Site icon NTV Telugu

Tribute To Krishna: సినీ ప్రేక్షకులకు గమనిక.. రేపు విజయవాడలో సినిమా షోలు క్యాన్సిల్

Vijayawada

Vijayawada

Tribute To Krishna: సూపర్‌స్టార్ కృష్ణ మరణంతో టాలీవుడ్ మరోసారి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మహేష్‌బాబు ఫ్యామిలీలో ఈ ఏడాది వరుసగా ఇది మూడో విషాదం కావడంతో అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. జనవరిలో సోదరుడు రమేష్‌బాబు మరణం, ఆగస్టులో తల్లి ఇందిరాదేవి మరణం, నవంబరులో తండ్రి మరణం మహేష్‌బాబును మానసికంగా కుంగదీశాయి. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు కృష్ణ మృతి పట్ల తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు విచారం వ్యక్తం చేశారు. కృష్ణ మృతికి సంతాపంగా బుధవారం ఉదయం విజయవాడ నగర వ్యాప్తంగా సినిమా షోలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సినిమా అభిమానులందరూ ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడతో సూపర్ స్టార్ కృష్ణకు మంచి అనుబంధం ఉందని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు గుర్తుచేసుకున్నారు.

Read Also: Krishna: సూపర్ స్టార్ కృష్ణ తీరని కోరికలు.. ఇన్ని ఉన్నాయా..?

అభిమానులు ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే మరుక్షణమే కృష్ణ స్పందించేవారు అని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు తెలిపారు. ఆయన నటించిన సినిమాలను భార్య విజయనిర్మలతో కలిసి విజయవాడ వచ్చి తొలిరోజు వీక్షించేవారు అని.. ఇప్పుడు అలాంటి వ్యక్తి లేరన్న విషయం తెలియగానే తాము తట్టుకోలేకపోతున్నట్లు పేర్కొన్నారు. తెలుగు చిత్రసీమలో ఎన్నో మార్పులకు మూలకారణం కృష్ణ అని.. అలాంటి వ్యక్తి మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని తెలిపారు. మరోవైపు కృష్ణ మృతికి సంతాపంగా రేపు సినీ పరిశ్రమ కార్యకలాపాలు, షూటింగ్‌లు నిర్వహించవద్దని తెలుగు ఫిలిం ఛాంబర్ విజ్ఞప్తి చేయగా.. రేపు పరిశ్రమను మూసివేస్తున్నట్లు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ప్రకటించింది.

Exit mobile version