Site icon NTV Telugu

న్యూజిలాండ్ యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా తెలుగమ్మాయి

ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు సత్తాచాటుతూనే ఉన్నారు. ఇప్పటికే తెలుగువారు ప్రపంచంలోని పలు దేశాల్లో తమదైన ముద్ర వేసి కీలక పదవులు దక్కించుకుంటున్నారు. తాజాగా ఓ తెలుగమ్మాయి అరుదైన గౌరవం దక్కించుకుంది. న్యూజిలాండ్ యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా తెలుగుమ్మాయి మేఘన ఎంపికైంది. యువతరం ప్రతినిధిగా టీనేజి వయసులోనే ఆమె చట్టసభలోకి ప్రవేశించింది. 18 ఏళ్ల మేఘన వాల్కటో ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తోంది.

Read Also: వైరల్… ‘పుష్ప’ను వాడేసుకున్న అమూల్

మేఘన తల్లిదండ్రులు న్యూజిలాండ్‌లో స్థిరపడ్డారు. ఆమె తండ్రి గడ్డం రవికుమార్ ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరు వాసి. ఆయన 2001లోనే న్యూజిలాండ్ వెళ్లారు. దీంతో అక్కడే పుట్టి పెరిగిన మేఘన… కేంబ్రిడ్జిలోని సెయింట్ పీటర్స్ హై స్కూలులో విద్యను అభ్యసించింది. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే మేఘన అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా శరణార్థులకు చేయూతనివ్వడంలో ఎంతో కృషి చేస్తోంది. ఈ అంశంలో ఆమె కనబర్చుతున్న సేవా దృక్పథమే యూత్ పార్లమెంటు సభ్యత్వం లభించేందుకు కారణమైంది. మేఘన వచ్చే నెలలో ప్రమాణస్వీకారం చేయనుంది. కాగా పార్లమెంట్ సభ్యురాలిగా ఎంపికైన తెలుగమ్మాయి మేఘనకు పలువురు అభినందనలు తెలియచేస్తున్నారు.

Exit mobile version