NTV Telugu Site icon

Andhra Pradesh Assembly: అసెంబ్లీలో గందరగోళం.. సీఎం ఢిల్లీ పర్యటన వివరాలు బహిర్గతం చేయాలి..

Andhra Pradesh Assembly

Andhra Pradesh Assembly

Andhra Pradesh Assembly: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాల్లో ఆందోళన పర్వం కొనసాగుతూనే ఉంది.. ఇవాళ సభ ప్రారంభం అయిన వెంటనే ఆందోళనకు దిగారు తెలుగుదేశం పార్టీ సభ్యులు.. స్పీకర్ పోడియాన్ని చుట్టు ముట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు.. తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు.. సీఎం వైఎస్‌ జగన్ ఢిల్లీ పర్యటనల వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు.. కాగా, సీఎం జగన్ ఢిల్లీ పర్యటనల వివరాలు సభ ముందు ఉంచాలంటూ టీడీపీ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చింది.. సీఎం జగన్ చాలా సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్‌షాను కలిసినా ఆ విషయాలు ప్రజలకు వెల్లడించడంలేదని.. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే సీఎం జగన్.. ఢిల్లీకి వెళ్లారు.. ఢిల్లీ పర్యటనలో ప్రధాని, హోం మంత్రితో భేటీ వివరాలను సభ ముందు ఉంచాలని పట్టుబట్టారు.

Read Also: Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వివరాలు బహిర్గతం చేయాలంటూ డిమాండ్‌ చేసిన టీడీపీ సభ్యులు.. ఢిల్లీ వెళ్లి ఏం సాధించుకొచ్చారంటూ నిరసన చేపట్టారు.. పోలవరానికి నిధులెంత తెచ్చారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రత్యేక హోదా తెచ్చారా అంటూ నినాదాలు చేశారు.. వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ ఏమైందంటూ నిరసన తెలిపారు. అప్పర్ భద్ర ఆపారా ? విశాఖ రైల్వేజోన్ తెచ్చారా అంటూ కాలినడకన అసెంబ్లీకి వెళ్లారు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఇక, ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. బాబాయ్ హత్య కేసులో సీబీఐ అడుగు ముందుకేస్తే సీఎంకు ఢిల్లీ గుర్తుకొస్తుంది. కేసుల మాఫీ కోసమే సీఎం ఢిల్లీ వెళ్లారని మాకున్న సమాచారం అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక వైఎస్‌ జగన్ 18 సార్లు ఢిల్లీ వెళ్లి 31 రోజులు పాటు అక్కడ ఉన్నారని విమర్శించారు. అసలు ఎందుకు అన్నిసార్లు ఢిల్లీ వెళ్లారో ప్రజలెవ్వరికీ తెలియదన్నారు. ఇవాళ శాసనసభలో ఢిల్లీ పర్యటన వివరాలు చెప్పి తీరాలి.. కీలక బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే ఆదరా బాదరాగా ఢిల్లీ ఎందుకు వెళ్లారో ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు టీడీపీ సభ్యులు.

Show comments