Pavithrotsavam 2024: తిరుమలలో ఇవాళ్టి నుంచి మూడు రోజులు పాటు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి.. ఈ మూడు రోజులు పాటు ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ.. 18వ తేదీన కళ్యాణోత్సవ సేవ కూడా రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు.. ఇక, తిరుమలలో పవిత్రోత్సవాలకు బుధవారం రోజు అంకురార్పణ జరిగింది.. రాత్రి 7 గంటలకు మాడవీధులలో శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు ఊరేగారు.. కాగా, శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు శాస్రోక్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ.. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం జాతశౌచం, మృతశౌచం వంటి సమయాల్లో తెలిసో తెలియకో భక్తులు, సిబ్బందిచే కలిగే దోషాల వలన ఆలయం పవిత్రతకు ఎటువంటి భంగం వాటిల్లకుండా ఉండేందుకే మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవమే పవిత్రోత్సవం. పవిత్రోత్సవాలలో మొదటి రోజు శ్రీవారి ఆలయంలోని యాగశాలలో హోమాన్ని నిర్వహించి పవిత్ర ప్రతిష్ట చేస్తారు. అనంతరం స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం కార్యక్రమం నిర్వహిస్తారు అర్చకులు. ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం కార్యక్రమాని నిర్వహించిన అనంతరం శ్రీవారి మూలవిరాట్‌తో పాటు ఉత్సవమూర్తులు, అనుబంధ ఆలయాలలో అర్చకులు పవిత్రాలు సమర్పిస్తారు. దీంతో మొదటి రోజు కార్యక్రమం పరిసమాప్తమవుతుంది.
Read Also: Independence Day 2024: ఎర్రకోటపై స్వాతంత్య్ర వేడుకలు.. జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం
ఇక, రెండోవ రోజు వైఖానస అగమ శాస్త్రం ప్రకారం అర్చకులు పవిత్రోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో ఏవైనా పొరపాట్లు జరిగి వున్న మరియు భక్తుల వల్ల ఏదైనా దోషాలు జరిగి వుంటే తొలగిపోవాలంటూ పవిత్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అర్చకులు. మొదట స్వామి, అమ్మ వారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం స్వామి వారి మూల విరాట్‌కు అనుబంధ ఆలయాల్లో ఉన్న విగ్రహాలకు పవిత్ర మాలలు సమర్పించడంతో కార్యక్రమం ముగియనుంది.. మరోవైపు.. తిరుమలలో మరమ్మతుల కారణంగా శ్రీవారి పుష్కరిణి మూసివేసిన విషయం విదితమే.. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పుష్కరిణిలోకి భక్తులను అనుమతించనుంది టీటీడీ.. ఇక, చిరుతల సంచారం కారణంగా ఘాట్ రోడ్‌లో ద్విచక్ర వాహనాల పై ఆంక్షలు కొనసాగుతున్నాయి.. సెప్టెంబర్ 30 వరకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ద్విచక్రవాహనాలను అనుమతించనుంది టీటీడీ..