Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!

Palla Srinivasa Rao

Palla Srinivasa Rao

Palla Srinivasa Rao: తిరుపతిలో పర్యటనలో ఉన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల కంటే తమకు సార్వత్రిక ఎన్నికలే ముఖ్యమని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో గెలుపు అవకాశాలున్న అభ్యర్థులకే టికెట్లు ఇస్తామని తెలిపారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చే సిఫార్సులను ఎన్డీయే కోఆర్డినేషన్ కమిటీ పరిశీలిస్తుందని, అభ్యర్థులపై తుది నిర్ణయం ఆ కమిటీలోనే ఉంటుందన్నారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర నాయకత్వం కలిసి తుది నిర్ణయం తీసుకుంటుందని.. మేయర్ పదవులపై బీజేపీ, జనసేనకు వారి డిమాండ్లు ఉన్నాయని, అభ్యర్థుల ఎంపికకు సర్వేలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

స్వప్రయోజనాల కోసం కొందరు పార్టీని వీడే అవకాశం ఉందని, అలా పార్టీ మారిన వెంటనే వారికి సీట్లు ఇచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేశారు పల్లా శ్రీనివస్‌.. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపించారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చినా వైసీపీ నేతల తీరు మారలేదని విమర్శించారు. వైసీపీ నేతలు రెచ్చగొట్టే ధోరణిని వీడలేదని అన్నారు. హిందూ మతం, సనాతన ధర్మం విషయంలో వైసీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని, టీడీపీ, జనసేన పేర్లతో విదేశాల్లో ఫేక్ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందని పల్లా శ్రీనివాస్ ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సమన్వయం, అభ్యర్థుల ఎంపిక, సీట్ల పంపకం వంటి అంశాలపై కూటమి నాయకత్వం వరుసగా చర్చలు జరుపుతోన్న విషయం విదితమే..