NTV Telugu Site icon

Tomato Price: కిలో రూ.2… లబోదిబోమంటున్న టమోటా రైతులు

Tomato 1

Tomato 1

టమోటా ధర ఒక్కోసారి వినియోగదారులకు కన్నీళ్ళు తెప్పిస్తుంటుంది. నిన్న మొన్నటి వరకూ కేజీ 40-50 రూపాయలు పలికిన ధర ఇప్పుడు దిగి వచ్చింది. అయితే, రైతులకు మాత్రం నష్టాల్ని మిగులుస్తోంది. కర్నూలు జిల్లా పత్తికొండలో దారుణంగా పతనమైంది టమోటా ధర. అక్కడ కేవలం కిలో 2 రూపాయలు కూడా పలకకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. టమోటాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. నిన్న మొన్నటి వరకు ఆకాశాన్ని అంటిన టమోటా ధర ఒక్కసారిగా కుప్పకూలింది. కిలో టమోటా రెండురోజుల క్రితం 5 రూపాయలకు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందారు. తాజాగా కనీసం ఆ ధర కూడా లభించకపోవడంతో మార్కెట్ వరకూ తేవడానికి అయిన రవాణా ఖర్చులు కూడా రాక ఇబ్బంది పడుతున్నారు.

Read Also: Ponnam Prabhakar: ఆ కర్మాగారం ప్రారంభించడం.. అయిపోయిన పెళ్లికి మేళం వంటిది

కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో టమోటా రేట్లు ఓ రోజు తక్కువ గాను,మరో రోజు ఎక్కువగా ఉంటుంటాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు కిలో టమోటా 100 రూపాయలు పలికిన ధర.ప్రస్తుతం మార్కెట్ లో ఓ రోజు 10 రూపాయలు,మరో రోజు 5 రూపాయలకు, తాజాగా 2 రూపాయలకు పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రైతులు తమకు గిట్టుబాటు ధర కిలో టమోటా 30 రూపాయలకంటే ఎక్కువగా వుంటేనే గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు.

ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో అధిక వర్షాలు రావడంతో టమోటా పంటలు దెబ్బతినడంతో గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక్కసారిగా కిలో టమోటా 60 రూపాయల వరకూ ధర పలికింది. దీంతో కిలో టమోటా కూడా కొనలేక వినియోగదారులు ఆందోళన చెందారు. ఇప్పుడు వినియోగదారులు మార్కెట్లో 20 నుంచి 25 రూపాయల వరకూ కిలో టమోటా కొనుగోలు చేస్తున్నారు. కానీ రైతులకు మాత్రం గిట్టుబాటు కావడం లేదు. మధ్యలో దళారులు లాభపడుతున్నారని రైతులు అంటున్నారు. ఓ రోజు టమోటా రేట్లు పెరగడం మరో రోజు తగ్గడం మంచిది కాదని రైతులు అంటున్నారు. వేలకు వేలు పెట్టుబడిపెట్టి వేసిన టమోటా కూలి ఖర్చులు కూడా రావడంలేదని రైతులు అంటున్నారు. ఈ పరిస్థితి రాకుండా వుండాలంటే.. పత్తికొండ ప్రాంతంలో టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Read Also: Chandrababu Naidu: హైదరాబాద్‌లో టెక్నాలజీ నా చలవే!