YS Jagan: తిరుపతిలో దళిత విద్యార్థిపై దాడి.. అధికార పార్టీ డైరెక్షన్‌లో కక్షసాధింపు చర్యలు

  • తిరుపతిలో దళిత ఇంజినీరింగ్‌ విద్యార్థిపై దాడిని ఖండించిన వైఎస్ జగన్..
  • చంద్రబాబు, అధికార పార్టీ డైరెక్షన్‌లో కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి..
  • పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను పోలీసులు పూర్తిగా విస్మరించారు: వైఎస్ జగన్
Jagan

Jagan

YS Jagan: తిరుపతిలో ఇంజినీరింగ్‌ చదవుతున్న దళిత విద్యార్థి జేమ్స్‌పై దాడిని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన.. రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. దళితులు, తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాల వారికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది అని చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు, అధికారపార్టీ నాయకుల డైరెక్షన్‌లో కక్షసాధింపు చర్యల్లో మునిగితేలుతున్న పోలీస్ యంత్రాంగం.. పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వైఎస్ జగన్ ఆరోపించారు.

Read Also: Rohini : లగ్జరీ విల్లా కొన్న బిగ్ బాస్ రోహిణి..

అయితే, రాష్ట్రంలో ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట దళితులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయని మాజీ సీఎం జగన్ అన్నారు. పోలీస్‌ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోవడమే కాదు, ఫిర్యాదు దారుల మీదే ఎదురు కేసులు పెట్టడం పరిపాటిగా మారింది అని ఆరోపించారు. ఇంజినీరింగ్ విద్యార్థి జేమ్స్‌పై దాడి ఘటనలో పోలీస్ యంత్రాంగం వైఫల్యమే కాదు, రాజకీయ జోక్యంతో కనీసం ఫిర్యాదును కూడా స్వీకరించలేని పరిస్థితి నెలకొంది అన్నారు. తిరుపతి ఘటనకు కారకులైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ మోహన్ రెడ్డి డిమాండ్‌ చేశారు.