EC Meeting With Rayalaseema SPs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు తిరుపతి జిల్లా కలెక్టరేట్లో కీలక సమావేశం నిర్వహించనుంది. రాయలసీమ పరిధిలోని 12 జిల్లాల ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భేటీ కానున్నారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన ఘటనల నివేదికలతో పాటు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై సమావేశంలో చర్చించనున్నారు.
గతంలో పులివెందుల, రాయచోటి, పుంగనూరు, కడప సహా రాయలసీమలోని పలు ప్రాంతాల్లో జరిగిన దాడులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులు, గత ఎన్నికల్లో చోటుచేసుకున్న ఘటనలపై అధికారులు సమీక్షించే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీలకు ఎన్నికల కమిషనర్ దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా రాబోయే పంచాయతీ ఎన్నికల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించడం, ఆయా ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించడం వంటి అంశాలపై సమీక్షించనున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పకడ్బందీగా అమలయ్యేలా పోలీసు అధికారులకు సూచనలు ఇవ్వనున్నారు.
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఈ భేటీకి రాయలసీమ రేంజ్ డీఐజీలు, ఆయా జిల్లాల ఎస్పీలు హాజరుకానున్నారు. మొత్తంగా.. పంచాయతీ ఎన్నికల వేళ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతోంది ఎన్నికల కమిషన్.. ముఖ్యంగా గతంలో జరిగిన హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా.. జాగ్రత్తలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.. ఈ నేపథ్యంలో.. ఇవాళ్టి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది..

