NTV Telugu Site icon

TTD: శ్రీవారి నడకదారి భక్తులకు టీటీడీ కీలక సూచనలు.. వాళ్లు రావొద్దు..!

Ttd

Ttd

TTD: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతీరోజూ వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.. ఇక, శ్రీవారిని నడకమార్గంలో వెళ్లి దర్శించుకునే భక్తుల సంఖ్య కూడా పెద్ద సంఖ్యలో ఉంటుంది.. ప్రముఖుల సహా వేలాది మంది భక్తులు ప్రతీరోజు నడకమార్గంలో వెళ్లి.. శ్రీవారికి మొక్కులు చెల్లించుకుంటారు.. అయితే, ఈ మధ్య జరుగుతోన్న ఘటనలు దృష్టిలో ఉంచుకుని శ్రీవారి నడకదారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సూచనలు చేసింది.. ఇటీవలికాలంలో తిరుమలకు కాలి నడకన వస్తున్న భక్తుల్లో గుండె సంబంధిత కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ పలు సూచనలు చేస్తోంది..

Read Also: DY Chandrachud: ఢిల్లీలో కాలుష్యం వల్ల మార్నింగ్ వాక్ చేయడం మానేశాం..

భక్తులకు టీటీడీ చేసిన సూచనలు:
* 60 ఏళ్లు దాటిన వృద్ధులు, మధుమేహం, అధిక రక్తపోటు, ఉబ్బసం, మూర్ఛ, కీళ్ల వ్యాధులు ఉన్న భక్తులు తిరుమలకు కాలినడకన రావడం మంచిది కాదు.
* ఊబకాయంతో బాధపడుతున్న భక్తులు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తిరుమల కొండకు నడక దారిన రావడం శ్రేయస్కరం కాదు.
* తిరుమల కొండ సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండటం కారణంగా ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుంది. కాలినడకన రావడం చాలా ఒత్తిడితో కూడుకున్నది.. కాబట్టి గుండె సంబంధిత వ్యాధులు, ఉబ్బస వ్యాధిని తీవ్రతరం చేసే అవకాశం ఉంది.. కనుక భక్తులు తదనగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
* దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులు వారి రోజువారి మందులు వెంట తెచ్చుకోవడం ద్వారా సమస్యలను నివారించవచ్చు.
* కాలినడకన వచ్చే భక్తులకు ఏమైనా సమస్యలు ఎదురైతే అలిపిరి కాలిబాట మార్గంలోని 1500 మెట్టు, గాలి గోపురం, భాష్యకార్ల సన్నిధి వద్ద వైద్య సహాయం పొందవచ్చు.
* తిరుమలలోని ఆశ్వినీ ఆసుపత్రి, ఇతర వైద్యశాలల్లో 24×7 వైద్య సదుపాయం పొందవచ్చు.
* దీర్ఘకాలిక కిడ్ని వ్యాధిగ్రస్తులకు అత్యవసర పరిస్థితుల్లో తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్ సౌకర్యం అందుబాటులో ఉంది.

తిరుమలకు కాలినడకన రాదలచిన భక్తులు పై సూచనలను తప్పనిసరిగా పాటించాలని.. తమకు సహకరించాలని ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసిన టీటీడీ..