Ponnam Prabhakar Demands To PM Narendra Modi: రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రధానమంత్రి మోడీ ప్రారంభించడం.. అయిపోయిన పెళ్లికి మేళాలు వహించినట్టుందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కౌంటర్లు వేశారు. మూతపడ్డ ఆ పరిశ్రమను ప్రారంభించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.15,000 కోట్లు ఇచ్చిందని.. ఏడాదిన్నరగా ఎరువులు ఉత్పత్తి కూడా కొనసాగుతోందని అన్నారు. ఇప్పుడు దాన్ని కొత్తగా ప్రారంభించడం ఏంటో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన మోడీ.. ప్రజలకు క్షమాపణ చెప్పి, ఆ తర్వాతే రాష్ట్రంలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. అసలు విభజన హామీలను అమలు చేయని ప్రధాని.. ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారని నిలదీశారు.
తెలంగాణ కోసం ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసి, ఎందరో ప్రాణాలు అర్పిస్తే.. సుష్మా స్వరాజ్ లోక్ సభలో మద్దతు ఇచ్చారని, ఆ తర్వాతే తెలంగాణ బిల్లు పాస్ అయ్యిందని పొన్నాల ప్రభాకర్ గుర్తు చేసుకున్నారు. అయితే.. ఆ తెలంగాణ బిల్లును కించపరిచే విధంగా, పార్లమెంట్‌లో తలుపులు మూసి దొంగతనంగా బిల్లును ప్రవేశపెట్టారని, తెలంగాణ ఏర్పాటనేది దేశ విభజన కోరుకునేవారు చేశారని, తల్లిని చంపి బిడ్డను బ్రతికించారని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారన్నారు. అందుకే క్షమాపణ చెప్పి, తెలంగాణ గడ్డపై కాలుమోపాలని మోడీని డిమాండ్ చేశారు. తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం బొగ్గు గనులు, ఎయిమ్స్, తెలంగాణలో మెడికల్ కాలేజీలు, రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల ఏర్పాటు పట్ల.. ఇప్పటికీ మోడీ వివక్ష చూపుతూనే ఉన్నారన్నారు. వీటి మీద ప్రశ్నించాల్సిన టీఆర్ఎస్ పార్టీ.. ఎనిమిదేళ్లుగా బీజేపీకి అనుబంధ సంస్థగా పనిచేస్తోందని ఆరోపించారు.
దేశంలో మూతపడి ఉన్న 5 కర్మాగారాలను తిరిగి ప్రారంభించాలని 2013లోనే ఆనాటి ప్రధాని మన్‌మోహన్ సింగ్ నిర్ణయించారని.. కాంగ్రెస్ పుణ్యంతోనే రామగుండం ఎరువుల కర్మాగార పునరుద్ధరణ జరుగుతోందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. 1999లో బీజేపీ ప్రభుత్వ హయాంలో ఆ సంస్థ మూసివేయబడిందని.. 1999-2004 వరకు ఉన్న బీజేపీ ప్రభుత్వం దాన్ని తెరిచే ప్రయత్నం చేయలేదని తూర్పారపట్టారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కర్మాగారంపై ఉన్న రుణాలు, బ్యాంకు అప్పులు మొత్తం రూ. 10 వేల కోట్లు మాఫీ చేశారన్నారు. 2013లో రూ.5,600 కోట్ల పెట్టుబడితో ఆ ఫ్యాక్టరీని పునఃప్రారంభించడానికి కేబినేట్ తీర్మానం చేసిందని, సీసీఈఏలో సైతం ఆమోదం తెలిపిందని అన్నారు. 2019లో ట్రయల్స్ పూర్తి చేసుకొని.. ఏడాదిన్నర క్రితం ఉత్పత్తి ప్రారంభించిందన్నారు.