Site icon NTV Telugu

Leaders Variety Route: వైసీపీలో ఆ ఇద్దరు నేతల తీరే సెపరేటు

Atp Ycpo

Atp Ycpo

రాజకీయాల్లో పదవుల కోసం ఆశపడడం, అవి లభించకపోతే అసహనానికి, అసంతృపికి గురికావడం షరా మామూలే. కానీ అనంతపురం జిల్లాలో ఇద్దరు నేతల తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వారిద్దరూ మంత్రి ఆశించి భంగపడ్డారు. నిరాశ నిస్పృహలతో ఉంటారనుకుంటే.. జిల్లాలోకి భారీగా హంగామాతో ఎంట్రీ ఇచ్చారు. భారీ కాన్వాయిలు, గజ మాలలతో ఎంట్రీ ఇచ్చారు. తూచ్.. మంత్రి పదవి కాదు మాకు కావలసింది.. మాకు అసంతృప్తి లేదు.. పార్టీనే ముఖ్యమంటూ సందేశాలు ఇస్తున్నారు. అనంతలో ఇద్దరు నేతలు చేసిన తీరు పాలిటిక్స్ లోనే న్యూ ట్రెండ్ అవుతోంది. అసంతృప్తి కి బదులు ఉరిమే ఉత్సాహంతో వారు ముందుకు సాగడం క్యాడర్ మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తోంది.

రాష్ట్రంలో మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. అనుకున్నది జరగకపోవడంతో తీవ్ర నిరాశలో మునిగిపోయారు. కొందరు బహిరంగంగానే తమ అసంతృప్తి ప్రదర్శించారు. మరికొందరు అధిష్టానం సూచనలతో మెత్తబడ్డారు. ఇంకొందరు అసంతృప్తి ఆగ్రహంతో నియోజకవర్గాల వైపు వెళ్లడం లేదు. కానీ అనంతపురం జిల్లాలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన సంఘటనలు కనిపిస్తున్నాయి. మంత్రి వర్గ రేస్ లో బలంగా పోటీ పడ్డ నేతల్లో రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి కూడా ఒకరు. తమ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఖాయమని నియోజకవర్గంలో నేతలంతా కన్ఫామ్ చేసుకున్నారు. కానీ సామాజికవర్గ సమీకరణల్లో భాగంగా అది జరగలేదు. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి దీనిపై తీవ్ర అసంతృప్తిగా ఉంటారని భావించారు. కానీ సీన్ మరోలా కనిపించింది.

ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మంత్రి రాని సందర్భంలో నిరుత్సాహంతో కనిపిస్తారనుకున్నారంతా. కానీ భారీ హంగామాతో జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చారు. విజయవాడ నుంచి విమానంలో బెంగళూరుకు చేరుకున్నారు. నియోజకవర్గం నేతలంతా వెళ్లి బెంగళూరు నుంచే ఆయనకు స్వాగతం పలికారు. భారీ కాన్వాయితో నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇచ్చారు. అదేంటని అడిగితే మాకు మంత్రి పదవి ముఖ్యం కాదు.. నియోజకవర్గ అభివృద్దే ముఖ్యం.. దాని తరువాతే ఏదైనా అన్నారు ప్రకాష్ రెడ్డి, సీఎం జగన్ పార్టీ పెట్టినప్పుడు తనతో పాటు ఉండాలని ఆదేశించారు. అది జీవితాంతం కొనసాగుతుందని.. మంత్రి పదవులు వచ్చినా.. రాకపోయినా ఇలానే ఉంటుందన్నారు…

ఇక మంత్రి వర్గ రేస్ లో చివరి వరకు వినిపించిన పేర్లలో కాపు రామచంద్రారెడ్డి కూడా ఒకరు. కానీ మంత్రి ఛాన్స్ ఉషాశ్రీ చరణ్ కొట్టేశారు. దీంతో ఆయన వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకంగా బంద్ కు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కాపు నియోజకవర్గానికి వస్తే మంత్రిగా రావాలని లేదంటే.. ఆయన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలన్నారు. ఈ స్థాయిలో అసంతృప్తి ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే కాపు సలహాదారు సజ్జల, సీఎం జగన్ ని కలిశాక కాస్త మెత్తబడ్డారు. ఆ తరువాత ఆయనకు అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి ఇచ్చారు. వాస్తవంగా ఎమ్మెల్యే కాపు మొదటి నుంచి సీఎం జగన్ తో నడుస్తున్న వ్యక్తి. ఎమ్మెల్యే పదవిని సైతం త్యాగం చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి అధ్యక్ష పదవి అన్నది పెద్దది కాదు..కానీ నాకు సీఎం జగన్ మీద అభిమానం ఉంది.. ఆయన ఏం చెప్తే అది చేస్తానని చెప్పారు.

అంతే కాదు ఆయన ఇచ్చిన పదవి మంత్రి పదవి కన్నా ఎక్కువ అంటూ…అధ్యక్షుడిగా నియమితులైన తరువాత తొలిసారి జిల్లాకు వచ్చిన ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి జిల్లాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. కార్యకర్తలు, నాయకులు భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. పదుల సంఖ్యలో వాహనాలతో వెళ్లి నాయకులు భారీ పూలమాలలతో స్వాగతం పలికారు. క్రేన్ లతో గజమాలలు వేస్తూ జిల్లా కేంద్రంలో పెద్ద హాంగామానే సాగింది. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్యే అనంత వెంకట్రామిడ్డి, ఎంపీ రంగయ్య, జడ్పీ ఛైర్ పర్సన్ బోయ గిరిజమ్మ లాంటి వారు స్వాగతం పలికారు. పార్టీ కార్యాలయంలో భారీ జన సందోహం, కేక్ కటింగ్ లు ఇలా బాగా హంగామా సాగింది. ఇదంతా ఏంట్రా అంటే మాకు మంత్రి పదవి రాలేదని చెప్పుకునే ప్రయత్నమేనంటున్నారు. మామూలుగా అయితే మంత్రి పదవి రానందుకు వీరు అసంతృప్తితో ఉండాలి. ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది. వీరిద్దరిని చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. వీరిద్దరి రూటే సెపరేటు అంటూ గుసగుసలాడుకుంటున్నారు.

Read Also: Cyber Honey Trap: ఏజెన్సీలకు పాకిన హనీట్రాప్ జాడ్యం

Exit mobile version