Site icon NTV Telugu

Srinivas Goud: దేశ ప్రజలను చైతన్య పర్చడానికే.. కేసీఆర్ వస్తున్నారు

Rinivas

Rinivas

తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు కావాలని తిరుప‌తి వేంకటేశ్వరస్వామి వారిని ప్రార్ధించానని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇవాళ‌ (జూన్ 13న) ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస గౌడ్ కుటుంబ సభ్యులతో‌ కలసి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారి దర్శనం అనంతరం మాట్లాడుతూ..

ప్రధాని పదవి కోసం కేసీఆర్ కేంద్ర రాజకీయాలోకి రావడం లేదని, దేశ ప్రజలను చైతన్య పర్చడానికి కేసీఆర్ వస్తున్నారని మంత్రి చెప్పారు. సహజ వనరులతో తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ది చేశారన్నారు. కేంద్రంలో అధికారం కోసం, బీజేపీ మతాన్ని వాడుకుంటుందని సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి నాయకుడే లేరని ఎద్దేవా చేశారు. ప్రత్యామ్నాయం కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తూన్నారని, తెలంగాణ పోరాట సమయంలో కేసీఆర్‌ని చులకనగా మాట్లాడారని, రాష్ట్రాన్ని సాధించి చూపించారన్నారు. అసాధ్యం అనుకున్న రాష్ట్రాన్ని సాధించి చూపించిన కేసీఆర్ భవిష్యత్త్ లో కేంద్ర రాజకీయలలో విజయం సాధిస్తారని ఆకాంక్షించారు.

పేదవారి కోసం టీటీడీ దేశ వ్యాప్తంగా కళ్యాణ మండపాలు నిర్మించాలని, అన్ని ఆలయాల అభివృద్దికి టీటీడీ సహకారం అందించాలని ఆయన కోరారు. అమెరికాతో సమానంగా చైనా అభివృద్ది చెందిందని, కానీ చైనాతో సమానంగా జనాభా ఉన్న భారతదేశం అభివృద్దిలో వెనుకబడిందన్నారు. అందుకు కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు. కేంద్రంలో సరైన నాయకత్వం కావాలంటే కేసీఆర్ జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు 70 ఏళ్లుగా దేశాన్ని పరిపాలించినా దేశం ముందడుగు వేయలేదన్నారు.

పొరుగుదేశం చైనా అన్ని రంగాల్లో దూసుకెళ్తుంటే భారత్ మాత్రం వెనుకబడి పోయిందని, కేంద్రంలో ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వాల వైఫల్యాలే అందుకు కారణమన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి బియ్యం దిగుమతి నుంచి దేశానికి బియ్యం ఎగుమతి చేస్తున్నాం, కరెంట్ కోతల నుంచి మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. తెలంగాణ మోడల్‌ను ఆదర్శంగా తీసుకుని దేశాన్ని సైతం అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలంటే అందుకు సమర్థుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. తెలివితేటలు, నైపుణ్యంతో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలకపాత్ర పోషిస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

Sabitha Indra Reddy: ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టిన సీఎంకు కృతజ్ఞతలు

Exit mobile version