ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చల దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు టాలీవుడ్ పెద్దలు.. మంత్రి పేర్నినానిని కలిసి చర్చలు జరపాలని భావిస్తున్నారు. రేపు సినీ ప్రముఖుల బృందం.. మంత్రి పేర్నినానితో సమావేశం అయ్యే అవకాశం ఉంది.. కాగా, గత కొన్ని రోజులుగా ఏపీలో సినిమా థియేటర్లపై అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కొన్ని థియేటర్లను ఇప్పటికే మూసివేశారు. టికెట్ రేట్లు తక్కువగా ఉంటే.. సినిమా థియేటర్లను నడపలేమంటూ.. మరికొందరు స్వచ్ఛందంగా సినిమా థియేటర్లను మూసివేస్తున్నారు. దాంతో.. సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారు.. అయితే, టికెట్ల రేట్లపై ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని సినీ పెద్దలు భావిస్తున్నారు.
సినిమా థియేటర్ల రేట్లపై పలువురు సినీ హీరోల వ్యాఖ్యలతో తాము ఇబ్బందులు పడుతోన్నట్లు కొందరు థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు… ప్రభుత్వంతో చర్చలకు తామే వస్తామని సమయం ఇవ్వాలని కోరారు.. తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని మంత్రి పేర్ని నానిని కోరారు సినిమా థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు.. తమ సమస్యలు చెప్పుకునేందుకు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు సిధ్ధమని మంత్రికి తెలిపారు.. ఇక, రేపు సచివాలయంలో మంత్రి పేర్ని నానితో థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. టాలీవుడ్ నిర్మాతలు రంగంలోకి దిగి.. ఈ సమస్యకు పరిష్కారం చూపే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.. తెరవెనుక కొంతమంది తమ ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు మంత్రితో చర్చలకు సిద్ధమయ్యారు.. అయితే, ఈ సమావేశంపై ప్రభుత్వ వర్గాల నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు.. ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది.. అసలు భేటీ ఉంటుందా? ఉంటే.. ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు.. లాంటి అంశాలు ఆసక్తికరంగా మారాయి.
