రాజ్యసభలో ఖాళీ కానున్న స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 10న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు తెలిపింది. 15 రాష్ట్రాలకు చెందిన 57 మంది ఎంపీల పదవీ కాలం జూన్ 21 నుంచి ఆగస్టు 1లోపు పూర్తి కానుంది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఉండగా.. ఏపీలో నాలుగు స్థానాలు ఉన్నాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 11 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి.
అయితే ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు రాజ్యసభ ఎంపీల సీట్లలో కొన్ని ప్రస్తుతం వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. ఈ నాలుగు సీట్లు వైసీపీకే దక్కనున్నాయి. పదవీ కాలం ముగిసే సభ్యులలో విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. కానీ మళ్లీ ఆయనకే పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. అలాగే మిగతా మూడు స్థానాలకు పలువురు పేర్లు తెరపైకి వస్తున్నాయి. బీసీ కోటాలో నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత బీద మస్తాన్‌రావు, కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి, జగన్ కేసులను వాదించే న్యాయవాది నిరంజన్‌రెడ్డితో పాటు కార్పొరేట్ దిగ్గజం గౌతమ్ ఆదానీ కుటుంబంలో ఒకరికి రాజ్యసభ సభ్యత్వం కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
