గోదావరిలో అంతకంతకు వరద ఉధృతి పెరుగుతూనే ఉంది.. ఎగువన భద్రాచలం వద్ద గంటగంటకు గోదావరి ప్రవాహం పెరుగుతూ.. మూడో ప్రమాదహెచ్చరిక స్థాయిని దాటుతుండగా.. పోలవరం ముంపు ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి.. ఇక, ధవళేశ్వరం దగ్గర కాటన్ బ్యారేజీకి భారీ స్థాయిలో వరదనీరు వచ్చిచేరుతోంది.. దీంతో.. అదేస్థాయిలో సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. గోదావరి వరద ఉధృతి కారణంగా ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది..
Read Also: Ramappa Temple: అధిక వర్షాలు.. రామప్పకు ముప్పురానుందా..?
ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ప్రస్తుత ఇన్ ఫ్లో 19.23 లక్షల క్యూసెక్కులుగా ఉండగా.. గేట్ల ద్వారా అదేస్థాయిలో అంటే 19. 23లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.. గోదావరిలో క్రమంగా వరద ప్రవాహం పెరిగి.. 22 లక్షల నుంచి 23 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు.. ఇక, వరద ఉధృతి దృష్ట్యా ముందస్తుగా అదనపు సహాయక బృందాలను రంగంలోకి దించుతున్నారు అధికారులు.. సహాయక చర్యల్లో మొత్తం 9 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయి.. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నాయి.. ఇక, పోలవరం ముంపు మండలాల్లో పరిస్థితి దారుణంగా ఉంది.. క్రమంగా నీటమునుగుతుండడంతో.. గ్రామాలను ఖాళీ చేస్తున్నారు ప్రజలు.