, సౌండ్ మిక్సర్, హై సౌండ్ ఎక్విప్‌మెంట్ పరికరాలపై నిషేధాజ్ఞలు విధించబడ్డాయి. రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అనుమతి ఉన్న ప్రాంతాల్లో తక్కువ శబ్దంతో అనుమతించనున్నారు.ఆసుపత్రులు, స్కూళ్లు, కాలేజీలు, కోర్టు ప్రాంగణాలకు 100 మీటర్ల దూరంలో నిషేధాజ్ఞలు జారీ అయ్యాయి.

మూసి ప్రక్షాళనను అడ్డుకుంటే ప్రత్యేక ఉద్యమం చేస్తాం..

మానవత్వం ఉన్న మనుషులైతే మూసీ ప్రక్షాళనకు మద్దతు ఇస్తారని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. మూసి నరకం నుంచి నల్గొండ జిల్లా ప్రజలకు విముక్తి కలుగుతుందన్నారు. మూసి పరివాహక ప్రాంతాల్లో పండే పంటలో ఐరన్ ఎక్కువ అని ప్రియాంకా వర్గీస్ స్టడీ రిపోర్ట్ ఇచ్చారన్నారు. ఓ వైపు ఫ్లోరిన్.. ఇంకో వైపు మూసి అంటూ మంత్రి తెలిపారు. నల్గొండ అంటే కేటీఆర్‌కు ఎందుకు అంత కోపమని ప్రశ్నించారు.మల్లన్న సాగర్ లో పోలీసులను పెట్టి రైతులను ఎందుకు ఖాళీ చేయించారని ప్రశ్నించారు. దమ్ముంటే మూసి మీద చర్చకు రావాలన్నారు. అసెంబ్లీ లో చర్చ పెడతామన్నారు. మూసీపై కేటీఆర్, హరీష్ రీసెర్చ్ చేయాలన్నారు. మూసీ ప్రక్షాళనలో ప్రజలను ఒప్పిస్తామని, వారికి సాయం చేస్తామన్నారు. బాధిత కుటుంబాలకు డబుల్‌బెడ్‌రూం ఇస్తామన్నారు.

ముడా స్కామ్లో కీలక పరిణామం.. భూమిని తిరిగి ఇచ్చేస్తానన్న సీఎం భార్య..

ముడా స్కామ్ వ్యవహారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ముడా వివాదానికి సంబంధించి సీఎంపై ఈడీ కేసు నమోదు చేయడంతో.. ఆయన భార్య పార్వతి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈరోజు (సోమవారం) ఓ లేఖను రిలీజ్ చేసింది. అందులో అవినీతి మరకలేని తన భర్త రాజకీయ జీవితానికి ముప్పు తెస్తున్న ఈ 14 ప్లాట్లను తిరిగి ‘ముడా’కు ఇచ్చేస్తున్నట్లు వెల్లడించింది. అలాగే, మా అన్నయ్య పసుపు కుంకుమల కింద ఇచ్చిన ఈ ప్లాట్లు ఇంత రాద్దాంతం చేస్తాయని తాను ఊహించలేదు కన్నడ సీఎం సతీమణి పార్వతి తెలిపింది. నా భర్త గౌరవం, ఘనతకు మించి ఈ ఆస్తులు పెద్దవి ఏం కాదని చెప్పుకొచ్చింది. ఇన్నాళ్లు ఆయన అధికారం నుంచి తాము ఏమీ ఆశించలేదు.. మాకు ఈ ఆస్తులు తృణప్రాయం. అందుకే ఈ స్థలాలను తిరిగి మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కు (ముడా) అప్పగిస్తున్నాను అని ప్రకటించింది. ఈ విషయంలో నా భర్త అభిప్రాయం ఏంటో నాకు తెలియదు.. నా కుటుంబ సభ్యులతోనూ చర్చించకుండా నాకు నేనుగా తీసుకున్న నిర్ణయం ఇది అన్నారు.

బాలింత కష్టంపై స్పందించిన ప్రభుత్వం.. రోప్ వే బ్రిడ్జి మంజూరు

అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం సుందరికొండలో గత వారం ఓ బాలింతను కుటుంబ సభ్యులు ప్రమాద‌క‌ర ప‌రిస్థితుల్లో భుజంపై మోసుకెళ్లిన ఘటన అందరినీ కలిచి వేసింది. బాలింతను కుటుంబ సభ్యులు పెద్దేరువాగు దాటించారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి వీడియో వైరల్ అయింది. ఈ క్రమంలో.. బాలింత కష్టంపై ప్రభుత్వం స్పందించింది. దీనిపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందించారు. స్థానిక ఎమ్మెల్యే, సంబంధిత అధికారులతో సంధ్యారాణి మాట్లాడారు. వాగు దాటేందుకు బాలింతలు పడుతున్న కష్టాలను చూసి మంత్రి గుమ్మడి సంధ్యారాణి చలించిపోయారు. బాలింతలు వాగు దాటేందుకు.. రోప్ వే బ్రిడ్జిని మంత్రి గుమ్మడి సంధ్యారాణి మంజూరు చేయించారు. రూ. 70 లక్షలతో అధికారులు ఎస్టిమేషన్ వేశారు. వర్షాలు తగ్గాక త్వరలో రోప్ వే బ్రిడ్జి పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యే శిరీష దేవి చొరవతో రోప్ వే బ్రిడ్జి మంజూరు కావడం పట్ల గిరిజనులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రజనీకాంత్ డిశ్చార్జ్ కావడానికి ఎన్ని రోజులు పడుతుందంటే?

సూపర్ స్టార్ రజనీకాంత్ ఈరోజు ఉదయం అకస్మాత్తుగా అనారోగ్య సమస్యలతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరడం కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని షాక్ కి గురి చేసింది. రజనీకాంత్‌కు ఇచ్చిన చికిత్స గురించి పత్రికా ప్రకటనలో, “కార్డియాలజిస్ట్ సాయి సతీష్ నేతృత్వంలోని ముగ్గురు వైద్యుల బృందం ఈ రోజు ఉదయం 6 గంటలకు రజనీకాంత్‌కు చికిత్స చేసింది. విజయ్ రెడ్డి – న్యూరాలజిస్ట్ బాలాజీ కూడా రజనీకాంత్‌కు చికిత్స చేశారు’’ అని పేర్కొన్నారు. ఇక రజనీకాంత్‌కు ఒక్కసారిగా మూత్ర విసర్జన సమస్య రావడంతో పొట్ట కింది భాగంలో వాపు వచ్చింది, దీంతో రజనీని ఆస్పత్రిలో చేర్చారు. ఇందుకోసం ఆయన కడుపులో స్టెంట్ అమర్చారని, స్టెంట్ అమర్చిన తర్వాత రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని వార్తలు వస్తున్నాయి. శస్త్ర చికిత్స అనంతరం కొన్ని గంటల పాటు ఐసీయూలో ఉన్న రజనీకాంత్‌ను ఇప్పుడు సాధారణ వార్డుకు తరలించారు. రజనీకాంత్‌ను చూసేందుకు కుటుంబ సభ్యులు కూడా పూర్తి సెక్యూర్డ్ వాతావరణంలో వెళ్లాలి.

అతనే ఇజ్రాయెల్ గుఢచారి.. ఇరాన్లో డబుల్‌ ఏజెంట్లు ఉన్నారు..

ఇజ్రాయెల్‌పై నిఘా కోసం ఏర్పాటు చేసిన ఓ ఇంటెలిజెన్స్‌ అధిపతే చివరికి మమల్ని మోసం చేశాడని ఇరాన్‌ మాజీ అధ్యక్షుడు మహముద్‌ అహ్మదిన్‌జాద్‌ పేర్కొన్నారు. అతడు మా సమాచారం మొత్తం ఇజ్రాయెల్‌కు చేరవేసేవాడని ఆరోపణలు చేశాడు. టెహ్రాన్‌లో మొస్సాద్‌ సంస్థ ఏ స్థాయిలో వెళ్లిందో తెలియజేస్తూ.. ఈ విషయాన్ని ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. కాగా, మొస్సాద్‌ విజయవంతంగా మా ఇంటెలిజెన్స్‌ యూనిట్స్‌ను తన వైపునకు తిప్పుకుందని ఇరాన్ మాజీ అధ్యక్షుడు అహ్మదిన్‌జాద్‌ తెలిపారు. వీరిలో దాదాపు 20 మంది ఇంటెలిజెన్స్‌ సిబ్బంది డబుల్‌ ఏజెంట్లుగా మారి.. ఇజ్రాయెల్‌కు అత్యంత కీలకమైన అణు రహస్యాలను అందించారని పేర్కొన్నాడు. ఈ కామెంట్స్ తో ఇరాన్‌ భద్రత, నిఘా వ్యవస్థలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయాయి. మా నిఘా సంస్థకు చెందిన ఓ అధిపతే ఇజ్రాయెల్‌ గూఢచారని 2021లోనే బయటకు వచ్చింది. ఇరాన్‌లో టెల్‌అవీవ్‌ అత్యంత కఠిన ఆపరేషన్లు నిర్వహించి తేలిగ్గా కీలక సమాచారం చేజిక్కించుకొంటదని చెప్పుకొచ్చారు. ఇటీవల కాలంలో మొస్సాద్‌ కార్యకలాపాలు మరింత పెరిగిపోయాయని మహముద్‌ అహ్మదిన్‌జాద్‌ వెల్లడించారు.

నిర్వాసితుల కష్టాలపైన అప్పటి మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు ఏ నాడు మాట్లాడలేదు..

కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు భూ నిర్వాసితులను పట్టించుకోలేదని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిర్వాసితుల కష్టాల పైన అప్పటి మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు ఏ నాడు మాట్లాడలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రైతులను బెదిరించి భూములు లాక్కున్నారని ఆయన వెల్లడించారు. నిర్వాసితులను కలవకుండా ప్రతిపక్ష నాయకులను హౌస్ అరెస్ట్ చేశారని, ఎకరం 30 లక్షల రూపాయల విలువ చేసే భూములను సరైన పరిహారం ఇవ్వకుండా లాక్కున్నారన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో రెండు వేల ఎకరాలను రైతుల నుంచి తీసుకున్నారని, నిర్వాసితుల కోసం పోరాడిన మాపైన అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారన్నారు అడ్లూరి లక్ష్మణ్‌. నిర్వాసితుల గురించి మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ కు లేదని, హైదరాబాద్ నాలాల పైన 28 వేల అక్రమ కట్టడాలున్నాయని అధికారంలో ఉన్నప్పుడు కేసీఆరే చెప్పాడన్నారు. మూసీ రివర్ బెడ్ లో నివాసం ఏర్పాటు చేసుకున్న వారు స్వచ్ఛందంగా ఖాళీ చేస్తున్నారని, మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూం లు ఇస్తున్నామని ఆయన తెలిపారు. మూసీ నిర్వాసితులను బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

 

Show comments